సాగర్ ఉపఎన్నిక సమీపిస్తున్న వేళ నల్గొండ జిల్లాకు కెసిఆర్ వరాలు ప్రకటించారు. మంగళవారం ఎన్నికల పర్యటనలో భాగంగా పర్యటించిన ముఖ్యమంత్రి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున, మండల కేంద్రాలకు 30 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు కెసిఆర్ తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీకి 10 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీకి కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు కోటి చొప్పున నిధులు ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. వీటిని సీఎం ప్రత్యేక నిధి ద్వారా కేటాయిస్తున్నట్లు .. రేపే ఉత్తర్వుల జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఎత్తిపోతల పూర్తిచేయకపోతే ఓట్లు అడగం..
నల్గొండ అనాదిగా చాలా నష్టపోయింది, గత పాలకుల హయాంలో ఏ నాయకుడు పట్టించుకోలేదని గుర్తుచేశారు. హుజర్నగర్ ఎన్నిక నుంచి జిల్లా సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. 2500 కోట్లతో ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేశాం. వచ్చే ఎన్నికల నాటికి ఎత్తిపోతల పథకం పూర్తి చేయక పోతే ఓట్లు అడగమని సభాముఖంగా తెలియజేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గిరిజనుల పొడు భూముల సమస్యను సత్వరం పరిష్కరిస్తామని, నాతో పాటు ఉద్యమంలో పాల్గొన్న నోముల నర్సింహా పక్కన లేకపోవడం లోటని కేసీఆర్ అన్నారు.
కాగా కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఢిల్లీ నామినేట్ చేస్తే వచ్చే నేత కాదని ప్రజల మద్దతు గెలిచి వచ్చిన నేతనని కేసీఆర్ స్పష్టం చేశారు. నల్గొండ చైతన్యవంతమైన ప్రజానీకం ఉన్నటువంటి జిల్లా అని, వాస్తవాలను గమనించి తీర్పు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అన్న పదం ఉచ్ఛరించే అర్హత లేదని.. రాష్ట్రాన్ని కరువు పాల్జేసింది ఎవరని.. గులాబీ జెండా ఎందుకు పుట్టాల్సిందో ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు. ఫ్లోరైడ్ సమస్య నల్గొండ జిల్లా ఒక తరాన్ని నాశనం చేసింది. మా హయాంలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేశామని కేసీఆర్ పేర్కొన్నారు.