Crimenews:
బెంగళూరు మహానగరం. ఆమె వయసు 35. ఆమెకు 15 ఏళ్ల కూతురు ఉంది. ఇంట్లో వారిద్దరే ఉంటున్నారు. టీనేజీలో చాలామంది పిల్లలు రకరకాల విధానాలకు, పద్ధతులకు అలవాటు పడతారు. కట్టు తప్పి ప్రవర్తిస్తారు. ఆ అమ్మాయి కూడా అలాంటి ప్రవర్తనలో ఇరుక్కుంది. అది గమనించిన తల్లి మందలిస్తూనే ఉంది. తల్లులకు పిల్లలు భయపడే కాలమా ఇది? ఆ పాప భయపడలేదు సరికదా, తన ఇష్టాన్ని కాదంటున్న తల్లి మీద పగ పెంచుకుంది. ఎలాగైనా ఆమె మీద పంతం నెగ్గించుకోవాలని అనుకుంది. 17 ఏళ్ల వయస్సున్న నలుగురు మగ స్నేహితులను తన ఇంటికి పిలిపించుకుంది. అందరూ ఒక్క గదిలో చేరి నానాహంగామా చేశారు.
ఒక స్థితి దాటాక వారి ప్రవర్తన శ్రుతి మించింది. ఆ అల్లరికి తల్లి కోపంగా ఆ గదికి వెళ్లింది. తన కూతురు నలుగురు అబ్బాయిలతో కలిసి అర్ధనగ్నంగా ఉండటం చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. వారిని గట్టిగా తిట్టింది. వెంటనే కూతురితో సహా వారంతా ఆమెను చుట్టుముట్టి, నోరు మూసి, గొంతుకు తువ్వాలుతో బిగించి హత్య చేశారు. దాన్ని ఆత్మహత్యగా చూపేందుకు చీరతో ఫ్యాన్‌కు కట్టి వేలాడదీశారు. అందరూ కలిసిపోయారు. పోలీసుల విచారణలో నిజం వెలుగుచూసింది. పోలీసులు అందర్నీ అరెస్టు చేశారు.
తమిళనాడు రాష్ట్రం మదురైలోని అనుప్పానడి ప్రాంతానికి చెందిన ధర్మరాజ్‌కి ఐదుగురు కుమార్తెలు, ఓ కుమారుడు. మధ్యతరగతి కుటుంబం. అందరిలోకీ చిన్నకుమార్తె దివ్య(28) అంటే అందరికీ ముద్దు, గారాబం. మూడేళ్ల క్రితం ఎంఎస్సీ చదవడానికి మలేసియా వెళ్లింది దివ్య. వెళ్లేందుకుగానూ ఇంట్లో నుంచి రూ.5 లక్షలు తీసుకుంది. ఒక్కతే మదురై నుంచి చెన్నై వెళ్లి, అక్కడి నుంచి విమానంలో మలేసియా వెళ్లింది. అలా వెళ్లిందని అందర్నీ నమ్మించింది. రూ.5 లక్షలతోపాటు మరింత డబ్బు తీసుకొని ప్రకాష్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్లింది. అతణ్ని పెళ్లి చేసుకొని ఎవరికీ తెలియని చోట కాపురం పెట్టింది. వాళ్లకు ఓ కూతురు కూడా పుట్టింది. ఈ మధ్య భార్యాభర్తలకు గొడవలు జరిగాయి. ఆ ఆవేశంలో దివ్య ఆత్మహత్య చేసుకుంది. ఇంత జరిగాకే అసలు విషయం ఆమె కన్నవాళ్లకు, ఇంట్లోవాళ్లకు తెలిసింది. అప్పటిదాకా ఆమె మలేషియాలో ఉందని వారు నమ్మారు. ఈ విషయం తెలిసి అందరూ విషాదంలో మునిగిపోయారు.
ఈ సంఘనటల్లో ఇద్దరు కూతుళ్లు బలయ్యారు. ఒకరు చేసిన పని హత్యకు దారి తీస్తే, మరొకరు చేసిన పని ఆత్మహత్యకు కారణమైంది. ఈ కారణంగా రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అనాలోచిన ప్రవర్తన, అనుకోని నిర్ణయాలు.. వీరినిలా తయారు చేశాయి. తప్పెవరిది అని విశ్లేషణలు ఎన్ని చేసినా ఇంకా ఇంకా ఈ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇంకా జరిగేలాగే ఉన్నాయి. We may can’t stop them. కుటుంబ వ్యవస్థ బీటలు వారుతున్న వాస్తవం కంటిముందు కనిపిస్తూనే ఉంది. ఇందులో మొదటగా బలవుతున్నది మహిళలు, చిన్నపిల్లలు.
– విశీ

