Nancharaiah merugumala:
_____________________________
బాబరీ మసీదును కూల్చి 30 ఏళ్లు నిండుతున్నా పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వరా?
‘వివాదాస్పద కట్టడం’ బాబరీ మసీదును అయోధ్యలో కూల్చేసి నేటికి 30 సంవత్సరాలు నిండుతున్నాయి. అప్పుడు ప్రధానమంత్రి పదవిలో ఉన్న పాములపర్తి వేంకట (పీవీ) నరసింహారావు గారు తనమౌనముద్రతో, ఉదాశీన వైఖరితో మసీదు కూల్చివేతకు దోహదం చేశారు. రాజధాని దిల్లీ నుంచే తన పరోక్ష తోడ్పాటును మిత్రుడు, బీజేపీ నేత అటల్ బిహారీ వాజపేయి గారికి అందించారు. పీవీ సాహబ్ సాయంతోనే తర్వాత నాలుగేళ్లకు భారతీయ జనతా పార్టీ వాజపేయి జీ నేతృత్వంలో 1998లో అధికారంలోకి వచ్చింది. హస్తిన పీఠంపై ఆరేళ్లు కొనసాగింది.
కాగా 1991లో కాంగ్రెస్ ‘మైనారిటీ’ సర్కారుకు ప్రధాని అయినాగాని మెజారిటీ హిందూ మతానికి చెందిన ప్రజలు ఎక్కువ మంది పేదరికం నుంచి బయటకు రావడానికి తన ఆర్థిక సంస్కరణల ద్వారా ఎనలేని కృషి చేశారు పీవీ. అంతేకాదు, తనకు రాజకీయ పదవులు ఇచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ నడుం శాశ్వతంగా విరిగిపోవడానికి పీవీ గారు తన వంతు కృషి 1992 డిసెంబర్ 6న బాగానే చేశారు. ఆ శీతాకాలం మధ్యాహ్నం అమోధ్యలో జనం గుమిగూడి మసీదును నేలమట్టం చేయబోతున్నారని తన నిగూఢచార వర్గాల ద్వారా తెలుసుకుని కూడా ఆయన పూజగదిలోనే కూర్చుని కథ నడిపించేశారు. నరసింహారావు గారు తెలంగాణ అంటే నిజాం పాలనలో మగ్గిన ప్రాంతంలో పుట్టి పెరిగిన బ్రాహ్మణుడు కాబట్టే ఆయన ప్రధాని పదవిలో ఉండగా బాబరీ మసీదును కూలగొట్టడం సాధ్యమైందని, అదే టంగుటూరి ప్రకాశం వంటి కోస్తాంధ్ర బ్రామ్మణ నేత అయితే అది జరిగేది కాదని నా కోనసీమ నియోగ బ్రాహ్మణ మిత్రుడు పాలెపు సుబ్రహ్మణ్యం గారు పదే పదే చెబుతుంటాడు. అంటే, తెలంగాణ బ్రాహ్మణుల్లో హిందుత్వ స్పృహ ఎక్కువని నా నియోగి స్నేహితుడి నిశ్చితాభిప్రాయం.
తెలుగు బ్రామ్మల్లో ప్రాంతీయ భేదాలపై నాకు ఆయనలా పెద్దగా అవగాహన లేదు మరి. ఏదేమైనా బాబరీ మసీదు కూల్చివేతకు తన మౌనాంగీకారం తెలపడం ద్వారా నరసింహారావు గారు అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేశారు. ఆయన తర్వాత భారత సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ రాముడి గుడికి చివరి అడ్డంకిని కూడా తొలగించి భారత సంస్కృతిని నిలబెట్టింది. బాబరీ మసీదు విధ్వంసం విషయం ప్రపంచానికి గుర్తున్నంత వరకూ తెలుగు బిడ్డ, కాదు – తెలంగాణ పుత్నరత్నం పీవీ నరసింహారావు పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది.డా.మన్మోహన్ సింగ్ జీ, ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్తల సలహాతో పీవీ ప్రభుత్వ అమలు చేసిన ఆర్థిక సంస్కరణలను, వాటి సత్ఫలితాలను భారతీయులు మరిచిపోవచ్చేమో గాని, 1527లో తలుపులు తెరుచుకున్న బాబరీ మసీదు 1992లో అదృశ్యం కావడానికి నరసింహారావు గారు నడిపిన తెర వెనుక మంత్రాంగాన్ని, తీసుకున్న రిస్కును ఎవరూ విస్మరించలేరు.
ప్రధాని నరేంద్ర మోదీ బాబరీ విధ్వంసం 30వ వార్షికోత్సం సందర్భంగానైనా పాములపర్తి వారికి భారత రత్న ప్రకటించే విషయం గురించి ఆలోచించాలి. 2024 వేసవిలో తాను మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేయడానికి ముందే మోదీజీ అన్ని పార్టీల నేతలతో సంప్రదించి పీవీ గారికి భారత రత్నం దక్కేలా చర్యలు తీసుకుంటే భారత మాత, తెలంగాణ తల్లి జంటగా సంతోషిస్తారు. అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడన్, ఇంగ్లండ్ ప్రధాని రిషి సునక్ కూడా పీవీకి అతి పెద్ద భారత పౌర పురస్కారం ఇస్తే తమ దేశాలకు వచ్చే భారతీయులకు వీజా నిబంధనలు సరళతరం చేస్తారు. నర్సంపేట దగ్గర్లోని లక్నేపల్లిలో నేలపై పడిన నరసింహారావుకు భారత రత్న ప్రకటిస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా తన రాజకీయ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి తారక రాముడికి పట్టాభిషేకం చేయిస్తారు. నిండి సంతృప్తితో వెళ్లిపోతారు. భారతదేశం ప్రపంచానికి అందిందించిన గొప్ప మనిషి బాబాసాహబ్ డాక్టర్ భీంరావ్ ఆర్ అంబేడ్కర్ 66వ జయంతి రోజున దాదాపు పది కోట్ల తెలుగోళ్లం ఇంత కన్నా ఏం కోరుకుంటాం?