Site icon Newsminute24

crime: మగవారూ అత్యాచార బాధితులే..!

విశీ:

NOTE: ఇది సెన్సిటివ్ టాపిక్. పూర్తిగా చదివి అవగాహనకు రండి.

* పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లో రాత్రిపూట ఓ అబ్బాయి నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన కొందరు అమ్మాయిలు అతణ్ని ఏదో అడ్రస్ వివరాలు అడిగారు. అతను వివరాలు చెప్పగా, కారులో వచ్చి చూపించమని అడిగారు. అతను కారు ఎక్కగానే బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశారు. పరువు పోతుందని అతను ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. చివరకు స్నేహితులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

* మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌కు చెందిన 32 ఏళ్ల వ్యక్తికి ఉద్యోగం లేదు. అతనికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు ఓ పోలీస్ ఇన్స్పెక్టర్. తాను చెప్పినట్లు చేయాలని బలవంతం చేశాడు. ఆరు నెలల పాటు ఆ యువకుడిని లైంగికంగా వేధించాడు. అనంతరం ఆ వేధింపులు భరించలేక ఆధారాలతో యువకుడు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించాడు.

* కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరులో ఓ 20 ఏళ్ల యువకుడు సాయంత్రం వాకింగ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో తెలిసిన ఓ వ్యక్తి అతణ్ని పలకరించాడు. చెరుకు రసం తాగుదాం రమ్మని పిలిచి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

…ఇవి బయటకు వచ్చిన కొన్ని విషయాలు. బయటకు రానివి నిత్యం దేశవ్యాప్తంగా వందల్లో జరుగుతున్నాయని అంచనా. ప్రతి పదిమంది పురుషుల్లో ఒకరు ఏదో రకమైన లైంగికదాడి గురవుతున్నారని, బయటకు చెప్తే పరువు పోతుందని, పెళ్లి కాదని, మగవాడు కాదంటారని తదితర భయాలతో చాలామంది లోపలే దాచేసుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. తాజాగా హైదరాబాద్ నగరం నాచారంకు జునైద్‌, సైఫుద్దీన్‌, మణికంఠ, మరో మైనర్ కలిసి ఓ 45 ఏళ్ల వ్యక్తిని కారులో ఎక్కించుకొని లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించారు. అతను ప్రతిఘటించడంతో కత్తితో పొడిచి చంపేసి పారిపోయారు. మరోవైపు విశాఖలో ఇద్దరు మహిళా టీచర్ల వేధింపులతో సాయితేజ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

…మగవాళ్ల మీద కూడా లైంగికదాడులు జరుగుతాయా అనేది చాలామందికి నేటికీ ఆశ్చర్యం కలిగించే విషయం. ‘రేప్’ అనేది మగవాడు చేయాలి తప్ప చేయించుకోకూడదని అనేక సినిమాలు చూపించాయి. ఇప్పుడైతే సోషల్ మీడియా ఆ పాత్ర పోషిస్తూ ‘రేప్’ను కామెడీ మీమ్స్‌కు వాడుకుంటోంది. మగవాడి మీద అమ్మాయి రేప్ చేసిందనే వార్త రాగానే ‘ఆ ప్లేస్‌లో నేనుంటే బాగుండు’, ‘నాకు ఆ ఛాన్స్ వస్తే బాగుండు’ అని చెత్త కామెంట్లు చేసేవారికి కొదవలేదు. ఆ కామెంట్లను ఎవరూ ఖండించకపోవడం ఇంకా ఐరనీ! రేప్ అంటే అదేదో సుఖవంతమైన విషయం అని, మగవాడంటే ఎల్లప్పుడూ ‘S_X’ సుఖం కోసం పరితపిస్తూ ఉండాలని, ఉంటాడని తీర్మానాలు చేసే మీమ్ పేజెస్‌కి లెక్కలేదు.

…చట్టపరంగా మగరేప్, ఆడరేప్ అనే తేడా లేదు. కానీ నేటికీ మన దేశంలో మగవారి మీద జరిగే లైంగిక దాడులకు ప్రత్యేకమైన చట్టం లేదు. ఇలాంటి చట్టాలు వస్తే మగవారు వాటిని దుర్వినియోగం చేస్తారనే చర్చ కూడా చాన్నాళ్లుగా ఉంది. మగవారి మీద జరిగే లైంగికదాడుల్ని ఎలా విచారించాలో చెప్పే పూర్తిస్థాయి అవగాహనా వ్యవస్థ మన దగ్గర లేదు. ‘మీ మీద లైంగికదాడి జరిగితే ధైర్యంగా మాకు చెప్పండి’ అంటూ మగవారికి వివరించగలిగే ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ లేదు. పైగా, ఎవరైనా కేసు పెడదామని వెళ్లినా ‘నువ్వే ఆ అమ్మాయిని ఏదో చేసి, రివర్స్ కేసు పెడుతున్నావా?’ అని అడిగేవారూ తక్కువేమీ కాదు. ‘మగవాడివయ్యుండి ఎదురించలేకపోయావా?’ అని అడిగేవారూ తక్కువేం కాదు. ఇలాంటివి బయటపెడితే సమాజం అతణ్ని ఎలా చూస్తుందనేది అత్యతం చర్చనీయాంశం. ఇన్ని కారణాలతో చాలామంది తమ మీద జరుగుతున్న లైంగికదాడుల విషయంలో మౌనంగా ఉంటున్నారు.

…18 ఏళ్లు నిండిన ఇద్దరు వ్యక్తులు(జెండర్‌తో సంబంధం లేకుండా) అంగీకారంతో చేసే లైంగిక చర్యని తప్పు పట్టలేమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అది ఎల్జీబీటీ వర్గానికి మేలు చేసిన తీర్పు. అయితే కొందరు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకొని నేరాలకు పాల్పడుతుండటం దారుణం. ఈ నేపథ్యంలో మగవారిపై లైంగికదాడుల విషయంలో చాలా కేసుల్లో పురుషులే నిందితులవుతున్నారు. కొందరు లైంగికంగా ఇతరుల్ని బలవంతపెట్టడం, తాము చెప్పింది చేయాలని అడగటం, థ్రిల్ కోసం అంటూ బలవంతంగా హోమో సెక్స్ వైపు మళ్లించడం, దుష్ర్పచారం చేస్తామని బెదిరించి లొంగదీసుకోవడం వంటివి జరుగుతున్నాయి. లైంగికదాడి చేయడంతోపాటు ఫొటోలు, వీడియోలు తీసి పెద్ద ఎత్తున డబ్బులు గుంజిన ఉదంతాలు కోకొల్లలు. ప్రయాణాల్లో కొందరు ఇతరుల శరీర భాగాలపై చేతులేయడం, లైంగికంగా రెచ్చగొట్టడం, పోర్న్ వీడియోలు చూపించడం వంటివి మనలో కొంతమందికి అనుభవమే! ఇవన్నీ పురుషుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, వారిని లైంగికంగా వేధించడం కిందికే వస్తాయి.

…ఈ లైంగిక దాడుల్లో అధికశాతం 14 నుంచి 22 మధ్య వయసున్నవారి మీదే ఎక్కువగా జరుగుతుండటం నిజంగా ఆందోళన కలిగించే విషయం. అప్పుడప్పుడే యవ్వనంలోకి వస్తున్న వారిలో రకరకాల అనుమానాలు, భయాలు, ఊహలు ఉంటాయి. వాటిని కొందరు మహిళలు, పురుషులు తమను అనుకూలంగా మార్చుకుంటున్నారు. మెల్లగా వారితో మాట కలిపి, వారిని లైంగికంగా ప్రేరేపించి తమ దారికి తెచ్చుకొని లైంగికదాడి చేస్తున్నారు. ‘బయట తెలిస్తే మీ కుటుంబం పరువు పోతుందని, నువ్వే నాపై లైంగికదాడి చేశావని కేసు పెడతానని’ కొందరు మహిళలు పురుషుల్ని బెదిరించి వీటిని కొనసాగిస్తున్నారు. ‘నువ్వు రాకపోతే చచ్చిపోతానని’, ‘నాతో గడపకపోతే మన ఫొటోలు లీక్ చేస్తానని’ బెదిరించే ఆడవాళ్లు కూడా ఉన్నారు.

…మగవాళ్లకూ శరీరం ఉంటుంది. మనసు ఉంటుంది. లైంగిక చర్య(హెటిరో సెక్స్ అయినా, హోమో సెక్స్ అయినా) ఈ రెండింటి కలయిక. అందులో పాల్గొనే(18 ఏళ్లు దాటిన)వారికి ఆ చర్య సమ్మతమైతే అది తప్పు కాదు. అందులో ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే ఆ ప్రక్రియ బలవంతంగా జరుగుతుందో, దాన్ని ‘రేప్’ కిందే పరిగణించాలి. మనకు నచ్చని బట్టలు కట్టుకోవడానికే ఇష్టపడని మనం, మరో వ్యక్తి బలవంతంగా మనపై చెయ్యి వేయడాన్ని ఎలా సహిస్తాం? కాబట్టి మగవారిపైనా అత్యాచారాలు జరిగే అవకాశం ఉందని గుర్తించాలి. స్త్రీపై జరిగిన అత్యాచారానికి ఎక్కువ సానుభూతి, పురుషుడిపై జరిగిన అత్యాచారానికి తక్కువ సానుభూతి అనే లెక్కలు ఉండకూడదు.

Exit mobile version