పార్లమెంట్ సమావేశాల్లో జనాభా నియంత్రణ బిల్లు..?

జనాభా నియంత్రణ, ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టాలని పలువురు భాజపా ఎంపీలు యోచిస్తున్నారు. జులై 19న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. తొలి వారంలోనే ఈ ప్రైవేటు బిల్లులను సభ ముందుకు తీసుకురానున్నారు.

ఉభయ సభల సెక్రెటేరియట్లు విడుదల చేసిన సమాచారం ప్రకారం లోక్సభలో ఎంపీ రవికిషన్, రాజ్యసభలో కిరోరి లాల్ మీనా.. ఈ బిల్లులను జులై 24న ప్రవేశపెట్టనున్నారు. జనాభా నియంత్రణపై మరో రాజ్యసభ ఎంపీ రాకేశ్ సిన్హా సైతం నోటీసు ఇచ్చారు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలన్ని కనే దంపతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందించకూడదని ప్రతిపాదిత చట్టంలో పేర్కొన్నారు. జనాభా పెరుగుదల దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తోందని చెప్పారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వ చట్టం అత్యావశ్యకమని అన్నారు.
ప్రతిపాదిత ఉమ్మడి పౌరస్మృతి, జనాభా నియంత్రణ చట్టాలను భాజపా తన సైద్ధాంతిక అజెండాలో భాగంగా పరిగణిస్తోంది. అయితే, వీటిపై దేశంలో వివిధ వర్గాల నుంచి భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రైవేటు బిల్లు అంటే?
మంత్రులు కాకుండా సాధారణ ఎంపీ ప్రవేశపెట్టే బిల్లులను ప్రైవేటు బిల్లులు అంటారు. ప్రభుత్వ మద్దతు లేకుండా రూపొందే ఈ బిల్లులు.. చట్టరూపం దాల్చే అవకాశం చాలా తక్కువ. 1970 నుంచి ఒక్క ప్రైవేటు బిల్లు కూడా పార్లమెంట్ గడప దాటలేదు. మొత్తంగా 14 ప్రైవేటు బిల్లులు పార్లమెంట్లో చట్టాలుగా మారాయి.
జనాభా నియత్రణ బిల్లుపై యోగి సర్కార్ కసరత్తు..

మరోవైపు యోగి సర్కార్ సైతం జనాభా నియంత్రణ కోసం ఉత్తరప్రదేశ్ పాపులేషన్ యాక్ట్-2020ని తీసుకొచ్చింది. ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్నవారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్లాన్ చేసింది. ఈ ముసాయిదాపై జూలై 19 లోగా ప్రజలు తమ స్పందన తెలపాలని స్టేట్ లా కమిషన్ గడువు పెట్టింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఈ బిల్లును ప్రభుత్వానికి కమిషన్ అందించనుంది.
కాగా ఒక సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని యోగి ఈ ప్రతిపాదన చేస్తున్నారని కొందరి వాదన. విద్య, సామాజిక చైతన్యం అంతగా లేని గ్రామీణ, సామాజిక బలహీన వర్గాల ప్రయోజనాలను ఈ బిల్లు దెబ్బతీస్తుందని విశ్లేషకుల మాట. కాంగ్రెస్, సమాజ్‌వాదీ లాంటి ప్రతిపక్షాలు ఈ బిల్లును విమర్శిస్తుంటే, మిత్రపక్షమైన జేడీయూ, సాక్షాత్తూ వీహెచ్‌పీ సైతం విభేదించడం గమనార్హం.
ఇక జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవ వేళ రానున్న పదేళ్ళ కాలానికి ‘జనాభా విధానం ముసాయిదా’ను ఆవిష్కరించిన యోగి… ఇద్దరు సంతానమే ఉండాలనే విధానంపై తనదైన వివరణ ఇచ్చారు. అధిక జనాభా వల్ల దారిద్య్రం పెరుగుతుందనీ, కాబట్టి దేశంలోనే అత్యధిక జనాభా గల రాష్ట్రమైన యూపీ ప్రజల్లో చైతన్యం తేవాలనీ ముఖ్యమంత్రి యోగి చెప్పిన మాటల్లో కొట్టిపారేయడానికేమీ లేదు. కానీ సంతానాన్ని బట్టే సంక్షేమ పథకాలన్న మాటే తేనెతుట్టెను కదిలించింది.