Site icon Newsminute24

CharlieChaplin: హిట్లర్ ను జయించిన చాప్లిన్ కోసం …

ఆర్టిస్ట్ మోహన్ :

పేదరికంలో పుట్టి పెరిగి, పేదరికానికి వ్యతిరేకంగా, ఫాసిజానికి వ్యతిరేకంగా నవమానవత కోసం
మహత్తర నటనా వైదుష్యంతో పోరాడిన కళాకారుడు, మనీషి చార్లీచాప్లిన్ 1977 డిసెంబర్ 25న మరణించారు. వారం రోజుల తర్వాత చాప్లిన్ గురించి ఆర్టిస్ట్ మోహన్ రాసిన వ్యాసం 1978 జనవరి 2న విశాలాంధ్ర దినపత్రికలో వచ్చింది.
47 సంవత్సరాల క్రితం మోహన్ రాసిన వ్యాసాన్ని … చదవండి.

రాత్రి లండన్ థియేటర్లో నాటకం. నటీమణి హన్నా సుతారంగా రంగస్థలి మీది కొచ్చింది. సన్నని గొంతెత్తి పాట ప్రారంభించింది. కళ్లప్పగించి చూస్తున్న ప్రేక్షకులు మంత్ర ముగ్ధులవుతున్నారు. అంతలోనే ఆమె గొంతులో కీచు శబ్దం… కర్టెన్ వెనుక గందరగోళం. ప్రేక్షకుల్లో అలజడి. ఇక ఆమె గొంతు పెగల్లేదు. గ్రీన్ రూమ్ లో సన్నగా పోట్టిగా ఉన్న ఆమె కొడుకు ఆరేళ్ళ వయసున్న అర్భకుణ్ని హడావిడిగా వేదికమీదికి తోశారు. ఆ చంటి వాడు అదరలేదూ, బెదరలేదు. అద్భుతంగా పాడాడు. నమ్మోహితులైన ప్రేక్షకుల హర్షద్ద్వానాలతో థియేటర్ నిండింది.

ఆ తర్వాత హన్నా ఇక నాటకాలు మానుకుంది. ఆమె భర్త కూడా నాటకాలు వేసేవాడు, కానీ తాగుడుతో నటననుంచి, ఆ తర్వాత జీవితం నుంచి తప్పుకున్నాడు. పాట పాడిన రోజునుంచే ఆరేళ్ళ చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్ పైనే కుటుంబ భారం పడింది. పేదరికంతో పోరాడడానికి చిన్నవయసులోనే నాటకాలు వేశాడు చార్లి. తల్లినీ, అన్ననూ పోషించడానికే తొమ్మిదేళ్ళ వయసులో యూరప్ వెళ్ళి ప్రదర్శనలిచ్చాడు. అన్న ఓడలో ఉద్యోగానికి పోయాడు. లండన్ లో తల్లి ఒంటరి పక్షిగా మిగిలింది. ఆకలి, పేదరికం వాళ్ళ కుటుంబాన్ని ముక్కలు చేశాయి. ఆనందం. అనుభూతి గగన కుసుమాలయ్యాయి. 21 ఏళ్ళ వయసులో (1910) అమెరికాకు వలస పోయాడు చార్లీ. అక్కడ తనను ఖండించి, నిందించి, శాసించి, ప్రశంసించి, వేలెత్తి చూపించి, అవమానించి, ఆనందించి ప్రోత్సహించిన వికృతమైన, వింత సమాజంలో 42 ఏళ్ళు గడిపాడు.
రెండు రెళ్ళునాలుగనే కళాకారులకి హాలీవుడ్ విధించే అతి క్రూరమయిన శిక్షలు సహజంగానే చాప్లిన్ కు కూడా పడ్డాయి.
మూకీ చిత్రాలు ముమ్మరంగా వస్తున్న కాలమది. ఒక నటీమణితో చార్లీకి పరిచయమైంది. తర్వాత కొన్నేళ్ళపాటు ఆమె అంతర్థానమయింది. యెవరో ఎక్కడో ప్రసాదించిన గర్భంతో వచ్చి దానికి కారకుడు చాప్లినే అనింది. అతన్ని కోర్ట్ కీడ్చింది అమెరికా సమాజం. చాలా కాలం కోర్టు లో కేసు పత్రికల్లో సంచలన వార్తలు, అతన్ని భ్రష్టుపట్టించడానికి నాజీల ప్రచార దుమారం సాగి పోయాయి. కేసు ముగిసేలోగానే ఆమె ప్రసవించింది. డాక్టర్లు వైద్య పరీక్షచేస్తే ఆ బిడ్డ తండ్రి చాప్లిన్ కాదని రుజువైపోయింది. విచారణ జరిగినన్నాళ్ళు పనిగట్టుకు విరుచుకు పడే జనం, కిరాయి జర్నలిస్టులు, నాజీలూ అతన్ని కాల్చుకుతిన్నారు. విచిత్రమో, విచారకరమో మరి ఆ నిజం రుజువై ఇంతకాలమైన తర్వాత మొన్న చాప్లిన్ చనిపోయినప్పుడే బ్రిటిష్ వార్తా సంస్థ రాయిటర్ ఆ ఘటన గురించి వెకిలిగా సినికల్ గా ప్రస్తావించటం వార్తలకి మరో మార్గంలేని మన పత్రికలన్నీ దాన్నే ప్రచురించటం…

ఆనాడు చాప్లిన్ “కామ్రేడ్స్” అని జనాన్ని పిలిచినందుకే హాలీవుడ్ కుబేరులూ, మతాధిపతులూ, రాజకీయనాయకులూ కన్నెర్ర చేశారు. అయినా రాజీపడలేదతను. అప్పటికే హాలీవుడ్ సినిమాలు డబ్బు పిచ్చి, వికారమైన సెక్స్ ప్రదర్శన, జుగుప్సాకరమైన కామ ప్రేరేప దృశ్యాలతో కుళ్ళి కంపు కొడుతూంటే ఆ వరస లోనే తన కళను తాకట్టు పెట్టడానికి ససేమిరా ఒప్పుకోలేదు. చాప్లిన్ ఎగ్రిమెంట్ మేరకు ఒక పెద్ద కంపెనీకి సినిమా తీసి ఇచ్చేవాడు. కానీ వాళ్ళ షరతులకు, జోక్యానికి తావిచ్చే వాడు కాదు. అందుకే అడుగడుగునా ఘర్షించాడు. ఏమైనా సినిమా టెక్నిక్ లో “టాకీ” కొత్త మార్పులను తీసుకొచ్చినపుడు హర్షించలేకపోయాడు. మూకీలకే కట్టుబడి ఉన్నాడు.
నిరుద్యోగంవల్ల దిక్కు లేని తండ్రి తన కొడుకుని పురమాయించి, ఊళ్ళో మేడల కిటికీలు బద్దలు కొట్టించి, తర్వాత తానువెళ్ళి మరమ్మత్తు చేసి డబ్బు సంపాదించే కథను “ది కిడ్” చిత్రం లో హాస్య కరుణ రస ప్రధానంగా చూపాడు. తెలుగు ప్రేక్షకులకిది సువరిచితమైందే.

ప్రపంచాన్ని మింగడానికి నాజీ నియంత హిట్లర్ పేరాశలుచూసి 1935 లో “ది గ్రేట్ డిక్టేటర్” కథ తయారు చేశాడు. మూడేళ్ళ తర్వాత దాన్ని కొంత మార్చాడు. 1939 లో సినిమా తీయటం అతి రహస్యంగా మొదలయింది. అయినాసరే అది ఫాసిస్టు వ్యతిరేకమైన చిత్రమని అందరికీ తెలుసు. అమెరికాలో జర్మన్ రాయబారి ఈ చిత్ర నిర్మాణాన్ని ముందుగానే నిరసించాడు. నాజీ సంఘాలన్నీ ప్రాణాలు తీస్తామంటూ బెదిరించాయి. ఆకాశరామన్న ఉత్తరాలకు అంతే లేదు. ప్రతీ కలుగులోను కమ్యూనిస్టులని కనిపెట్టే “అన్ అమెరికన్ యాక్టివిటీస్ కమిటీ” కూడా ఈ క్రూసేడులో కలిసింది. ఈ చిత్రం వల్ల పారిస్ లో నాజీ మూకల మధ్య చాప్లిన్ అతి నీచమైన అవమానాలకు గురి అయ్యాడు. అయినా సరే మేరునగధీరుడి లాగా నిలిచాడు.
ఆరోజుల్లోనే 20 లక్షల డాలర్ల వ్యయంతో సినిమాను అంత ధైర్యంగా తీశాడంటే మాటలు కాదు.
హిట్లర్ దురాక్రమణ సేన పారిస్ వీధుల్లో కదం తొక్కుకున్న కాలంలో “ది గ్రేట్ డిక్టేటర్” నిర్మాణం పూర్తయింది. స్వేచ్చా, స్వాతంత్ర్యాలకు ప్రతీకలుగా నిలిచే ఆమెరికా పత్రికలన్నీ కట్టగట్టుకొని ఈ సినిమాకి ప్రచారం ఇవ్వకుండా సమ్మె చేశాయి. ఈ సినిమావల్ల ఇతర దేశాల్లో తాము ఇరుకున పడతామని అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ వాపోయాడు.

క్లయిమాక్సో లేక యాంటి క్లయిమాక్సో గానీ “ది గ్రేట్ డిక్టేటర్” విడుదలయిన వెంటనే
ప్రజలంతా దానికి బ్రహ్మరథం పట్టారు. యుద్ధోన్మాదులూ, వారి ఏజంట్లను చాప్లిన్ ఎదిరించాడు గానీ ఒప్పించ లేకపోయాడు. శాంతికాముక సామాన్య ప్రజల సమాదరణ మాత్రం పొందగలిగాడు. ప్రపంచ వ్యాప్త ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో కళాకారుడిగా తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించగాలిగాడు.

ఇంత సంచలనం – వివాదం సృష్టించిన కళాఖండం కథ టూకీగా: “మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా పనిచేసిన యూదు క్షుర వృత్తిదారు (చాప్లిన్) విమాన ప్రమాదంలో జ్ఞాపకశక్తి కోల్పొతాడు. రొమానియా దేశానికి హింకెర్ (ఈ పాత్రను కూడా చాప్లినే ధరించాడు.) నియంత అయిన తర్వాతగాని క్షుర వృత్తి దారుకు జ్ఞాపకశక్తి తిరిగి రాదు. యూదు యువతి హన్నాడోతో చెలిమి చేస్తాడు. యూదుల పై
హింకెర్ హింసాకాండ ఉదృతమవుతుంది. అతని బార్బర్ షాప్ ను మూకలు దగ్ధం చేస్తాయి. ఒక పాత మిత్రుణ్ణి దాచిపెట్టినందుకు బార్బరుడిని అరెస్టుచేసి, కాన్సెంట్రేషన్ క్యాంపు కు పంపుతారు. హన్నా మరో దేశానికి పారిపోతుంది. మరో దేశంపై దాడి పథకం గురించి చర్చించేందుకు పొరుగుదేశం నియంత నేపాలోనిని హింకెర్ ఆహ్వానిస్తాడు. ఇలా ఉండగా నిర్బంధ శిబిరం నుండి బార్బర్ పారిపోతాడు. (నియంత, బార్బర్ – రెండు పాత్రలను చార్లిన్ పోషిస్తాడు గనక ఇద్దరూ ఒక్కలాగే ఉంటారు) బార్బరును చూసి హింకెల్ అని పొరబడి మరోదేశాన్ని జయించిన విజేతగా రాజ లాంఛనాలతో తీసుకెళ్ళి ప్రజలనుద్దేశించి ప్రసంగించడానికి వేదిక ఎక్కిస్తారు. కానీ అక్కడ బార్బార్ మానవతావాదం తొణికిసలాడే ప్రసంగం చేయటంతో సేనాపతులు తత్తరపడతారు. ముగింపులో ఆరు నిమిషాలపాటు వుండే ఈ ప్రసంగం చిత్రానికి ప్రాణం. ఇది చాప్లిన్ రాసిన ప్రసంగం. “స్వేచ్చ” అని రాసివున్న వేదిక నెక్కి చాప్లిన్ ఇలా చెప్తాడు!
“ప్రపంచ ప్రజలారా నిరాశ పడకండి. నీరుగారబోకండి. నియంతలకు లొంగేదిలేదు. ఈ జీవితాన్ని అత్యద్భుతమయిన సాహస కృత్యంగా మార్చే శక్తిని పుంజుకోండి. తర్వాత ప్రజాస్వామ్యం పేరిట ఆ శక్తిని వాడదాం. అందరం ఐక్య మవుదాం. కొత్త ప్రపంచం కోసం పోరాడుదాం. అది మనుషులందరికి పనిచేసే అవకాశమిచ్చే ప్రపంచం. అది యువతరానికి భవితవ్యమిచ్చే ప్రపంచం. అది వృద్ధులకు భద్రతనిచ్చే ప్రపంచం…”
అదే ప్రసంగంలో మరో భాగం..
సైనికులారా! మిమ్మల్ని అసహ్యించుకుని, శృంఖలాబద్ధుల్ని చేసే ఈ నరరూప రాక్షసులకు తలవంచబోకండి. మీమీద డ్రిల్లు రుద్ది, మీ తిండిని కూడా వాళ్ళే నిర్ణయించి, పశువులుగా చూసే ఈ నరరూప పశువులకు తల ఒగ్గకండి… సైనికులారా పోరాడండి స్వేచ్చ కోసం. దాస్యం కోసం పోరాడబోకండి. జీవితాన్ని సౌందర్యపూరితంగా, స్వేచ్ఛాయుతంగా చేసే శక్తి మీకున్నది. ఆ శక్తిని ప్రజాస్వామ్యం కోసం వినియోగిద్దాం. అందరం ఐక్యమవుదాం. ప్రపంచ దాన్యశృంఖలాలు తెంచండి. ఏ లోకంలో విజ్ఞానశాస్త్రం, అభ్యుదయం, సకల మానవ కళ్యాణం సమకూరుతాయో ఆ లోకం కోసం పోరాడుదాం.
ఇంత స్పష్టమైన అవగాహనతో నిర్భీతితో నిలిచిన చాప్లిన్ ని “చంపడానికి ముందు పిచ్చి కుక్క” అన్నట్టు కమ్యూనిస్ట్ అనీ, అమెరికా పౌరసత్వాన్నీ వద్దన్నాడు గనక దేశద్రోహి అనీ ప్రభుత్వమూ, పత్రికలూ, నాజీలూ ఒకటే గోలచేసి దేశం నుండి పొగబెట్టి తోలేశారు. చాప్లిన్ బెదిరిపోలేదు సరిగదా “ఖచ్చితంగా అవ్వాల్సినదేదో అయింది” అని తాపీగా అన్నాడు.
పేదరికంలో పుట్టి, పెరిగి, పేదరికంతో పోరాడిన చాప్లిన్ ఇలా అంటారు.
“బీదరికం కుష్టు వ్యాధి లాంటిది. అది నీ శరీరాన్ని కుళ్ళ బెడుతుంది. నీ పరిసరాలను కుళ్ళబెడుతుంది. నీ సర్వస్వాన్నీ కుళ్లుతో ముంచెత్తుతుంది. ఆధునిక శాస్త్ర జ్ఞానం ఎన్నెన్నో వ్యాధులకు మందు కని పెట్టింది. ఈ జబ్బుకు కూడా మందుంది. కానీ స్వార్థపరులు ఈ మందుని అందరికి అందుబాటులోకి రానివ్వటం లేదు.”.
ఆ మందేమిటో కూడా చాప్లిన్ మరోచోట మరీ స్పష్టంగా చెప్తాడు.

ఈ ప్రభుత్వాలు కానీ, జీవకారుణ్య సంస్థలు కానీ దరిద్రాన్ని, బాధల్ని తొలగించ లేవు. గతితార్కిక భౌతికవాద మొక్కటే పేదరికం పీడను తొలగించగలదు.
సామ్రాజ్యవాద దాహంతో నియంతలు ప్రపంచాన్ని బుగ్గిపాలు చేసింతర్వాత శాంతికాముకుడు చాప్లిన్ గుండె విలవిలా కొట్టుకుంది..
“బుద్ధిహీనులు, బాధ్యతారహితులయిన కొంతమంది చేతులలో అధికారం చిక్కటం రణానికి దారితీసి మరణంతో ముగిసింది. అయినా మన మింకా కళ్ళు తెరవలేదు.” అన్నాడాయన.
“పత్రికలన్ని ఆయన ప్రపంచ ప్రఖ్యాత హాస్యగాడనీ” విదూషకూడనీ రాశాయి. కాని ఆయన ప్రపంచ ప్రఖ్యాతి కేవలం హ్యూమరిస్ట్ అయినందువల్లేనా, ఆయన వట్టి హ్యూమరిస్టుకాదు. గొప్ప హ్యూమనిస్టు. ఆ హాస్యంలో అర్థముంది. ఆ ఆనందంలో కన్నీళ్ళు, ఆశా కలగలిసి ఉన్నాయి. ప్రేమకోసం, ఆదరం కోసం, అంతులేని అన్వేషణ ఉంది. విషాదం ఎదురయినా అసలు అన్వేషణే ముఖ్యం. అది సాగించే దీక్షను, శక్తినీ మనకందిస్తాడు చార్లీ.
“ఈ మనిషేవరో నాకు తెలీదు. కానీ ఈ మేకప్, ఈ బట్టలూ వేనుకుని అతనిలాగే ఫీలపుతాను.. మీకు తెల్సా? వీడికి చాలా ముఖాలున్నాయి. ట్రాంప్, కవి, పెద్దమనిషి, స్వాప్నికుడు, ఒంటరి – ఎప్పుడూ రొమాన్స్ గురించి, సాహనం గురించీ ఆశపడుతుంటాడు.

Exit mobile version