Newsminute24

జగన్మోండిపై జనసేనాని బ్రహ్మస్త్రాలు..

 

ఒక్క ఫొటో వేల మాటలతో సమానం అయితే, ఒక్క కార్టూన్‌ లక్షలమంది భావోద్వేగాలను చూపించే సాధనం. అక్షరం చిత్రంతో కలిసినప్పుడు అది బతుకు చిత్రానికి ప్రతీకే అవుతుంది.  నలిగిపోతున్న ఆంధ్ర ప్రజల బతుకు చిత్రాన్ని,  విరిగిపోయిన ఏపీ అభివృద్ధి రథాన్ని, పెరిగిపోతున్న వైసీపీ నియంతృత్వ పోకడను అలాంటి కార్టూన్‌ అస్త్రంతో ఎదుర్కొంటోంది జనసేన. గత ఆరేడు నెలలుగా, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తో పాటు, జనసేన అధికారిక ట్విటర్‌ ఖాతాల్లో వైసీపీ ప్రభుత్వంపై సంధిస్తున్న కార్టూన్లు ఏపీ ప్రజల మనోగతాన్ని బయటపెడుతూ, వారి మనసులు గెలుచుకుంటున్నాయి.  యువతను ఆలోచించేలా, వైసీపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకునేలా, ఇంకా కొంచెం ముందుకెళ్లి వైసీపీ నేతలకు చికాకు పెడుతున్న ఈ కార్టూన్లు ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఏపీ అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌ లో అడుగుపెట్టగానే ముందుగా కనిపించేవి అద్వానంగా మారిన రోడ్లు మాత్రమే.

మూడున్నరేళ్లుగా అక్కడి రోడ్ల మీద ఇంత మట్టి పోసిన జాడలు కూడా లేవు.  అడుగడుగున గుంతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల సమస్యలపై జనసేన ప్రత్యేకంగా రూపొందించి వదిలిన కార్టూన్లు వైసీపీ ప్రభుత్వ పెద్దలను నిద్ర పోనివ్వకుండా చేశాయి. ఒక కార్టూన్‌ లో ‘ సీఎం జగన్‌ సార్‌ మేం పంపించిన కొత్త షూస్‌ వేసుకొని మళ్లీ ఒక్కసారి పాదయాత్ర చేయమని మా సవినయ మనవి, అని మన ప్రజల దగ్గర నుంచి లెటర్‌ సార్‌’ అని హెలికాప్టర్‌ ఎక్కబోతున్న జగన్‌ కి తన అసిస్టెంట్‌ చెప్తూ షూస్‌ ఇచ్చే కార్టూన్‌ విపరీతంగా షేర్‌ అయ్యింది. రోడ్లను గాలికొదిలేసి, ఎప్పుడూ హెలికాప్టర్‌ లో ప్రయాణం చేసే సీఎం జగన్‌ కి పోలికగా, ప్రతి కార్టూన్‌ లో జగన్‌ కాలికి హెలికాప్టర్‌ కట్టేసినట్టు చూపించడం ఒక ట్రెండ్‌ గా మారింది. ఇక, ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన చేపట్టిన ‘గుడ్‌ మార్నింగ్‌ సీఎం సార్‌’ క్యాంపెయిన్‌ కి విస్తృత ఆదరణ లభించిన నేపథ్యంలో… జగన్‌ ని బాగా చికాకు పెట్టిన ఈ క్యాంపెయిన్‌ కూడా అద్భుతంగా కార్టూన్‌ లో చూపించే ప్రయత్నం చేసింది జనసేన టీమ్‌. ‘గుడ్‌ మార్నింగ్‌ సీఎం సార్‌ క్యాంపెయిన్‌’ కోసమే వేసిన మరో కార్టూన్‌ లో ‘సర్కాస్‌ ఫీట్లు కాద్సార్‌, మన ప్రజలే…  ఆఫీసుకు, పనుల మీద బయటకు వెళ్తున్నారు’ అంటూ వ్యంగంగా రోడ్ల దుస్థితిని కళ్లకు కడుతుంది ఆ కార్టూన్‌.

ఏపీ ప్రజల బాధలను తెలుసుకోవడానికి చేపట్టిన ‘జనవాణి, జనసేన భరోసా’ కార్యక్రమం, నిర్వహించిన ప్రతి చోటా జనాలు భారీగా క్యూ కట్టారు. వైసీపీ నాయకుల పీడనను తప్పించుకోవడానికి భారీగా తరలివచ్చిన ప్రజలను నుంచి స్పందనను చూసి తాడేపల్లి ఆఫీస్‌ ఓర్చుకోలేకపోయింది.  ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వారిని ‘రౌడీ సేన’ అని దూషించింది. జగన్‌  అహంకారాన్ని, ద్వేషాన్ని తిప్పి కొట్టడానికి కార్టూన్‌ అస్త్రాన్ని ప్రయోగించారు  జనసేనాని. ఎవరు ప్రజలను దోచుకుంటున్నారో, ఎవరు ప్రజల ఆస్తిని చాప కింద నీరులా చేరి లాక్కుంటున్నారో? చూపించేలా ‘దొంగే.. దొంగ’ అన్నట్టు వైసీపీ నాయకులు ఇస్తున్న కవరింగ్‌ ని ఆ కార్టూన్‌ లో చూపించారు.

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల పాలిట శాపంగా తీసుకొచ్చిన యాప్‌ వల్ల  ఉపాధ్యాయులు నానా అవస్థలు పడుతున్నారు. బడికి వచ్చింది మొదలు ఆ యాప్‌లో వివరాలు నమోదు చేసేసరికే పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది, ఇంకా వారు పిల్లలకు చదువు చెప్పడానికి సమయం ఎప్పుడు దొరికేది? ఇలాంటి పరిస్థితిని కళ్లకు కట్టినట్టు జనసేనాని తన ట్విటర్‌ లో కార్టూన్‌ అస్త్రాన్ని సంధించారు. ఉపాధ్యాయుల జవాబుదారీ కోసం యాప్‌ తీసుకొచ్చారు, మరీ మీ ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరును ట్రాక్‌ చేయడానికి కూడా ఒక యాప్‌ తీసుకురావాలని సీఎం కి తన కార్టూన్‌ ద్వారా బలమైన డిమాండ్‌ పంపించారు జనసేనాని. రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరి అభిప్రాయాన్ని  ఆ ఒక్క కార్టూన్‌ ప్రతిబింబించింది.

వైసీపీలో జరుగుతున్న అవినీతి, అక్రమాల గురించి మాట్లాడితే, సీఎం జగన్‌ నుంచి బదులు రాదు. ప్రశ్నిస్తున్న వారి సామాజికవర్గ నాయకులతోనే బదులు చెప్పించి, కులాల పరంగా విద్వేషాలు, కల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తారు. విశాఖపట్నం జిల్లాలో ఉన్న రుషికొండను మింగుతున్న అనకొండల గురించి మాట్లాడితే, కాపు నాయకులతో పవన్‌ కళ్యాణ్‌ని బూతులు తిట్టించారు. ఇలాంటి పద్మవ్యూహాన్ని ప్రజలకు అర్థమయ్యేలా, మాటల్లో చెప్పడం అంత సులభం కాదు. దీనికి కూడా జనసేన టీమ్‌ మంచి కార్టూన్‌నే ఆయుధంగా ఉపయోగించింది. రుషి కొండలను తవ్వుకుని తింటున్న వారిని అద్దంలో చూపించినట్టే ఒక కార్టూన్‌ని జనసేనాని తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసి, వైసీపీ నాయకులను ఉక్కిరి బిక్కిరి చేశారు.

రైతులకు సబ్సిడీ లేదు, ఊళ్లో ఉన్న వాళ్లకి పనులు లేవు, రోడ్లు సరిగా లేవు,  ఉద్యోగాలు లేవు, రాష్ట్రంలో ఎవరూ క్షేమంగా లేరు. జగనన్న ఇచ్చే రకరకాల సంక్షేమ పథకాల ద్వారా వస్తున్న డబ్బు నెల ఖర్చులకు కూడా సరిపోనప్పుడు, ఆ సంక్షేమం ఎవరికి చేరుతున్నట్టు? కానీ, అర్థరూపాయి ఇచ్చి, రూపాయి ప్రచారం అన్నట్టు, గడప గడపకు జగనన్న సంక్షేమ పథకాలు అంటూ జగన్‌ తనను తాను ప్రమోట్‌ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ప్రజల మనోస్థితిని అద్దం పట్టేలా జనసేనాని ఒక కార్టూన్‌ని తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అందులో  ప్రజలు తరిమికొడుతున్నా, చిన్న చిన్న అపశృతులు తప్ప అంతా సజావుగానే నడుస్తుందనే వైసీపీ దబాయింపును చూపించారు. ఈ కార్టూన్‌ ప్రతి వైసీపీ ఎమ్మెల్యేకు తలనొప్పులు తెచ్చింది.

రాష్ట్రంలో అధికారం రాగానే సంపూర్ణ మద్యనిషేధం చేస్తాని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. పాదయాత్ర చేస్తూ ప్రతి చోట ఆ మాట మాట్లాడారు.  నిషేధం సంగతి దెవుడెరుగు, ఏకంగా తన అనుచరులతో కలిసి సొంత బ్రాండ్లతో  లిక్కర్‌ వ్యాపారం మొదలుపెట్టి, జగన్‌ రెడ్డి అసలు రూపాన్ని బయటపెట్టే విధంగా ఆగస్టులో జనసేనానీ ట్వీట్‌ చేసిన  కార్టూన్‌ వైరల్‌ అయ్యింది. మద్యనిషేధం తమ మేనిఫెస్టోలో లేదని అబద్ధాలు చెప్పి మంత్రి అమర్‌నాథ్‌ కి కౌంటర్‌ గా ‘మద్యం మిథ్య, నిషేధం మిథ్య,తాగమని, తాగొద్దని చెప్పడానికి మనమెవరం? అంతా వాడి ఇష్టం’ అంటూ జగన్‌ మోహన్‌ రెడ్డి సుద్దులు బోధిస్తున్నట్టుగా ఉండే కార్టూన్‌ ట్విటర్‌ లో ట్రెండ్‌ అయ్యింది. మరో కార్టూన్‌ లో తాగుతున్న భర్త పక్కన నిలబడ్డ మహిళ… ‘మద్య నిషేధం అన్నారు కదా?’ అని వైసీపీ నాయకుడిని అడిగితే, దానికి బదులుగా ‘నిషేధించాం కదా? మీ ఇల్లు గుల్ల చేస్తదని, ఖరీదైన మద్యం దొరక్కుండా చేశాం కదా!’  ఆ నాయకుడు చెప్తాడు. ఈ చురక ఎవరికి తాకాలో వారికి తాకింది.

హేతుబద్ధీకరణ పేరిట 8 వేల బడుల్ని మూసేసి, పిల్లల్ని బడులకు దూరం చేసిన జగన్‌ రెడ్డిపై…. ‘ముద్దుల మామయ్యంట, ముద్దుల మామయ్యంట… దొంగమామయ్య, బడి దొంగ మామయ్య.. మా బడినెత్తుకెళ్తున్నాడు ‘అని బడి పిల్లల బాధలను తెలిపే కార్టూన్‌ కూడా అందరి మనసు గెలుచుకుంది. స్కూళ్లను మూసేసి, పిల్లలను కిలోమీటర్లు నడిచేలా చేసిన పరిస్థితిని,  మాటలేమో ‘ అమ్మ ఓడి‘ అని చెప్తుంటారు, చేతలేమో ‘అమ్మకానికో బడి‘ అన్నట్టుగా తయారైన దుస్థితిని ఈ విషయంపై వచ్చిన కార్టూన్లు కళ్లకు కట్టినట్టు చూపించారు జనసేనాని.

జాబ్‌ క్యాలెండర్‌ అని, ప్రతి సంవత్సరం జాబులని అంటూ జగన్‌ నిరుద్యోగులను నాలుగేండ్లుగా మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారు జగన్‌. ఈ మోసాన్ని, నిరుద్యోగుల గుండె కోతను ప్రతిబింబించే కార్టూన్‌ ని జనసేనానీ జూలైలో ట్వీట్‌ చేశాడు.  విజయవాడ నుంచి మంగళగిరి పోవాలన్నా సారు ఎలికాప్టర్లనే ఎళ్తడు, మనకేమో బస్సేక్కే స్థోమతే లేకుండా పాయే అని తమ దుస్థితిని, పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీల తాలూకు వేదనను మరో కార్టూన్‌ చూపిస్తుంది. 

ఈ నాలుగేళ్లలో ఏపీకి ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త పరిశ్రమ రాలేదు. వచ్చిన పరిశ్రమలు కూడా వైసీపీ వ్యవహార తీరు వల్ల వెనక్కి వెళ్లిపోయాయి. తాజాగా వైసీపీ నాయకులు పర్సంటేజీ ఇవ్వాలని బెదిరిస్తుండటంతో అనేక సంస్థలు ఏపీ  నుంచి వెళ్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వేసిన ‘నేనేమైనా నా జేబిలోకి అడిగినానా, పార్టీ ఫండ్‌,  ఎలక్షన్‌ ఫండే కదా?’ అని అడిగే వైపీసీ నాయకుడిపై కౌంటర్‌ గా వచ్చిన కార్టూన్‌ ని జనసేన పార్టీ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ప్రభుత్వ కక్ష్య సాధింపు చర్యల వల్ల ఇతర రాష్ట్రాలకు తరలి పోతున్న పరిశ్రమల గురించి అనేక కార్టూన్లను జనసేన పార్టీ తమ ట్విటర్‌ ఖాతాలో విడుదల చేసింది.

రాబోయే ఎన్నికల కోసం జనసేన అధ్యక్షుడు సిద్ధం చేసుకున్న వారాహి ప్రచార రథంపై కూడా జగన్‌ ఈర్ష్య ద్వేషాలతో వ్యవహరిస్తున్నతీరును కూడా ఎండగట్టాయి కార్టూన్లు. సర్కారు నిధులను దారి మళ్లించడంతో పోరుబాట పట్టిన సర్పంచులను, వారిని అడుక్కునే పరిస్థితికి దిగజార్చిన వైసీపీ నాయకుల గురించి మరో కార్టూన్‌లోఉంటుంది.

జగనన్న మోసం సిరీస్‌ కార్టూన్‌ లో ప్రజలకు పథకాలు ఇస్తున్నట్టే ఇస్తూ, పథకం ప్రకారం రాష్ట్ర సంపదను దోచుకుంటున్న తీరును చూపించారు. ‘లారీల నిండా ఇసుక, ఇటుకలు తెస్తుంటే, మాకు ఇళ్లు  కట్టిస్తున్నారనుకున్నాం, ఇదిగో ఇది కట్టేసి పోయారు… మూడేళ్లయ్యింది. అతీగతీ లేదు’ అంటూ  జగనన్న ఇళ్లల్లో  భారీ స్కాం ని జనసేన పోస్టు చేసిన కార్టూన్‌ కూడా సామాన్యుల మనసు గెలుచుకుంది.  ‘గుట్టల మీద సెంటు భూమి ఇచ్చి కట్టుకోపోండంటే పేదోళ్ల ఎట్టా సచ్చేది, బాబూ?’ అని పేదవాళ్లు దీనంగా అడిగే మరో కార్టూన్‌ గుండెల్ని పిండేస్తుంది. ఏపీలో మూడున్నరేళ్లలో 8 శాతం కూడా పూర్తికానీ పేదలకు  ఇళ్లు అంటూ, వారి భావోద్వేగాలతో సర్కారు ఆడుకుంటున్న తీరును ఈ కార్టూన్లు ద్వారా బయటపెట్టే ప్రయత్నం చేశారు.

అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులకు ఎలాంటి సాయం చేయకుండా చేస్తున్న నిర్లక్ష్యాన్ని చూపిస్తూ… ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసే కార్టూన్‌ ఒకటి. అయితే, ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన వారి ఆవేదనను, బుల్డోజర్లతో ఇల్లు కూల్చేసిన జగన్‌ సర్కార్‌ దౌర్జన్యాన్ని చూపించిన కార్టూన్‌ ఇంకొకటి. జనాలు నిరసనలు చేయకుండా నలుపు డ్రెస్సులు, నలుపు చున్నీలు బ్యాన్‌ చేసిన జగన్‌ నియంతృత్వ మనస్తత్వాన్ని చాటే చెప్పే కార్టూన్లకు కూడా మంచి ఆదరణ దక్కింది. అప్పుల ఊబీలో కూరుకుపోయి, ఒకటో తారీఖు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగ-జార్చిన వైసీపీ ప్రభుత్వ వ్యవహారాన్ని సైతం కొన్ని కార్టూన్లు చాటి చెప్పాయి.

ప్రజల్లోకి వెళ్లడానికి, ప్రజలను చైతన్యం చేయడానికి అనేక దారులు ఉంటాయి. అందులో మాటలు, రాతలు ఒక దారి అయితే, కార్టూన్లు మరో దారి. ఇలా చిత్రాలతో వైసీపీ గుట్టు విప్పి, భవిష్యత్తును నిర్మించడానికి జనసేన అనేక రకాలుగా ప్రయాత్నాలు చేస్తున్నది. ఇలాంటి ప్రజా కార్టూన్ల ద్వారా జనసేన, ఏపీ జనాల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం నిజంగా ప్రశంసనీయం.

Exit mobile version