సాగర్ ఉపఎన్నికల్లో గెలిస్తే 2023 తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సాగర్ గెలుపుతో రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్ ముడిపడిందని, అక్కడ గెలిస్తే టీఆర్ఎస్ పతనం ఖాయమని తరుణ్ చుగ్ తెలిపారు. సాగర్ అభ్యర్థిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు త్వరలో వెల్లడిస్తారని, తెలంగాణ ప్రజలు మోడీ పాలన కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మనదే..!
త్వరలో జరగనున్న హైదరాబాద్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రచారానికి జాతీయ నేతలు వస్తారని, ప్రభుత్వం పట్ల, ఉద్యోగులు, నిరుద్యోగులు, పెన్షన్ర్లు,వ్యతిరేకతతో ఉన్నారని తరుణ్ చుగ్ స్పష్టంచేశారు. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారని, నిరుద్యోగ భృతి అర్హులు ఎవరన్న వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.