Newsminute24

‘ పెద్ద తెలుగువారి ’ ముఖ్య సంగతులు అందించే పత్రిక ‘ఈనాడు’ ఒక్కటేనా?

Nancharaiah Merugumala:(senior journalist)

-==============================

 వీవీ గిరి గారిని ఒడిశాకు చెందిన నేత అనడం పద్ధతిగా లేదు!

–––––––––––––––––––––––––––––––––––––––––––––

విశాల తెలుగు సమాజం (ఇందులో కోస్తా, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని తెలుగు ప్రజలంతా వస్తారు) తెలుసుకోవాల్సిన లేదా వారికి తప్పక ఆసక్తి కలిగించే వార్తలను చాలా సందర్భాల్లో ‘ద లార్జెస్ట్‌ తెలుగు డైలీ’ ఈనాడు మాత్రమే పాఠకులకు అందిస్తుందనే నా అంచనా మరోసారి నిజమైంది.

ఈరోజు పతాక శీర్షిక వార్త–ప్రథమ పీఠంపై గిరి పుత్రిక– చివరి నుంచి మూడో ఉపశీర్షిక వార్త ఈ విషయం నిరూపించింది. తొలిసారి తెలుగు సీజేఐ చేతుల మీదుగా… అనే ఈ పేరాలో చెప్పిన విషయం ఈపాటికి మీకు అర్ధమై ఉండాలి. ‘ఈనెల 25న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ రాష్ట్రపతి భవన్‌ లో ద్రౌపది ముర్ము చేత ప్రమాణం చేయిస్తారు. రాష్ట్రపతి చేత తెలుగు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించడం ఇదే ప్రథమం.’ ఇదీ ఈనాడు నేడు చెప్పిన గొప్ప విషయం. మిగిలిన తెలుగు పత్రికలకు ఈ అంశం వార్తగా చెప్పాల్సిన అవసరం తట్టలేదు. ఈ తెలుగు మీడియా సంస్థల్లో పనిచేసే సంపాదక సిబ్బంది తెలివితేటలు అలా ఉన్నాయని సరిపెట్టుకుంటే మేలేమో.

కృష్ణా జిల్లా గ్రామం పెదపారుపూడి వ్యవసాయ కుటుంబంలో మూలాలు, ప్రస్తుతం హైదరాబాద్‌ శివారు గ్రామం అనాజ్‌ పూర్‌ లో పాదాలు ఉన్న చెరుకూరి రామోజీరావు గారు నడుపుతున్న తెలుగు దినపత్రికలో తెలుగువారు ముఖ్యంగా పైకొస్తున్న కుటుంబాలు సంతోషించే వార్తలను–మనోళ్లు, తెలుగుతేజాలు, తెలుగుబిడ్డలు–వంటి రకరకాల పేర్లతో అడపాదడపా ప్రచురించడం కొత్తేమీ కాదు. తొలి ఆదివాసీని అందులోనూ మహిళను దేశాధినేత స్థానంలో రాజ్యాంగబద్ధంగా కూర్చోబెట్టడానికి రెండో తెలుగు భారత ప్రధాన న్యాయమూర్తి ఆమెతో ప్రమాణం చేయిస్తున్నారనేది చిన్న విషయమేమీ కాదు మరి. ఈనాడు ప్రమాణాలు ఎప్పుడూ ఈస్థాయిలోనే ఉంటాయి. (మొదటి తెలుగు భారత ప్రధాన న్యాయమూర్తి రాజమండ్రికి చెందిన ఆది వెలమ కుటుంబంలో పుట్టిన జస్టిస్‌ కోకా సుబ్బారావు గారు–1966 జూన్‌ 30 నుంచి 1967 ఏప్రిల్‌ 11న రాజీనామా చేసే వరకూ పదవిలో ఉన్నారు).

ఇందిర రబ్బరు స్టాంపు అయితే మాత్రం వీవీ గిరి గారిని ఒడిశా ఖాతాలో వేస్తారా?

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

పైన చెప్పిన వార్త (ఉపశీర్షిక వార్త)లోనే ఈనాడు ఎడిటోరియల్‌ సిబ్బంది మరో సాహసం చేసింది. మాజీ రాష్ట్రపతి (1969–74), గోదావరి జిల్లాల మూలాలున్న పదహారణాల తెలుగు నియోగి బ్రాహ్మణుడు, కాంగ్రెస్‌ కార్మిక సంఘాల నేత వరహాగిరి వెంకట గిరి గారిని ఒడిశాకు చెందిన నేతగా రాసి పారేశారు. వాస్తవానికి వీవీ గిరి గారు పుట్టిన ప్రాంతం (బరంపురం–గంజాం ఏరియాలు) ఆయన నేల మీద పడినప్పుడు (1894 జూన్‌ 24న) అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో అంతర్భాగంగా ఉండేది. స్వాతంత్య్రం వచ్చిన చానాళ్లకు బరంపురం (బర్హంపూర్‌) ఒడిశాలో చేరింది.

 

 

 

 

 

 

 

 

 

అదీగాక 1952 నుంచి ఎన్నికల్లో వీవీ గిరి గారు తెలుగు ప్రాంతాల (శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, పార్వతీపురం) నుంచి లోక్‌సభకు పోటీచేశారు. స్వాతంత్య్రం రాకముందు కూడా 1937 మద్రాసు అసెంబ్లీ ఎన్నికల్లో గిరి గారు తన ప్రత్యర్థి బొబ్బిలి రాజాను ఓడించారు. అప్పటి చక్రవర్తి రాజగోపాలాచారి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కర్మిక, పరిశ్రమల శాఖల మంత్రిగా రెండేళ్లు ఉన్నారు. 1952లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి గిరి గారు మొదటి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వెంటనే జవాహర్‌ లాల్‌ నెహ్రూజీ కేబినెట్‌ లో కార్మిక మంత్రి కూడా అయ్యారు.

అయితే, రెండో లోక్‌సభ ఎన్నికల్లో అంటే 1957లో శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం ద్విసభ్య పార్లమెంటు నియోజకవర్గంలో ఆయన ఇండిపెండెంట్‌ అభ్యర్ధి దుప్పల సూరి దొర చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత వీవీ గిరి ఎన్నికల్లో పోటీచేయలేదు. గవర్నర్‌ పదవిని దీర్ఘకాలం అనేక రాష్ట్రాల్లో అనుభవించిన వీవీ గిరి 1967లో ఇందిరా గాంధీ పుణ్యమా అని ఉపరాష్ట్రపతి అయ్యారు. ముస్లిం రాష్ట్రపతి డా.జాకిర్‌ హుస్సేన్‌ కింద బ్రాహ్మణుడైన గిరి గారిని ఇందిరమ్మ కూర్చోబెట్టారు. 1969 రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికార అభ్యర్థి నీలం సంజీవరెడ్డిగారిని ఓడించడానికి వీవీ గిరితో ఉపరాష్ట్రపతి పదవికి  రాజీనామా చేయించారు ఇందిరమ్మ. తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా గిరిని బరిలోకి దింపారు.

‘అంతరాత్మ ప్రబోధం’ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ ‘క్రమశిక్షణ’ను బాహాటంగా ఉల్లంఘించిన నాటి ప్రధాని ఇందిర సాటి బ్రాహ్మణ నేత వీవీ గిరి గారిని గెలిపించారు. నరాలు తెగని ఉత్కంఠ మధ్య రెండో లెక్కింపులో నీలంపై గిరి గారు విజయం సాధించారు. ఇంత తెలుగు నేపథ్యం ఉన్న వరహాగిరి వెంకట గిరి గారిని ఈనాడు వంటి అత్యంత ప్రతిష్ఠాత్మక తెలుగు పత్రిక ఒడిశా కోటాలో లేదా ఖాతాలో వేసేయడం అస్సలు బాగోలేదు. ఇది హర్షణీయం కాదు. తీవ్ర గర్హనీయం. వీవీ గారి తండ్రి వీవీ జోగయ్య పంతులు గారు పూర్వపు తూర్పు గోదావరి జిల్లా ప్రాంతంలోని చింతలపూడి నుంచి బరంపురం ప్రాంతానికి వలసపోయారని కూడా చదివాను.

 

Exit mobile version