APpolitics: పశ్చిమ కృష్ణా డెల్టా పరిధిలో ఎండిపోయిన పంట భూములను జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును నాదెండ్ల తో చెప్పుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ” ఒక్కప్పుడు ఈ ప్రాంతంలో కళ్ళం నిండా నీరు… కనుచూపు మేర పచ్చని పైరుతో కళకళలాడేదని.. నేడు ఆ పరిస్థితి మారిపోయిందని ..పంట సాగుకు చుక్క నీరు అందక నెర్రెలిచ్చిన బీళ్లు… ఎండిపోయిన చేలు కనిపిస్తున్నాయి’ అంటూ రైతులు ఆవేదన వెలిబుచ్చారు. తెనాలి రూరల్ మండలం, కొలకలూరు, ఖాజీపేట, హాఫ్ పేట గ్రామాల పరిధిలోని పశ్చిమ కృష్ణా డెల్టా, 3, 4 బ్రాంచ్ కెనాల్స్ నీరు లేక ఎండిపోయిన పంట పొలాల్లోకి వెళ్లి రైతులతో నాదెండ్ల మాట్లాడారు. అక్కడున్న పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఒక్కో రైతుతో విడిగా మాట్లాడారు. వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఎందుకు నీరు అందడం లేదో రైతులు మనోహర్ కి వివరించి చెప్పారు.
ఇక పంటను కాపాడుకునేందుకు రోజూ నీటి కోసం ఓ యుద్ధమే చేస్తున్నామని రైతులు మనోహర్ తో చెప్పుకున్నారు. పంట ఈనే దశలో తడుల కోసం కష్టమంతా కోర్చి కష్టపడుతున్నామనీ..పశ్చిమ కృష్ణా డెల్టా లోని పంట పొలాలకు సాగునీరు లేకపోవడంతో ఎండిపోయి కనిపిస్తున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. కాలువల నిండా తూడు పూడుకుపోయిందనీ, ఎన్నో ఆశలతో ఊడ్చిన చేళ్లకు నీరు అందక పూర్తిగా వరిదుబ్బు దశలోనే ఎండిపోతున్నాయని తెలిపారు. గతంలో ఎన్నడూ పశ్చిమ కృష్ణా డెల్టాలో సాగునీరు విషయంలో ఇంతటి దుర్భిక్ష పరిస్థితి లేదని, వేలకు వేల రూపాయలు పెట్టుబడులు పెట్టినా పైసా వస్తుందనే ఆశ కలగడం లేదన్నారు. కృష్ణా డెల్టాలోని ఏ కాలువలోనూ నీరు లేకపోవడంతో రైతులు పంట తడులు కోసం సొంతంగా మోటారు ఇంజిన్లు వాడుకోవాల్సి వస్తుందన్నారు. నీరు అందించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని, కనీసం చివరి తడులకు సైతం నీరు అందించడంలో వారాబందీ పద్ధతి కూడా విఫలం అయిందని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని రైతులు ఎండిపోయిన పంట పొలాలను మనోహర్కి చూపిస్తూ విలపించారు.
రైతులపై వైసీపీది కఠిన వైఖరి..
రైతుల వెతలను, వ్యధలను ఓపికగా విన్న నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు .”తమది రైతు ప్రభుత్వమని, మనసున్న ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం మాత్రమే ముఖ్యమంత్రికి తెలుసని.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని ఏ మాత్రం వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనిమండిపడ్డారు. సాగు నీటి విడుదల విషయంలో రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందన్నారు. పంటలు సాగు కోసం నీరు కూడా సరిగా అందించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ మేనేజ్మెంట్ సిస్టం అమలు విషయంలో వైసీపీ ప్రభుత్వం విఫలం అయిందన్నారు. పశ్చిమ కృష్ణా డెల్టా అంటే ఎప్పుడు నీటితో కళకళ్ళాడే ప్రాంతమని.. ఇక్కడే పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్నాయంటే, రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో కరవు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. కరవు మండలాలను ప్రకటించడంలో కూడా వైసీపీ ప్రభుత్వానికి మనసు లేదాని.. రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, కరువుతో అల్లాడుతున్నారని ప్రకటించడానికి వైసీపీ ప్రభుత్వానికి నామోషీ వచ్చిందని ..ఈ కారణంతోనే తీవ్ర కరవు పరిస్థితులను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని మనోహర్ పేర్కొన్నారు.