టిఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్!

అధికార టిఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. హుజూరాబాద్‌లో టీఆర్‌‌ఎస్ అభ్యర్థి ఎవరో కూడా తెలికుండానే ఆ పార్టీ నేతలు ఓట్ల కోసం డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు ఆ పైసలు తీసుకుని ఈటల రాజేందర్‌‌కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేస్తున్న పాదయాత్ర ఆరో రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం వాగు ఒడ్డు రామన్న పల్లి గ్రామంలో జరిగిన సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓట్ల డబ్బాలు చూస్తే పువ్వు గుర్తు మాత్రమే ఉండాలన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో కూడా తెలియకుండానే డబ్బులు పంచున్నారని, అవి తీసుకుని ఓటు ఈటల రాజేందర్‌‌కే వేయాలని కోరారు.

వ్యాక్సిన్ కొనే డబ్బుతో రైతులకు న్యాయం చేయాలి:
వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు బండి సంజయ్. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఆయన.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో వడగళ్ల వానకు పంటలు నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో వానలకు దెబ్బతిన్న రైతులను ఎప్పుడైనా ఆదుకున్నారా అని ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశ పెట్టిన ఫసల్ బీమా ఇక్కడ అమలు చేయడం లేదని విమర్శించారు. వేల కోట్ల రూపాయల భూములు అమ్ముతున్న కేసీఆర్.. ఆ డబ్బులతో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇస్తోన్న వ్యాక్సిన్ ఫ్రీ గా కొంటానన్న కేసీఆర్.. ఆ డబ్బు రైతుల కోసం ఖర్చు చేయాలన్నారు. వానలకు నష్టపోయిన పంటలకు వెంటనే పరిహారం అందించాలని సంజయ్ డిమాండ్ చేశారు.