Newsminute24

Karthikapournami: కార్తీక పౌర్ణమి విశిష్టత.. జ్వాలా తోరణం మహిమ..!

Karthika pournami:  కార్తీక పౌర్ణమి హైందవులకు పవిత్రమైన రోజు. ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ..దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. మహాభారత కథననుసరించి కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన రోజుగా కార్తీక పౌర్ణమి జరుపుకుంటారు. వెయ్యేళ్ళ రాక్షస పాలన అంతరించిన శుభ సందర్భంగా ఈరోజు మహాశివుడు తాండవం చేశాడని పురాణల్లో చెప్పబడింది.

కార్తీక పౌర్ణమి హరిహరులకు ప్రీతికరమైన రోజు. అగ్నితత్వమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చంద్రుణ్ణి విశేషంగా ఆరాధించాలని పెద్దలు చెబుతారు. ఈ పర్వదినాన వేకువ జామున స్నానమాచరించి ఆవునేతితో గాని.. నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. అలాగే బియ్యం పిండితో చేసిన దీపాలను.. ఉసిరికాయ దీపాలను కూడా సమర్పిస్తే శ్రేయస్కరం. పిమ్మట శివాయానికి వెళ్లి దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడంతో సమానం. ఇలా చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. ఇహ లోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయని పండితులు చెబుతుంటారు.

కార్తీక పౌర్ణమి రోజు మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు పఠించాలని పురాణాల్లో తెలుపబడింది.

ఓం త్రియంబకం యజమాయే సుగంధిమ్ పుష్టి వర్ధన్ ఊర్వరుకమివి బంధానం మృత్యుర్ ముక్షీయ మమ్రితాత్ ..

కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దానం చేయడం వల్ల దారిద్యం తొలగిపోతుంది. లలితా దేవిని సహస్రనామాలతో పూజిస్తే.. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.

ప్రాచుర్యంలో ఉన్న కథ :

కార్తీక పూర్ణిమనాడు మహాశివుడు త్రిపురాసురుణ్ణి వధించిన రోజు. అందువలన ఈరోజును త్రిపుర పూర్ణిమా అని కూడా పిలుస్తారు. కార్తీక పురాణం ప్రకారం ఈరోజు దీప దానం.. సాలగ్రామ దానం చేయాలి. ఇలా చేస్తే కోటి రెట్లు ఫలితానిస్తాయని నమ్మకం . ఈ పౌర్ణమి రోజు అరుణాచల క్షేత్రంలో అఖండ జ్యోతి వెలిగిస్తారు. ఈ జ్యోతిని దర్శించుకునేందుకు భక్తులు దేశవ్యాప్తంగా తరలివస్తారు.

జ్వాలాతోరణం మహత్యం..!

కార్తీకమాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. హైందవం ప్రకారం ఏ మాసంలోను ఇలాంటి ఆచారం కనబడదు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని చుడతారు. దీనిని యమ ద్వారం అని పిలుస్తారు. ఈ నిర్మాణం పై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడుని పల్లకిలో అటు ఇటు మూడుసార్లు ఊరేగిస్తారు. శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిపిన జ్వాలతోరణ మహోత్సవం భీమేశ్వర పురాణంలో వర్ణించబడింది.

కార్తీక పౌర్ణమి రోజున పూర్వికులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఓ కారణం ఉంది. యమలోకంలోకి వెళ్లినవారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండా నే లోపలికి వెళ్లాలని పురాణాల్లో చెప్పబడింది. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రధమ శిక్ష.

Exit mobile version