Nancharaiah merugumala:( senior journalist)
====================
ఏపీ రాజకీయాల్లో కాపు నేతలే కులం ప్రస్తావన ఎందుకు ఎక్కువగా తెస్తున్నారు?
కాపులకు ఏఏ ముఖ్యమంత్రులు ఎంత మేలు చేశారో లెక్క ఎప్పటికి తేలేను?
రాజకీయ–సామాజిక అశాంతి ఒక్క కాపుల్లోనే ఎందుకు ఎక్కువవుతోంది?
దీర్ఘకాలిక అసంతృప్తి ‘కాపునాడు’ రాష్ట్రం ఏర్పాటు డిమాండుకు దారితీయదా?
……………………………………………………………………………………..
మొన్న శుక్రవారం గుంటూరు జిల్లా మాజీ మంత్రి, బీజేపీ ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారి మాటలు విన్నాక అఖిలాంధ్ర ప్రజానీకానికి పై నాలుగు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ‘రాష్ట్రంలో 22 శాతం మంది ఉన్న కాపులు ఎన్నికల్లో నిర్ణాయక శక్తిగా ఉన్నారు. ఎన్నికలప్పుడే కాపులు అన్ని పార్టీలకు గుర్తుకొస్తారు. వాస్తవానికి వారికి మేలు చేసింది చంద్రబాబు నాయుడు, ఆయనకు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మాత్రమే,’ అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు కులాలుగా (పేర్లతో) చీలి నాలుగు ప్రాంతాల్లో రాజకీయాలను ‘ప్రభావితం’ చేస్తున్న కాపుల ప్రగతి గురించి వ్యాఖ్యానించారు కన్నా. ఇప్పటి వరకూ ఉమ్మడి ఏపీలో కాపులకు బీసీల స్థాయిలో మేలు చేయడానికి ప్రయత్నించిన నేత కోట్ల విజయభాస్కరరెడ్డి మాత్రమే అని చాలా మంది భావించేవారు. కాదు, రాజశేఖరరెడ్డి గారు కూడా ఓ రెడ్డి నేతగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల అభివృద్ధికి కృషిచేశారనే విషయం ఆయన కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన కన్నా ధ్రువీకరించారు. అంటే నేడు అనేక మంది కాపు నాయకులు భావిస్తున్నట్టు వైఎస్ కాపులను విస్మరించలేదనుకోవాలి. మరి, చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే–ఏ మాటకు ఆ మాట కాపుల కోసం ప్రత్యేక ఆర్థిక సంస్థనే (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ–అభివృద్ధి కార్పొరేషన్) స్థాపించి ఎస్సీలు, ఎస్టీలు, బీసీల అభ్యున్నతికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అంతే ప్రాధాన్యం కాపులకు ఇచ్చారు. కన్నా వారి మాటలు ఈ విషయం నొక్కి చెబుతున్నాయి. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ‘కాపు నేస్తం’ పేరుతో మధ్య వయసు కాపు మహిళల కోసం ఓ గొప్ప సంక్షేమ కార్యక్రమం రూపొందించి అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇలా ఒక కులం పేరుతో ఉన్న ఆర్థిక సహాయ పథకం ఇదొక్కటే. జగన్ కేబినెట్ లో నలుగురు ఓసీ కాపు మంత్రులు (గుడివాడ అమరనాథ్, దాడిశెట్టి రాజా, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు), ఒక తూర్పు కాపు (బీసీ) మంత్రి (బొత్స సత్యనారాయణ) ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఏపీలో ఓసీ కాపు సముదాయం జనాభా 22 శాతం లేదు గాని 5–10 శాతం వరకూ ఉండొచ్చు. కాపుల జనాభా నిష్పత్తికి మించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు ఏపీలో ఉన్నప్పటికీ మరి అఖిలాంధ్ర కాపు ప్రజానీకంలో ఎందుకీ అశాంతి? గోదావరి జిల్లాల కాపు, బలిజ, ఒంటరి కులాల వారిని ఎందుకు రాజకీయ ఒంటరితనం పీడిస్తోంది? ఇలాంటి విషయాలపై కన్నా లక్ష్మీనారాయణ గారు చర్చించకుండా–ఇంకా కాపులకు రెడ్లు ఎంత ఎక్కువ మేలు చేశారు? కమ్మలు ఎంత ప్రయోజనం సమకూర్చారు? అనే అంశాలపైనే తన విలువైన అభిప్రాయాలు మీడియాకు వెల్లడిస్తే ఇక కాపులను ఎవరు కాపాడాలి? 1956 నుంచీ రాజకీయాల్లో రెడ్లతో, కమ్మలతో శక్తిమంతంగా బేరమాడి కావాల్సినవి సాధించుకున్న గొప్ప చరిత్ర కాపులది. అలాంటిది నేటి కాపుల్లో రాజకీయ అసంతృప్తి ఎలాంటి విపత్తుకు సూచికో రాజకీయ పండితులకు అర్ధం కావడం లేదు. ఈ విషయాలపై అన్ని రాజకీయ పార్టీల్లో పనిచేసి కాపుల ప్రయోజనమే తమ ఏకైక లక్ష్యంగా ముందుకూ, వెనకకూ నడిచిన పశ్చిమ గోదావరి పెద కాపు చేగొండి హరిరామజోగయ్య గారు, గుంటూరు జిల్లా మేధావి కాపు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఒక చోట కూర్చుని ఆలోచిస్తే మంచిది. ఈ ఇద్దరు వృద్ధ నాయకుల ఉమ్మడి కృషి వల్ల ఒక్క కాపు సముదాయానికి మాత్రమే గాక యావదాంధ్ర ప్రజానీకానికి మేలు జరుగుతుంది. తెలుగు సమాజంలో తీవ్ర అణ చివేతకు గురైన మాల, మాదిగ తదితర బడుగు కులాలేవీ తమ కులం పేరు కాపుల మాదిరిగా పదే పదే ఎత్తకుండా బతుకుతున్నాయి. పురోగమిస్తున్నాయి. మరి కాపుల తక్షణ ప్రధాన సమస్య ఏమిటో 2024 ఏపీ శాసనసభ ఎన్నికల ముందు తేలిపోతే తెలుగునాట శాంతి, సోదరభావం వెల్లివిరుస్తాయి. లేకుంటే, తమిళనాడు ఉత్తర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని అక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న వన్నియార్లు పదేళ్ల క్రితం ఉద్యమించినట్టు తెలుగు కాపులు కూడా ఆందోళన బాట పట్టే ప్రమాదం ఉంది. అన్ని రకాల కాపులకు న్యాయం జరగాలంటే కాపుల ఆధిపత్యం ఒక మోస్తరుగా ఉన్న ప్రాంతాలన్నింటినీ కలిపి కాపునాడు పేరుతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండు కూడా ముందుకు రావచ్చు. మూడో కన్ను తెరుచుకోక ముందే మిగిలిన రెండు కళ్లూ నిరంతరం తెరుచుని ఎంతో బాధ్యతతో అన్ని అంశాలను చూస్తూ ఉండాల్సిన అవసరం కనిపించడం లేదా?