Newsminute24

గుజరాత్ లో బీజేపీ చారిత్రాత్మక విజయం.. కలిసొచ్చిన మోదీ బ్రాండ్..!!

గుజరాత్  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్ర తిరగరాసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో.. ఎగ్జిట్  పోల్స్  అంచనాలకు తగ్గట్టే బీజేపీ ఏకపక్ష విజయం సాధించింది. గుజరాత్ ఎన్నికల చరిత్రలో కనీవినీ రీతిలో 156 సీట్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. మోదీ హావాతో  ప్రతిపక్ష పార్టీలకు పట్టున్న నియోజక వర్గాల్లోనూ కమలం పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక ఈ  ఎన్నికల్లో హస్తం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తమకు పట్టున్న నియోజక వర్గాలతో పాటు.. ప్రభుత్వ వ్యతిరేకతనూ సొమ్ము చేసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. అటు తొలిసారి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు సీట్లు గెలుచుకోవడం విశేషగా చెప్పవచ్చు.

మోదీ బ్రాండ్…

గత ఎన్నికల కంటే బీజేపీ ఈ సారి ఎక్కువ సీట్లు గెలవడానికి ప్రధాన కారణం మోదీ బ్రాండ్ అనడంలో సందేహం లేదు. సింహం సింగిల్ మాదిరి ..తన బ్రాండ్ ఇమేజ్ తో ఒక్కడై ఎన్నికల ప్రచారాన్ని భుజానికి ఎత్తుకున్నాడు. ముఖ్యంగా పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల ప్రచారం నిర్వహిస్తూ.. తనదైన పంచులతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాక గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఈ సారి 56 నియోజక వర్గాల్లో మోదీ రోడ్ షోలు నిర్వహించాడు. మొత్తంగా చూసుకుంటే గుజరాత్ ఎన్నికల చరిత్రలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా ఆవిర్భవించడంలో మోదీ కీ రోల్ పోషించాడు అనడంలో సందేహం లేదు.

మసక బారిన హస్తం ప్రతిష్ట…

గుజరాత్ లో కాంగ్రెస్  ప్రతిష్ఠ పూర్తిగా మసకబారినట్లే కనిపిస్తోంది. గత అసెంబ్లీ  ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన హస్తం పార్టీ..  ఈసారి పూర్తిగా డీలా పడిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశంతో పది శాతం సీట్లు కూడా గెల్చుకోలేక చతికిలా పడింది. ఓట్ల శాతాన్ని కూడా భారీగా కోల్పోయింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు పూర్తి నైరాశ్యంలో మునిగిపోయారు. మరోవైపు ఆప్  సీట్లు గెల్చుకోవడంలో విఫలమైనప్పటికీ  పోటీ చేసిన తొలిసారే సుమారు 13 శాతం ఓట్లు కొల్లగొట్టడం గమనార్హం.

 

Exit mobile version