Nancharaiah merugumala:(senior journalist)
===============
జీసస్ క్రైస్ట్ పేరుతో జరిగిన మారణహోమాల్లో చేసిన హత్యలు మరే దేవుడు లేదా దైవసుతుడి పేరు చెప్పి చేయలేదని బ్రిటిష్ మాజీ మార్క్సిస్టు, నాస్తిక సిద్ధాంతకర్త క్రిస్టొఫర్ హిచెన్స్ (1949 ఏప్రిల్ 13–2011 డిసెంబర్ 15) రాశారు. ఈ విషయం ఆయన 2011లో కన్నుమూసిన తర్వాత పాశ్చాత్య మీడియాలో చదివాను. గూగుల్ లో ఎంత ప్రయత్నించినా హిచిన్స్ వెల్లడించిన విషయం గురించి గణాంక వివరాలు దొరకలేదు. అలాగే, రాముడి పేరుతో భారతదేశంలో జరిగిన హింసాకాండ కూడా తక్కువేమీ కాదు. ఇంకాస్త ముందుకెళితే గొర్రెల కాపరి యేసు పేరుతో జరిగిన హత్యలతో పోల్చితే మరి ఆవుల కాపరి కృష్ణుడి నామంతో చేసిన హింసాకాండ చాలా చాలా తక్కువేననిపిస్తుంది. క్రుసేడ్ల పేరుతో ఎన్నో మత యుద్ధాలు చేసిన ఫలితంగా, ఇతర పనుల వల్ల నేడు ప్రపంచంలో జనాభా రీత్యా ఎక్కువ మంది అనుసరించే మతంగా క్రైస్తవం ఇంకా కొనసాగుతోంది.
‘ధర్మం’ పేరుతో క్రైస్తవం, జిహాద్ పేరుతో ఇస్లాం మతస్తులు చంపిన మనుషుల సంఖ్యను మించిపోయేలా… ప్రపంచంలో ఈ రెండింటి తర్వాత మూడో పెద్ద ధర్మం హిందూ మతాన్ని అనుసరించే తీవ్రవాదులు చేయగలరా? ఊచకోతల్లో కొత్త రికార్డు సృష్టించగలరా? అంటే ఇప్పుడు చెప్పడం కష్టమే. మళ్లీ ఏసు విషయానికి వస్తే 1980–82 ప్రాంతంలో విజయవాడ విశాలాంధ్ర పత్రికలో క్రిస్మస్ రోజున నాటి ఈ పత్రిక ఎడిటర్ చక్రవర్తి రాఘవాచారి గారు రాసిన సంపాదకీయం నాకింకా గుర్తుంది. యేసు దైవసుతుడా? దేవుడా? అనే విషయం పక్కనబెట్టి జీసస్ జీవితంలోని కొన్న ఘటనల ఆధారంగా రాఘవాచారి కొన్ని విషయాలు తన ఎడిటోరియల్ లో చెప్పారు. సమకాలీన సమాజంలో అధికారంలో ఉన్న నియంతలకు వ్యతిరేకంగా నిలబడిన గొప్ప మనిషి, ‘విప్లవకారుడు’ క్రీస్తు అని ఆయన రాశారు. ప్రపంచాన్ని మతాల రూపంలో చూస్తే–ప్రస్తుతం అత్యధిక ప్రజలు అనుసరించే మతంగా క్రైస్తవం ఉంది.
అయితే, విశ్వవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ముస్లింల జనాభా వల్ల మొదటి స్థానాన్ని క్రైస్తవం నుంచి ఇస్లాం గుంజుకుంటుందని కొన్ని అమెరికా సంస్థలు అంచనా వేసి హెచ్చరిస్తున్నాయి. ఇస్లాంతో వేయి సంవత్సరాలకు పైగా సంపర్కం ఉన్న ఇండియాలో ఉన్న హిందువులకు ప్రస్తుతానికి అయితే ముస్లింలు అంటే అనవసర భయాలు లేవనిపిస్తోంది. దేశవిభజన ఫలితంగా భారతదేశానికి రెండు వైపులా రెండు ఇస్లామిక్ గణతంత్రరాజ్యాలు ఉనికిలో ఉన్నాగాని హిందూ జనాభాలో అత్యధికులు వాటిని చూసి భయకంపితులు కావడం లేదు. దేశంలోని 20 కోట్ల ముస్లింలు ఏదో చేస్తారని కూడా వారు బెదిరిపోవడం లేదు. క్రైస్తవ ప్రపంచంతో పోల్చితే–ముస్లింలు అంటే ‘భయోన్మాదాలు’ భారతీయ హిందువుల్లోనే తక్కువ అని చెబుతున్నారు. క్రిస్మస్ సాయంత్రం సందర్భంగా ఈ విషయాలు గుర్తుకొచ్చాయి. అదీగాక రెండొందలేళ్ల క్రితం అఖండ భారతానికి వచ్చి పాలన సాగించిన ఐరోపా క్రైస్తవులు 1947లో స్థానికంగా ఘర్షణపడుతున్న కోట్లాది మంది హిందూ, ముస్లింలకు చక్కటి పరిష్కారం ఇచ్చిపోయారు. అందుకే భారతీయులు క్రైస్తవులను, దైవసుతుడు యేసు క్రీస్తును ఎన్నటికీ మరిచిపోలేరు. క్రైస్తవంపై అతి పెద్ద అభియోగం మోపిన క్రిస్టొఫర్ హిచెన్స్ సరిగ్గా పదకొండేళ్ల క్రితం డిసెంబర్ 15న కన్నుమూశారు. జీవితాంతం క్రీస్తును దుయ్యబడుతూ, క్రిస్టియానిటీపై నిప్పులు చెరిగారు కాబట్టే హిచెన్స్ క్రిస్మస్ కు పది రోజులు ముందు పరలోకానికి కేన్సర్ కారణంగా పయనమైపోయారని అనేక క్రైస్తవ సంఘాలు, సువార్త ప్రాసంగీకులు, ప్రభుదాసులు చెప్పారు.