Newsminute24

ఈడీ కేసుల నుంచి తప్పించుకునేందుకు సోనియా ప్రయత్నం..

Nancharaiah Merugumala (senior journalist)

-===========================================

మోతీలాల్‌ వోరాతోనే ఆపండి..దయచేసి మోతీలాల్‌ నెహ్రూ మీదకు దోషాలు తోసేయకండి, సోనియమ్మా, రాహుల్‌ భయ్యా!
––––––––––––––––––––––––––––––––––
ఇండియన్‌ హెరాల్డ్‌ ప్రచురణ కంపెనీ అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) ఆస్తుల అక్రమ వాల్చుడు కేసులో లావాదేవీలన్నీ దివంగత కాంగ్రెస్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ కోశాధికారిగా 18 ఏళ్లు ‘లెక్కలు చూసిన’ మోతీలాల్‌ వోరా మాత్రమే చే శారని అమ్మాకొడుకులు సోనియా, రాహుల్‌ గాంధీలు ఈడీ అధికారుల ముందు చెప్పి తప్పించుకుంటున్నారు. రాజస్థాన్‌ లో మూలాలున్న బ్రాహ్మణ నేత మోతీలాల్‌ జీ 2020లో కళ్లు మూశారు. రాజస్థాన్‌ నాగోర్‌ జిల్లా నింబీ జోధా గ్రామంలో 1928లో పుట్టిన మోతీలాల్‌ వోరా ప్రస్తుత ఛత్తీస్‌ గఢ్‌ రాజధాని రాయపుర్‌ పక్కనున్న దుర్గ్‌ వచ్చి స్థిరపడ్డారు. చివరి తరం కాంగ్రెస్‌ గాంధేయవాదిగా ముద్రపడిన మోతీలాల్‌ జీ మరి నెహ్రూ–గాంధీ పాలక కుటుంబంలోని ఇందిర, రాజీవ్, సోనియాలకు ఎలా అత్యంత విధేయుడయ్యారో రాజకీయ పరిశీలకు అర్ధం కాదు.
92 ఏళ్లు బతికిన వోరా జీ డిసెంబర్‌లో పుట్టిన రోజు (20) మరుసటి రోజున (21) కన్నుమూయడం విశేషం. 1966లో ఇందిరాగాంధీ ప్రధాని అయ్యాక 1969లో పార్టీలో పట్టు సాధించారు. అప్పటి నుంచి ఆమె నిధులు సమీకరించి, సూట్‌ కేసుల్లో నగదు చక్కగా సర్దించి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్థులకు సకాలంలో చేరవేయించే సామర్ధ్యం ఉన్న సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలకు ఏఐసీసీ కోశాధికారి పదవి అప్పగించేవారు. ఇలాంటి ప్రతిభాపాటవాలున్న సీతారామ్‌ కేసరీ 1980ల నుంచి 1990ల వరకూ పదేళ్లు పనిచేశారు.

బిహార్‌ కు చెందిన స్థానిక వైశ్య (అక్కడ బీసీ జాబితాలో ఉన్నారు) సీతారామ్‌ కేసరీ ఈ పదవి ఆగిపోకుండా 1996లో కాంగ్రెస్‌ అధ్యక్షుడయ్యారు. కేసరీ తర్వాత అహ్మద్‌ పటేల్, మోతీలాల్‌ వోరా 18 ఏళ్ల ఏలుబడి తర్వాత మళ్లీ అహ్మద్‌ పటేల్‌ కోశాధికారులుగా పనిచేశారు. గత రెండేళ్లలో ఇద్దరు నేతలూ కన్నుమూశారు. ఏజేఎల్‌ కు చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కూడా వోరా జీ పనిచేయడానికి ఆయనకు ఉన్న రాజస్థానీ తెలివితేటలు, ఆర్థిక లావాదేవీల సామర్ధ్యంతోపాటు సోనియాకు, ఆమె పిల్లలకు ఉన్న ఆయన విధేయత కూడా ఉపయోగపడింది.

 

తొమ్మిది పదులు దాటాక కూడా పూర్తిగా వంగిపోయి నడుస్తూనే ఆయన రోజూ దిల్లీ ఏఐసీసీ కార్యాలయానికి వచ్చి తన సీట్లో కూర్చునేవారని పేరు కూడా సంపాదించారాయన. ఏజేఎల్‌ లావాదేవీలన్నీ మోతీలాల్‌ వోరాయే చూసుకున్నారని, తమకు ఏ పాపం తెలియదని తల్లీకొడుకులు సోనియా, రాహుల్‌ దిల్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల ముందు చాలా ధైర్యంగా చెప్పారని మీడియాలో లీకులను బట్టి తెలుస్తోంది.
కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా జరిగిన లోటుపాట్లకు, పార్టీలోని అవకతవకలకు కాంగ్రెస్‌ మాజీ ప్రధానుల్లో ఒక్క పీవీ నరసింహారావు గారిదే బాధ్యత అని కాంగ్రెస్‌ ‘రాయల్‌ ఫ్యామిలీ’ విధేయులు ప్రచారం చేస్తున్నారు ఇంకా. ఈ క్రమంలోనే ఇప్పుడు తమకు అత్యంత ఇష్టుడు, విధేయుడు అయిన మోతీలాల్‌ వోరా గారిని కూడా ఆయన చావు తర్వాత ఏజేఎల్‌ అక్రమాలకు బాధ్యుడిని చేసే ప్రయత్నం కాంగ్రెస్‌ తొలి కుటుంబం చేస్తోంది.
ఈడీ ఇంటరాగేషన్‌ తో ‘బుర్రతిరిగి’ చివరికి సోనియా, రాహుల్‌ గాంధీలు అసలు కాంగ్రెస్‌ పార్టీలోని ప్రస్తుత అవలక్షణాలకు మూలం– తమ కుటుంబంలో మొదటి ప్రముఖుడు మోతీలాల్‌ నెహ్రూయే కారణమంటూ ఆయన పేరు చెప్పినా మనం షాకవకూడదనిపిస్తోంది. అయితే, వారి కుటుంబంలో గొప్ప ఆధునిక లిబరల్, ప్రజాస్వామిక మేధావిగా, మంచి మానవతావాదిగా పేరున్న మోతీలాల్‌ నెహ్రూను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆయన వారసులు అనవసరంగా బురదలోకి లాగరనే ఆశిద్దాం. సోనియా, రాహుల్, ప్రియాంకా వాడ్రా– ఏమాత్రం అవకాశం వచ్చినా ‘పండిత్‌ నెహ్రూజీనే, ఇందిరాజీనే, రాజీవ్‌ జీనే’ అని ఉపన్యాసాలు దంచడం చూస్తూనే ఉన్నాం. ఎన్నడూ కుటుంబ మూలపురుషుడు మోతీలాల్‌ నెహ్రూ ప్రస్తావన తీసుకురారు. అవును, ఆయన ప్రధాని పదవిలో ఎన్నడూ లేరు కదా. ఎందుకంటే ఆయన స్వాతంత్య్రం రాకముందు కన్నుమూశారు.
Exit mobile version