Site icon Newsminute24

దేవునికి తలనీలాలు ఎందుకు సమర్పించాలి..?

దేవునికి తలనీలాలు ఎందుకివ్వాలి? ఫలితం ఏంటీ? అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. నిజానికి దేవునికి తలనీలాలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. తిరుమల దేవునికి కల్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి. వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటాం. గర్భంలో వున్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు. శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు వుంటాయి. అందుకనే చిన్న వయసులోనే కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు. పాపాలను కలిగివున్నందునే శిరోజాలను “శిరోగతాని పాపాని’ అంటారు. భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సును భగవంతునికి అర్పించే బదులు కేశాలను ఇస్తాం. తల వెంట్రుకలను తీయడంపై మహాభారతంలో ఒక సంఘటన వుంది.

జయద్రధుడు (సైంధవుడు)ని సంహరించేందుకు భీముడుసిద్ధమైన నేపథ్యంలో ధర్మరాజు అతడిని వారిస్తాడు. కౌరవుల సోదరి దుశ్శల భర్త సైంధవుడు. అతన్ని వధించడం ధర్మసమ్మతం కాదు. అందుకనే తల వెంట్రుకలను తీసేస్తే, తల తీసేసినంత పనవుతుందని వివరిస్తాడు. అప్పుడు సైంధవుడికి గుండు గీస్తారు. తిరుమలలో తల వెంట్రుకలు ఇచ్చే ప్రదేశాన్ని కల్యాణకట్ట అంటారు. మన సంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభాన్నే పలకాలని పెద్దలు అంటారు. అందుకనే క్షవరం అనే బదులు కల్యాణం అని పలకాలని జనమేజయుడి సోదరుడైన శతానీకుడు సూచించారు. దీంతో కల్యాణమనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలక్రమంలో కల్యాణకట్టగా స్థిరపడింది. వేం అంటే పాపాలు కట అంటే తొలగించేవాడు. అందుకనే తిరుమల శ్రీ నివాసుడిని కలౌ వేంకటనాయక అంటారు. కలియుగంలో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే. అందుకనే ఆయన సన్నిధానంలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత లభించింది.

పుట్టు వెంట్రుకలు:

శిశువు పుట్టిన సంవత్సరంలోపు మొట్ట మొదటి సారిగా పుట్టు వెంట్రుకలు తీసేందుకు ఎందుకు ముహుర్తానాకి ప్రాధాన్యత ఇచ్చారంటే శిశువు మొదటి సారి జుట్టు తీయడం వలన గతజన్మ పాప ప్రక్షాళనతో బాటు మంచి జ్ఞానార్జనకు ఉపయోగకరంగా ఉండెందుకు ముహూర్తం ఉపయోగ పడుతుంది. 

స్రీలు తలనీలాలు సమర్పించ వచ్చా..?

వివాహం కాని కన్యలు రోగగ్రస్తులు అయితే మాత్రమే సమర్పించాలి. తిరుమల శ్రీనివాసుని వద్ద ఈ నియమం వర్తించదు. స్నానం దానం, ధ్యానం, జపం, పూజనం, అర్పణంతో అందరికీ అన్ని సమస్యలు తీరుతాయి. పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలు దర్శించినపుడు, క్షవరం, శ్రాద్ధం చేయాలి.

స్త్రీలు తలనీలాలు అర్పించుట శాస్త్ర సమ్మతం కాదు.        దీనిపై ఆయా పండితులు ఆయా సందర్భాలలో చెప్పిన విషయాలను చెప్పాం. ఎవరికి ఇష్టం ఉన్నట్లు వారు, వారి వారి ప్రాంతీయ, కుల ఆచారాలను, మొక్కలను బట్టి తలనీలాలను సమర్పించుకోవచ్చు. దీనిపై అనుమానాలు, ఆభ్యంతరాలు ఏవీ లేవు.

Exit mobile version