సెస్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అక్రమాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు.5 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచినప్పటికీ ఫలితాలను తారు మారు చేస్తారా? అంటూ ద్వజమెత్తారు. సెస్ ను నాశనం చేసిన టీఆర్ఎస్ కు ఓట్లేయలేదేనే అక్కసుతో ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తారాని? సంజయ్ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ నేతలే ఓట్లేసుకుంటున్నారు… వాళ్లే ఫలితాలను ప్రకటించుకుంటున్నారని.. ఇంతదానికి ఎన్నికలెందుకు? ఫలితాలు ప్రకటించడమెందుకు? ప్రజల సమయాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమెందుకు? అని సంజయ్ దుయ్యబట్టారు.
ఇదిలా ఉంటే… ఎమ్మెల్యేల ఎర కేసును హైకోర్టు ధర్మాసనం సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నట్లు సంజయ్ స్పష్టం చేశారు. ఈ కేసులో వాస్తవాలన్నీ బయటకు రావాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. ఫాంహౌజ్ కేసులో కర్త, కర్మ, క్రియ ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆరేని కుండ బద్దలు కొట్టారు. కథ, స్ర్కీన్ ప్లే, డైరెక్షన్ కు ‘ప్రగతి భవన్’ అడ్డగా మారిందని… అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామాపై ప్రజల్లో చర్చ జరుగుతోందని సంజయ్ పేర్కొన్నారు.