Site icon Newsminute24

toxic: ‘గీతూ మోహన్‌దాస్‌’..నటి నుంచి దర్శకురాలు…

విశి:

‘గీతూ మోహన్‌దాస్‌’..ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న పేరు. యశ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘టాక్సిక్‌’కి ఆమె దర్శకురాలు. యశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఇటీవల ఓ గ్లింప్స్‌ను విడుదల చేశారు. అందులో ఇంటిమేట్‌ సన్నివేశాలు మీద రకరకాల విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై గీతూ మోహన్‌దాస్‌ స్పందిస్తూ ‘మహిళా దర్శకురాలు ఇలాంటి సన్నివేశాలు తెరకెక్కించిందంటూ వస్తోన్న విమర్శలు చూసి నేను చిల్‌ అవుతున్నాను’ అన్నారు.

ఇప్పుడు దర్శకురాలిగా మారిన గీతూ మోహన్‌దాస్‌ ముందుగా ఓ నటి. 1986లో ఐదేళ్ల వయసులో ‘ఒణ్ణు ముదల్ పూజ్యం వరె’ సినిమాతో బాలనటిగా సినిమాల్లోకి అడుగుపెట్టి, 2000లో కథానాయికగా మారారు. 20 సినిమాలు చేశారు. 2009 తర్వాత ఆమె మళ్లీ తెర మీద కనిపించలేదు. అప్పట్నుంచి దర్శకురాలిగా మారి రెండు సినిమాలు తీశారు. ‘టాక్సిస్’ ఆమె మూడో సినిమా.

నటిగా ఆమె చేసివని తక్కువ సినిమాలే అయినా, అందులో చెప్పుకోదగ్గవి చేశారు. కొన్నింటిలో ప్రధాన పాత్రలు, మరికొన్నింటిలో చిన్న చిన్నపాత్రలు చేసినా గుర్తుంచుకోదగ్గ సినిమాలు చేశారు. 2009కే నటన ఆపేయడం వల్ల ఆ తర్వాత వచ్చిన ఓటీటీలో ఆమె చేసిన సినిమాలేవీ రాలేదు. అందువల్ల తెలుగువారికి ఆమె నటన గురించి ఎక్కువగా తెలియదు. ఆదూర్ గోపాలకృష్ణన్, జయరాజ్, బాలచంద్రమీనన్, సిబి మలయిల్, శ్యామప్రసాద్, కె.పి.కుమారన్ లాంటి గట్టి దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది.

గీతు మోహన్‌దాస్ నటన తెలియాలంటే 2004లో మలయాళంలో వచ్చిన ‘ఒరిడం’ సినిమా చూడాలి. వేశ్యావృత్తిలో నుంచి బయటపడి మామూలు జీవితం గడపాలని ఆశపడే అమ్మాయిగా గీతు నటన అద్భుతంగా ఉంటుంది. ‘ఎవర్రా ఈమె? ఇంత గొప్పగా నటించింది’ అనిపిస్తుంది. ఆదూర్ గోపాలకృష్ణన్ ‘నాలుపెన్నుంగల్’ సినిమా తీస్తూ గీతును కీలకమైన పాత్రకు ఎంచుకున్నారు. పెళ్లయినా సంసార సుఖానికి నోచుకోని స్త్రీ పాత్ర ఆమెకు పేరు తెచ్చింది. గీతు చేసిన మరో గొప్ప సినిమా ‘అకాలె’. దివ్యాంగురాలైన రోజ్ పాత్రలో ఆమె నటన కట్టిపడేస్తుంది. కేరళ ప్రభుత్వం ఆమెకు ఉత్తమ నటి అవార్డు ఇచ్చింది.

గీతు మోహన్‌దాస్ 2014లో ‘లయర్స్ డైస్’ అనే హిందీ/ఇంగ్లీషు సినిమా తీశారు. ఈ సినిమా నిర్మాణానికి ఆమె చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక దశలో నిధులు లేక ఆమె సొంతంగా డబ్బులు పెట్టారు. ఆమె భర్త రాజీవ్ రవి ఆ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. దేశంలోని వలస కార్మికులు ఉన్నట్టుండి మాయమైపోతున్న భయంకరమైన స్థితిపై సాగే సినిమా అది. సినిమాలో రెండే రెండు కీలక పాత్రలు. ఒకటి గీతాంజలి థాపా చేయగా, మరొకటి నవాజద్దీన్ సిద్ధిఖీ చేశారు. నటనలో ఇద్దరూ ఇద్దరే. అద్భుతం. ఆ సినిమా భారతదేశం తరఫున ఆస్కార్ అవార్డుకు ఎంట్రీగా వెళ్లింది. ఆ తర్వాత 2019లో ‘మూత్తొన్’ అనే మలయాళ సినిమా తీశారు గీతు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆ సినిమాను నిర్మించారు. అప్పటికి ‘ప్రేమమ్’ సినిమాతో లవ్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న నివిల్ పౌలీ చేత ఈ సినిమాలో ఎవరూ ఊహించని పాత్ర చేయించారు. శోభిత ధూళిపాల కూడా ఇందులో నటించారు.

2016లో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘కసబ’ అనే సినిమాలో మహిళల్ని అభ్యంతరకరంగా చూపించారంటూ నటి పార్వతి విమర్శలు చేయగా ఆ సమయంలో గీతూ మోహన్‌దాస్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు అదే వ్యక్తి తన సినిమాలో ఓ మహిళని ఇలా చూపడం(గ్లింప్స్ చూసినవారికి తెలిసే ఉంటుంది) ఏమిటని చాలామంది విమర్శిస్తున్నారు. మరో అడుగు ముందుకు వేసి ‘కసబ’ దర్శకుడు నితిన్ రెంజి పానికర్ ఆమెను ‘సూడో’ అంటూ(పేరు ప్రస్తావించకుండా) పోస్ట్ రాయడం ఈ విమర్శలకు మరింత అవకాశమిచ్చింది. పూర్తి సినిమా బయటకు రాకముందే సినిమా మీద విమర్శలు చేయడం సరికాదని మరికొందరు అంటున్నారు. గ్లింప్స్ చూసిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాత్రం గీతు మోహన్‌దాస్‌ని అభినందించడం విశేషం.

Exit mobile version