మునుగోడు ఉప ఎన్నికకు సమరశంఖం పూరించిన రాజగోపాల్..

మునుగోడు ఉప ఎన్నిక సమరం ఖరారైంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామ లేఖను రాజగోపాల్ స్పీకర్ పోచారంకు సమర్పించడం..ఆయన ఆమోదించడం చకాచకా జరిగిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని.. తన రాజీనామాతో నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని భావించి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ ప్రకటించారు. ఇది తన కోసం చేసే యుద్ధం కాదని .. ప్రజల కోసం చేసే యుద్ధమంటూ రాజగోపాల్ ఉప ఎన్నికకు సమరశంఖం పూరించారు.

ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామకు ముందు రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అరాచక పాలన కొనసాగిస్తున్నారని .. తన రాజీనామాతో ఆయన దిగిరావడం ఖాయమంటూ కుండబద్ధలు కొట్టారు.మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పుతో కేసీఆర్ కు కనువిప్పుకలగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై అపాయింట్ మెంట్ అడిగితే కేసీఆర్ ఇవ్వలేదని.. ఉప ఎన్నిక రాగానే నియోజకవర్గ అభివృద్ధి గుర్తొచ్చిందన్నారు. తన సత్తా ఎంటో ఉప ఎన్నికలో చూపిస్తానని .. కేసీఆర్ కాచుకో అంటూ సవాల్ విసిరారు.

ఉప ఎన్నిక తీర్పుతో .. పడుకుంటే లేస్తే మునుగోడు ప్రజలు గుర్తు రావాలన్నారు రాజగోపాల్.ప్రజల పై నమ్మకం తో రాజీనామ చేస్తునట్లు ..దైర్యం లేకపోతే ఇంత సాహసానికి తెగించేవాడిని కాదన్నారు.ఇది తన కోసం చేసే యుద్ధం కాదని.. నియోజకవర్గ ప్రజల కోసం చేసే యుద్ధమని తేల్చిచెప్పారు. తన రాజీనామాతోనే గట్టుప్పల్ మండలం వచ్చిందని.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజల పై ఉందన్నారు.

టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని ఫైర్ అయ్యారు రాజగోపాల్. గంగుల, ఎర్రబెల్లి, తలసాని, పువ్వాడ అజయ్ ఉద్యమకారులా అంటూ సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బంధీ అయ్యిందని .. ప్రజలు మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. తన రాజీనామా పై సోషల్ మీడియాలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని.. నిజానిజాలేంటో ప్రజలకు తెలుసని రాజగోపాల్ స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో ఉప ఎన్నికకు సమరశంఖం పూరించారు రాజగోపాల్. ప్రజాసమస్యల కోసం ఎంతదూరమైనా వెళ్తానని.. సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగేలా తీర్పు ఇవ్వడానికి మునుగోడు ప్రజలు సిద్దంగా ఉన్నారని.. యుద్ధానికి సిద్ధమంటూ సవాల్ విసిరారు .