Newsminute24

మళ్లీ రాజుకున్నహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఎ)రగడ..

హెచ్ సీఎ(హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) లో రగడ మరోసారి రాజుకుంది. అధ్యక్షుడు అజహరుద్దీన్, ఇతర సభ్యులు పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు మాజీ క్రికెటర్ శిశలాల్ యాదవ్. అసోసియేషన్ అవినీతిమయమైందని.. సమస్యలను పట్టించుకునేనాథుడే లేడని ఆరోపించారు. అజహర్ అనాలోచిత నిర్ణయాల వలన యువ క్రికెటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అపెక్స్ కౌన్సిల్ నియమాలను ఉల్లంఘిస్తూ..ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరబాద్ క్రికెట్ అసోసియేషన్ సమస్యలపై శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్‌ ఆయుబ్‌, మాజీ కార్యదర్శి శేష్‌ నారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.హెచ్‌సీఏలో సమస్యలు.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే తరహాలో ఉన్నాయని చర్చించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.అధ్యక్షుడి అజహర్ ఒంటెత్తు పోకడల వలన ఆటగాళ్లపై పెనుభారం పడుతోందని మండిపడ్డారు.

ఇక సెలక్షన్ కమిటీ విషయంలో అజహర్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయుబ్ ఆరోపించారు .క్రికెట్ సలహా కమిటీలను రద్దు చేసి.. సొంత సెలక్షన్ కమిటీని నియమించారన్నారు. హెచ్ సీఎలో.. అంతర్జాతీయ టీ20 , రంజీ,ముస్తాక్ అలీ టోర్నిలు నిర్వహించడంలేదని మండిపడ్డారు. క్రికెట్ విస్మరించే దిశగా..అజహర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించడంలేదన్నారు. సెలక్షన్ కమిటీ అంటే డబ్బుల కమిటీగా మారిపోయిందని అర్షద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అజహర్ సుప్రీంకోర్టు గైడ్‌లైన్‌ను ఉల్లంఘిస్తున్నారన్నారు హెచ్ సీఎ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ. నిధులు ఇప్పటి వరకు విడుదల కాలేదన్నారు. ఆఫీస్ బేరర్స్ మాట వినడం లేదన్నారు. మూడు సంవత్సరాలుగా అకౌంట్స్ లెక్కలు చూపించడంలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో అజహర్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నారాయణ హెచ్చరించారు. అధ్యక్షుడిగా అజహర్ ఎన్నికైన నాటినుంచి..ఎన్నిసార్లు సమావేశాలు నిర్వహించారో తెలపాలని శేష్ నారాయణ డిమాండ్ చేశారు.

Exit mobile version