విశీ : మతంలో చాలా వింత కాన్సెప్ట్‌లు ఉంటాయి. అటువంటి వాటిలో ఒకటి ‘పుణ్యం’. ఫలానా పని చేస్తే పుణ్యం వస్తుంది అంటారు. దాన్ని చేసినవారే తప్పించి, పుణ్యాన్ని ఖాతాలో వేసుకున్నారా లేదా అని పరీక్షించే సాధనం లేదు. కొన్ని పనులు జుగుప్సాకరంగానూ ఉంటాయి. అయినా పుణ్యం కోసం చేయాల్సిందే! అది మతం(లేదా మతపెద్దలు) ఏర్పరిచిన కాన్సెప్ట్.
ఇప్పడు కార్తికమాసం. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్లు భోజనం చేశాక(భిక్ష స్వీకరించాక) ఆ ఎంగిలి ఆకులు ఎత్తేందుకు చాలా మంది పోటీ పడతారు. మేమంటే మేమంటూ వెళ్తారు. అలా చేస్తే పుణ్యం వస్తుంది అనేది ఒక నమ్మకం. సరే! అదొక చిన్నపాటి సేవ. కర్ణాటక రాష్ట్రంలోని పాటించే ‘మడెమడె స్నాన’ ఆచారం మరికాస్త ముందుకు వెళ్లి ఒక వింత పద్ధతిని అనుసరిస్తుంది. ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, కుక్కె సుబ్రహ్మణ్య స్వామి ఆలయం.. ఇంకా కొన్ని ఆలయాల్లో కొన్ని వేల ఏళ్ల పాటు అమలైన ప్రక్రియ ఇది. ‘మడె మడె స్నాన’లో ఏం చేస్తారు? విన్నప్పుడు నాకు చాలా చిరాకు కలిగింది.
ఆలయంలో భక్తులు(బ్రాహ్మణులే) భోజనం చేసిన తర్వాత ఆ ఎంగిలి ఆకుల మీద పడి కొందరు భక్తులు పొర్లుతారు. ఎన్ని ఆకులుంటే అన్ని ఆకుల మీదా పడి పొర్లుదండాలు పెడతారు. అలా చేస్తే చర్మ వ్యాధులు పోతాయని, ఒత్తిడి తగ్గుతుందనీ, పుణ్యం వస్తుందని నమ్ముతారు. ఈ పద్ధతిలో ఎంగిలి ఆకుల మీద పొర్లడానికి బ్రాహ్మణులతో సహా అందరూ సిద్ధంగా ఉంటారు. ఆడ,మగ చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఆ ఆకుల మీద పడి దొర్లి ఆ తర్వాత స్నానం చేస్తారు. ఈ ఆచారంపై చాలా వివాదం నడిచింది. దీన్ని ఆపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని చోట్ల దేవుడికి పెట్టిన ప్రసాదాల మీద పడి పొర్లుదండాలు పెడతారు. దాన్ని ఎద స్నాన అంటారు. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని ఆవులకు పెడతారు. అంతా పుణ్యం కోసమే!
ఈ ఆచారాన్ని బ్రాహ్మణులూ పాటిస్తున్నా, దీని వెనకాల బానిసత్వ దృక్పథం ఉందని అప్పట్లో కర్ణాటక Backward Classes Awareness Forum అధ్యక్షుడు కె.ఎస్.శివరామ్ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ మూఢభక్తి దళిత, బహుజనులకు అత్యంత ప్రమాదకరమని వాదించారు. విచిత్రమేమంటే, ఈ ఆచారాన్ని నిషేధించాలన్న నిర్ణయానికి ఎంతమంది మద్దతు తెలిపారో, అనేక మంది వ్యతిరేకంగానూ వాదించారు. ‘ఈ ఆచారం వ్యక్తిగత ఇష్టాయిష్టాల్లో భాగమనీ, ఎవరూ ఎవర్నీ ఒత్తిడి చేయడం లేదనీ, దీని ద్వారా దేవుణ్ని చేరే అవకాశం దొరుకుతోందనీ’ ‘రాజ్య ఆదివాసీ బుడకట్టు హితరక్షణె వేదికె’ అనే సంస్థ కోర్టులో తెలిపింది. ‘మడె మడె స్నాన’లో ఎవరూ ఎవరినీ ఒత్తిడి చేయడం ఉండదనీ పదే పదే వాదించింది. ఈ వివాదాలకు చెక్ పెడుతూ 2017లో కర్ణాటక ప్రభుత్వం Prevention and Eradication Inhuman Evil Practices and Black Magic Bill ప్రవేశపెట్టింది. దాని ద్వారా ఈ ఆచారాన్ని నిషేధించాలన్న నిర్ణయానికి వచ్చింది.
2016లో ఉడిపిలో ‘మడె మడె స్నాన’ ఆచారాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత 2018లో ‘ఎదె స్నాన’ కూడా నిలిపేశారు.