సర్వమత సమ్మేళనానికి తెలంగాణా పెట్టింది పేరు : గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సర్వమత సమ్మేళనానికి తెలంగాణా పెట్టింది పేరు : గుంటకండ్ల జగదీష్ రెడ్డి

Suryapeta: సర్వమత సమ్మేళనానికి తెలంగాణా పెట్టింది పేరు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. గంగా, జమునా తహజీబ్ లకు ఈ ప్రాంతం ప్రత్యేక ఐకాన్ గా ఫరీడ విల్లుతుందని ఆయన పేర్కొన్నారు.రంజాన్ పర్వదినం ప్రారంభం సందర్భంగా ఈ శుక్రవారం నుండి ఉపవాస దీక్షలు చేపట్టనున్న ముస్లిం మైనారిటీలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. పరమ పవిత్రమైన ఖురాన్ గ్రంధం ఆవిర్భావించిన మాసంలో ముస్లిం సోదరులు చేపట్టే ఈ ఉపవాస దీక్షలు ఎంతో ఉన్నతమైనవని ఆయన కొనియాడారు. అటువంటి దీక్షలను భక్తిశ్రద్దలతో నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర  ప్రభుత్వం రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్న విషయం విదితమే నని ఆయన పేర్కొన్నారు. అంతే గాకుండా రంజాన్ పర్వదినం రోజున పేదలకు దుస్తుల పంపిణి వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దానికి తోడు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నీ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఎనిమిది ఏళ్లుగా ఈద్గాలు, మసీదుల అభివృద్ధి కి చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. వీటన్నింటికి మించి ఉపవాస దీక్షలలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకు గాను ప్రత్యేక వెసులుబాటు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఆయన కొనియాడారు. అటువంటి ఉపవాస దీక్షలు భక్తిశ్రద్దలతో నిర్వహించుకొని మతసామరస్యాన్నీ ప్రతిబింబించేలా రంజాన్ పర్వదినాన్ని జరుపుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు.