Newsminute24

ఇంకా మిగిలే ఉంది!

ఆఫ్రికా సంచలన కూన… మొరాకో కథను క్రొయేషియా 2-1 తో ముగించింది. ఈ సారి ఫీఫా ప్రపంచ కప్ లో ఆఫ్రికా ఖండానికే తొలిసారి సెమీస్ లో స్థానం కల్పించి, చరిత్ర సృష్టించిన ఈ బుల్లి జట్టు సెమీస్ లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ చేత ఓడాక, కాస్త చిన్నబోయింది. మూడో స్థానం కోసం శనివారం జరిగిన మ్యాచ్ లోనూ ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. దూకుడు జట్టైన క్రొయేషియా మేటి, జాస్కో గ్వార్డియల్ ఆట ఆరంభంలోనే (7వ నిమిషం) హెడర్ తో గోల్ చేసి ఆధిక్యత సాధించాడు. అయితే, ఆ ఆనందాన్ని సంచలనాల మొరాకో 2 నిమిషాలకు మించి ఉండనీలేదు. ఆట 9వ నిమిషంలోనే, అష్రఫ్ దారి ఓ చూడచక్కని హెడర్ తో గోల్ చేయడం ద్వారా స్కోర్ ను సమం చేశాడు. అయినా…. 39 వ నిమిషంలో క్రొయేషియా వీరుడు మిస్లావ్ ఆర్సిక్ లెఫ్ట్ ఫ్లాంక్ నుంచి, మరో చక్కటి ఫీల్డ్ గోల్ తో తిరిగి ఆధిక్యత రాబట్టాడు. బ్రేక్ తర్వాత గోల్స్ ఏమీ లేకపోవడంతో, చివర్లో… లాంగ్ విజిల్ ఊదే వరకు క్రొయేషియా తన ఆధిక్యతనలా కొనసాగించింది.  ప్రథమార్థంలో క్రొయేషియా దాడులను ప్రతిఘటించడంతోనే సరిపోయింది మొరాకో పని. కొంచెం తేటపడి, ద్వితీయార్ధంలో ప్రత్యర్థి గోల్ పోస్ట్ పైకి కొన్ని దాడులు చేయగలిగింది.

ప్రపంచ పది మేటి జట్లలో మూడింటిని (పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం) సెమీస్ కు చేరే దారిలో, ఇంటికి పంపిన మొరాకో…. అంతటి ఆటతీరుని ఈ ప్లేఆఫ్ మ్యాచ్ లో చూపించలేక పోయింది. ప్రపంచ నెంబర్ వన్ టీమ్ బ్రెజిల్ ను క్వార్టర్ ఫైనల్లోనే ఇంటికి పంపించిన మేటి జట్టు క్రొయేషియా మాత్రం, ఆట సాంతం పూర్తి ఆధిక్యత కనబర్చింది. ఒక్క ఫైనల్ మ్యాచ్ తప్ప, నాలుగేళ్ల ఫీఫా వల్డ్ కప్ సంబరమంతా, ఖతర్ రాజధాని దోహ లో, ఈ మ్యాచ్ తో దాదాపు ముగిసినట్టే! డిఫెండింగ్ చాంప్ ఫ్రాన్స్, ఛాలెంజర్ అర్జెంటీనా ల మధ్య ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం ఉత్కంఠ మాత్రం… ఇంకా మిగిలే ఉంది!!

==============

ఆర్. దిలీప్ రెడ్డి

పీపుల్స్ పల్స్ డైరెక్టర్ 

Exit mobile version