Site icon Newsminute24

HonourKilling:కులం ఉంటుంది.. ప్రేమికుల్ని విషం తాగమంటుంది..!

Tamilnadu :

‘పరువు హత్య’ అంటాం కానీ, ప్రేమికుల అంతానికి కారణమయ్యేది ‘కులం’. కాబట్టి వారిది ‘కులోన్మాద హత్య’. ఈ దేశంలో పరువుకు కులం ఉంటుంది. అది అత్యంత దారుణాలకు పాల్పడుతుంది. ఘోరాలు చేయిస్తుంది.

అసలైన ఘోరమేమిటంటే, కులం కోసం సొంత మనుషుల్ని చంపినవారికి సైతం మద్దతు పలికే వారిని కూడగడుతుంది. ఉగ్రవాదానికి సాయం అందించినవారూ ఉగ్రవాదులైతే, కులోన్మాదానికి మద్దతు పలికేవారు కూడా కులోన్మాదులే. అలాంటి కులోన్మాదులు 2003లో చేసిన ఓ దారుణం ఇది.

తమిళనాడు రాష్ట్రం కడలూర్ జిల్లా పుదుక్కూరైప్పేట్టై అనే ఊరికి చెందినవారు కన్నగి, మురుగేషన్. కన్నగి బీకామ్ దాకా చదివింది. మురుగేషన్ కెమికల్ ఇంజినీరింగ్ చదివి, ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. వారిద్దరూ అన్నామలై యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో ప్రేమించుకున్నారు. చాలా ప్రేమలకు అడ్డొచ్చిన కులమే ఇక్కడా అడ్డొచ్చింది. కన్నగిది వన్నియార్ కులం. మురుగేషన్‌ది దళిత కులం.

హిందూమతంలోని నిచ్చెనమెట్ల వ్యవస్థలో వన్నియార్‌లు శూద్రులే. రాష్ట్ర లెక్కల ప్రకారం వారు MBC(Most Backward Caste) జాబితాలో ఉన్నారు. అయితే తమను తాము ఉన్నత కులంగా భావిస్తుంటారు. తమ పూర్వీకులు క్షత్రియులని వారి నమ్మకం. వారు ద్రౌపది అమ్మవారిని పూజిస్తారు. వన్నియార్లలో చాలామంది రైతులుగా, వ్యవసాయకూలీలుగా ఉన్నారు. ఈ కులానికి చెందిన కన్నగి దళితుడైన మురుగేషన్‌ని ప్రేమించడం, పెళ్లి చేసుకుంటాననడం ఆమె ఇంట్లోవారికి నచ్చలేదు. తమ కులం ఆడమనిషి దళితుణ్ని పెళ్లి చేసుకోవడం, అతనితో బిడ్డల్ని కనడం ఏమిటని హుంకరించాయి.

అనేక గొడవల అనంతరం, ఇంటి నుంచి వెళ్లిపోయి కన్నగి మురుగేషన్‌ని 2003 మే 5న రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లిని వారిద్దరూ రిజిస్టర్ చేయించారు. ఈ విషయం కొన్నాళ్లు రహస్యంగా ఉంది. ఆ తర్వాత కన్నగి ఇంట్లోవారికి తెలిసింది. 2003 జులై 7న కన్నగిని, మురుగేషన్‌ని ఊరి చివర శ్మశానం వద్దకు లాక్కొచ్చారు. కన్నగి తండ్రి, అన్నలతోపాటు వారి కుటుంబానికి, కులానికి చెందిన మరికొందరు కలిసి అందరూ చూస్తుండగా వారిద్దరి గొంతుల్లో విషం పోసి చంపారు. అనంతరం వారిద్దరి శవాలను కిరోసిన్ పోసి తగలబెట్టారు. వారిద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు పోలీసులను నమ్మించాలని చూశారు.

అయితే మురుగేషన్ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసును విచారించారు. కానీ అవతలవైపు డబ్బున్న ఆసాములు కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. దీంతో మురుగేషన్ తండ్రి మద్రాస్ హైకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర పోలీసులతో తనకు న్యాయం జరగదని వివరించారు. దీంతో కేసును సీబీఐకి సిఫార్సు చేసింది హైకోర్టు. కేసును విచారించిన సీబీఐ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అనంతరం కడలూర్ ప్రత్యేక కోర్టు కన్నగి అన్న మరుత్తుపాండియన్‌కి ఉరిశిక్ష వేయడంతోపాటు మిగిలిన 12 మంది దోషులకు జీవితఖైదు విధించింది. ఆ 12 మందిలో కన్నగి తండ్రి దురైసామితోపాటు ఓ విశ్రాంత డీఎస్పీ, ఓ ఇన్స్‌పెక్టర్ కూడా ఉన్నాడంటే పోలీసు వ్యవస్థను కులం ఎలా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు.

అనంతరం దోషులు హైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. మరుత్తుపాండియన్‌కి వేసిన ఉరిశిక్షను జీవితఖైదుగా మారుస్తూ హైకోర్టు 2022లో తీర్పు ఇచ్చింది. తమ శిక్షను సవాలు చేస్తూ దోషులు సుప్రీంకోర్టు గడప తొక్కారు. కేసును పూర్తిగా విచారించిన సుప్రీం ఈ సంవత్సరం ఏప్రిల్ 28న సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. పరువు హత్యకు పాల్పడిన ఇలాంటివారికి జీవితఖైదు చాలా తక్కువ శిక్ష అని, వారు ఆ శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పింది. ప్రస్తుతం వారంతా జైల్లో ఉన్నారు.

దేశంలో జరిగిన కులోన్మాద హత్యల్లో కన్నగి-మురుగేషన్ కేసు ఓ సంచలనంగా మిగిలింది. తమకు నచ్చిన వ్యక్తికి పెళ్లి చేసుకోవడమే వారు చేసిన తప్పుగా మిగిలింది. పరిస్థితి ఇవాళ్టికీ ఏమైనా మారిందా? అలాగే ఉంది. ప్రణయ్‌ని హత్య చేయించిన మారుతీరావు, సందీప్, మాధవి దంపతులపై హత్యాప్రయత్నం చేసిన మనోహరాచారి, తన మతం కానివాడు తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా నాగరాజును చంపిన అహ్మద్, తక్కువ కులం వాణ్ని చేసుకుందనే కక్షతో అక్క నాగమణిని చంపిన ఆమె తమ్ముడు, దాన్ని ప్రోత్సహించిన అతని నానమ్మ.. ఎందరు దోషులు.. ఎన్ని దారుణాలు! ఎన్ని ఉరిశిక్షలు వేస్తే వీరికి బుద్ధొస్తుంది? ఇంకా ఎందరు సంస్కర్తలు పుడితే ఈ ఎక్కువ తక్కువల తేడాలు పోతాయి? మీరు నమ్మే ఆ దేవుడికే తెలియాలి.

– విశీ(వి.సాయివంశీ)✍️✍️

Exit mobile version