Site icon Newsminute24

బ్రాహ్మణ, వైశ్య కులాలకు ‘అభినవ అంబేడ్కర్‌’ నరేంద్ర మోదీ!

Nancharaiah Merugumala:

అగ్రవర్ణ పేదల కోటా అనుకూల తీర్పును వ్యతిరేకించిన ఇద్దరు జడ్జీలూ బ్రాహ్మణులే!
…………………………………………………………………………………………….
చారిత్రకంగా కొనసాగిన సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా అమలు చేస్తున్న రిజర్వేషన్లు పేదరికం ప్రాతిపదికగా ‘అగ్రవర్ణాలు లేదా అగ్రకులాలకు’ ఇచ్చినా చెల్లుబాటు అవుతాయని ఈరోజు సుప్రీంకోర్టు తీర్చు ఇచ్చింది. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో సామాజికంగా, విద్యపరంగా వెనుకబడిన అనుసూచిత కులాలు (ఎస్సీలు), అనుసూచిత జాతులకు (ఎస్టీలు లేదా ఆదివాసీలు) కల్పిస్తున్న రిజర్వేషన్లు లేదా కోటాలు– పేదరిక నిర్మూలన కార్యక్రమాలుగా పరిగణించరాదని గతంలో ఇచ్చిన తీర్పును భారత సర్వోన్నత న్యాయస్థానం తానే స్వయంగా తప్పని సోమవారం తీర్పులో చెప్పినట్టయింది. రిజర్వేషన్లకు ఆర్థిక ప్రాతిపదికను ఆమోదించడం ద్వారా భారత రాజ్యాంగంలో ‘ఆరక్షణ’ (కోటా)కు ఇచ్చిన నిర్వచనాన్ని రద్దుచేసినట్టు కనిపిస్తోంది.
రిజర్వేషన్లు నిరంతరాయంగా కొనసాగకూడదని చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎప్పటి దాకా వాటిని అమలు చేయాలో చెప్పనే లేదు. ఆర్థికంగా బలహీనులైన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) కోటా కల్పిస్తూ ఓబీసీ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు 2019లో 103వ రాజ్యాంగ సవరణ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్, రవీంద్ర భట్, బేలా ఎం త్రివేదీ అనే బ్రాహ్మణ జడ్జీలతో పాటు దినేశ్‌ మాహేశ్వరీ అనే వైశ్య న్యాయమూర్తి, జేబీ పార్ధీవాలా అనే జొరాస్ట్రియన్‌ (పార్సీ) జడ్జీ ఈ ఐదుగురు జడ్జీల సుప్రీంకోర్టు బెంచీలో సభ్యులు. మెజారిటీ తీర్పు ఇచ్చిన జడ్జీలు–బేలా త్రివేదీ, దినేశ్‌ మాహేశ్వరీ, జేబీ, పర్ధీవాలా. ఈడబ్ల్యూఎస్‌ కోటా చెల్లుబాటును తిరస్కరించిన జడ్జీలు–యూయూ లలిత్, రవీంద్ర భట్‌.
బ్రాహ్మణలకు కోటా ఇచ్చే సవరణను వ్యతిరేకించిన జడ్జీలు ఇద్దరూ బ్రాహ్మణులే!
………………………………………………………………………………………..
అగ్రవర్ణాలకు ఉపాధి, విద్యాసంస్థల్లో కోటా ఇవ్వడం సరికాదని భావించి, మెజారిటీ సభ్యుల తీర్పునకు తమ అసమ్మతి తెలిపిన ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలూ (లలిత్, భట్‌) బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టడం విశేషం. అలాగే, అగ్రకులాలకు కోటా కల్పించడం భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకం కాదని మెజారిటీ తీర్పు ఇచ్చిన ముగ్గురు జడ్జీల్లో ఇద్దరు–బేలా త్రివేదీ (బ్రాహ్మణ), దినేశ్‌ మాహేశ్వరీ (వైశ్య) అగ్రవర్ణాల్లో జన్మించడం కూడా గమనించాల్సిన అంశం. మొత్తానికి ఈ ఐదుగురు బెంచీలోని నలుగురు అగ్రవర్ణాల (ముగ్గురు బ్రామ్మలు, ఒక వైశ్య) న్యాయమూర్తులు సమంగా చీలిపోయి మెజారిటీ తీర్పుకు అనుకూలంగా ఇద్దరు, దాన్ని వ్యతిరేకించిన బృందంలో ఇద్దరు ఉండడం కూడా గొప్ప విషయం. నలుగురు హిందూ అగ్రవర్ణాల న్యాయమూర్తులు సమంగా చీలిపోతే– గుజరాతీ జొరాష్ట్రియన్‌ (పార్సీ) న్యాయమూర్తి పార్ధీవాలా అగ్రవర్ణాల పేదల కోటాకు అనుకూలంగా మొగ్గారు. 5–2 మెజారిటీ తీర్పుతో అగ్రకులాలకు మేలు జరగడానికి ఓ పార్సీ జడ్జీ ఇలా కారకులయ్యారు. ఇలా సంఖ్యాపరంగా అత్యంత మైనారిటీ అయిన పార్సీ జడ్జీ ఈ కేసులో నిర్ణాయక పాత్ర పోషించారు. దేశంలో అగ్రవర్ణాల్లోని వైవిధ్యానికి ఈ తీర్పు అద్దంపడుతోంది.
ఏదేమైనా గతంలో గానుగతో నూనె తీసే వెనుకబడిన కులంలో (ఘాంచీ లేదా తేలీ) పుట్టిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని హిందూ ప్రభుత్వం–అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించడం చాలా ఘనమైన విషయం. తెలివైన ఓబీసీ ప్రధాని తమకు రాజ్యాంగ సవరణ ద్వారా కోటా కల్పించే వరకూ రిజర్వేషన్లను గట్టిగా వ్యతిరేకించే బ్రాహ్మణ–బనియా తదితర అగ్రవర్ణాల మెదళ్లు ఇక ఎంత చురుకుగా, చలనశీలంగా పనిచేస్తాయో చూడాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు బాబాసాహబ్‌ భీంరావ్‌ ఆర్‌ అంబేడ్కర్‌ ఇప్పుడు పూజనీయుడు. అలాగే, బ్రాహ్మణ, వైశ్య, రాజపుత్రులు, వెలమ, కమ్మ, రెడ్డి, కాపు వంటి ఇప్పటి వరకూ కోటా లేని కులాల వారికి నరేంద్రభాయ్‌ మోదీ ఇక నుంచి అభినవ అంబేడ్కర్‌ అవుతారేమో? ఈ అగ్రకులాలన్నీ నరేంద్ర మోదీ పాదపూజలో తరించిపోయే రోజులు ముందున్నాయి.
Exit mobile version