దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. వైసీపీ అధికారంలోకి వచ్చాకా.. మూడున్నరేళ్లలో దాదాపు 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాల దీనస్థితిని చూసైనా ప్రభుత్వ పెద్దల మనసు కరగడం లేదని.. వారిలో మానవత్వం లేదని మనోహర్ మండి పడ్డారు.
కాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల గ్రామంలో జనసేన కౌలు రైతు భరోసా కార్యక్రమానికి…రైతులు.. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న 210 కౌలు రైతు కుటుంబాలకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేతులు మీదగా రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. “రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఉమ్మడి అనంతపురం, పశ్చిమ గోదావరి, కర్నూలు, ప్రకాశం, తూర్పుగోదావరి, కడప జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్రను విజయవంతంగా నిర్వహించామని స్పష్టం చేశారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలకు భరోసా కల్పించామని అన్నారు.
కౌలు రైతుల ఆత్మహత్యల గురించి తెలిసిన వెంటనే సమాజంలో బాధ్యత గల వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు… సొంత నిధులు రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారన్నారు మనోహర్. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క గుంటూరు జిల్లాలోనే 280 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ కాదు కదా… స్థానిక ప్రజా ప్రతినిధులు ఎవరూ బాధిత కుటుంబాలను పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వం ఇస్తామన్న నష్టపరిహారం రూ. 7 లక్షల కూడా వైసీపీ సానుభూతిపరులకే ఇచ్చారే తప్ప మిగిలిన రైతు కుటుంబాలను గాలికొదిలేశారని మనోహర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.