Site icon Newsminute24

‘శ్రావణా మాసం’ పై కవియిత్రి ప్రత్యేక రచన..

శ్రావణా మాసాన శుభ శుక్రవారాన
సిరులు కురిపించుమా శ్రీలక్ష్మి దేవీ
పాలసంద్రములోన పుట్టినా తల్లీ
విష్ణువు హృదయాన వెలసినా రాణీ

చల్లని చంద్రికలు జాలువారిన భువిని
వెండి తళతళకాంతి వేల్పు తోబుట్టువు
మాబతుకులలోన పండు వెన్నెల కురిసి
సుఖ శాంతులివ్వుమాశరదిందుచంద్రికా

కామధేనువు, కల్ప వృక్షములతోడుత
కోరికలు తీర్చు మాకనక మహాలక్ష్మీ
ధాన్యసంపదలిచ్చు,విద్యా ధైర్యము నిచ్చు
ఆదిలక్ష్మి వైమమ్ము ఆదుకోవమ్మా

ఆరోగ్యమానంద మిచ్చు ధన్వంతరీ వేల్పు
తోబుట్టువు గాన రోగబాధలు బాపు
వరములిచ్చి వేగ వారిజాక్షిరో నీవు
మాజన్మ తరియింప మమ్ము బ్రోవు తల్లీ

అన్ని కళలు తోడు అష్టలక్ష్మీ వమ్మా
కొంగు బంగారమై కామితములీయగా
వ్రతము సలిపి మేమువేడెదము తల్లీ
వరలక్ష్మి దేవి వరములిచ్చి దీవించవే

శ్రావణా మాసాన శుభ శుక్రవారాన

రచన:ఎన్.సి రోజా దేవి
సూర్యాపేట

Exit mobile version