విశీ(వి.సాయివంశీ):
‘నువ్వు తక్కువ జాతి స్త్రీవి. నీ ఒంటి మీద బట్ట కప్పుకోవాలంటే పన్ను కట్టాలి’ అన్నాడు రాజు. పన్ను వసూలుకు రాజోద్యోగులు ఇంటి ముందుకు వచ్చారు. నంగేలికి నచ్చలేదు. కొడవలితో తన రెండు రొమ్ములు కోసి వారికి ఇచ్చింది. రాజోద్యోగులు వణికిపోయారు. హడలిపోయారు. పారిపోయారు. రక్తం కారుస్తూ నంగేలి ప్రాణాలు విడిచింది. This is Feminism before Feminism. ఇదంతా నిజం అంటారు కొందరు. కాదంటారు ఇంకొందరు. ఈ కథ ఇలాగే జరిగిందని నిరూపించే ఆధారాలేవీ లేవని మరికొందరి వాదన. అయితే ఆడవాళ్ల ఒంటి మీద రొమ్ములున్న మాట వాస్తవం. అవి అవమానాలకు గురైన కాలాలున్న మాట వాస్తవం.
వందేళ్లు గడిచాక పరిస్థితి మరోలా మారింది. తిండి, బట్ట, గూడు అనేవి మానవ నిత్యావసరాలైన వేళ ఆడవాళ్ల ఒంటి మీద ఏం వేసుకోవాలో మగవాళ్లు నిర్ణయించే కాలం వచ్చింది. దానికెన్నో రాజకీయ తీర్మానాలు, సాంస్కృతిక సిద్ధాంతాలు, సామాజిక కట్టుబాట్లు. ‘అంగమ్మాల్’కు కూడా అటువంటి పరిస్థితే ఎదురైంది. ఇద్దరు కొడుకులు పుట్టాక భర్త మరణిస్తే రాయిలా మారి, అష్టకష్టాలు పడుతూ బిడ్డల్ని సాకిసంతరించుకున్న తల్లి ఆమె. పొగరుమోతు, రోషకారి, వీరనారి అని ఊరంతా పట్టం కట్టిన పెద్దమనిషి ఆమె. ఊరంతా ఆమె మాటకు జడుస్తారు. తన కష్టంతో ఇల్లు, తోట, పొలం అంటూ ఆస్తులు కూడబెట్టి పెద్ద కొడుక్కి పెళ్లి చేసింది. పుట్టిన మనవరాలిని ప్రాణంగా చూసుకుంటోంది. రెండో కొడుకు బాగా చదివి డాక్టరయ్యాడు. ఇప్పటిదాకా అంతా బాగుంది.
కొడుకు పట్నంలో ఎవరో అమ్మాయిని ప్రేమించాడు. తననే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. అంగమ్మాల్‌కు అభ్యంతరం లేదు. కొడుకు ఇష్టం కంటే ఏం కావాలి? అటు అమ్మాయి అమ్మానాన్నలూ ఒప్పుకున్నారు. సంతోషం. ఇక ముడిపెట్టేయడమే తరువాయి. కానీ..కానీ..అమ్మాయి కుటుంబం పట్నానికి చెందింది. వాళ్లొచ్చి ఊరిలో అమ్మను చూస్తే ఏమనుకుంటారని కొడుకు సందేహం. బీడీ తాగుతూ, మోపెడ్ బండి మీద ఊరంతా తిరుగుతూ, అందరినీ అదిలిస్తూ బెదిరిస్తూ, ఒంటి మీద చీర తప్ప రయిక వేయడం ఎరుగని అమ్మను చూస్తే ఏమని భావిస్తారు? ఇప్పుడిదే కొడుకుల ఆందోళన. ఏం చేయాలి? తల్లినెలా మార్చాలి?
‘ఆ అమ్మాయి వాళ్లమ్మ చుడీదార్‌లు వేస్తుందంట. పిల్లకి అమ్మలాగా కాకుండా అక్కలాగా ఉంటుందంట’ అని పెద్ద కోడలు చిన్నగా అత్తతో అంది. ‘అమ్మ అక్కలాగా ఉండటం ఏంటి? అమ్మంటే అమ్మలాగే ఉండాలి’ అని అంగమ్మాల్ ఆ మాటను తీసిపారేసింది. తన కొడుకులు, కోడళ్లు కలిసి తన రూపాన్ని మార్చాలని చూస్తున్నారని ఆమెకు తెలుసు. తన చేత రయిక వేయించి ఈ కాలపు పద్ధతులు నేర్పించాలని ప్రయత్నిస్తున్నారని అర్థమైంది. బిడ్డల కోసం బతుకునే ధారపోసింది..ఈ బట్టలొక లెక్కా? కానీ..తనది కానిదేదో, తనకు నచ్చనిదేదో తాను మోయడం ఎందుకు? బతుకంతా బిడ్డల కోసం బతికి జీవితం చివరికొచ్చాక కూడా బిడ్డల కోసమే బతకాలా?
ఊరంతా ఆమెకు చెప్పి చూసింది. అంగమ్మాల్ మారలేదు. కుటుంబం ఆమెతో గొడవపడింది. అంగమ్మాల్ మారలేదు. మారకూడదనే పంతం కాదు తనది. ఒక మనిషిని యథాతథంగా స్వీకరించలేని మనుషులు, బంధాలు, అనుబంధాలు..ఎందుకో, ఏమిటో అని ఆమెలో అయోమయం, అర్థంకానితనం. తల్లిగా తను పడ్డ కష్టం, తను చూపే ప్రేమల కన్నా తన ఒంటి మీద కప్పుకునే చారెడు బట్ట ముఖ్యమయ్యే రోజొకటి వస్తుందని ఆమె ఊహించలేదు. సరే..ఆ అమ్మాయి అమ్మానాన్నలు తన ఇంటికొచ్చిన ఒక్క రోజు రయిక వేసుకుంటే ఏం పోయింది? ఏం నష్టం జరుగుతుంది? ఆలోచించింది. ఆ తర్వాత?
ప్రముఖ రచయిత పెరుమాల్ మురుగన్ రాసిన ‘కొడితుని’(చివరి బట్ట) కథ ఆధారంగా దర్శకుడు విపిన్ రాధాకృష్ణన్ తీసిన తమిళ సినిమా ‘అంగమ్మాల్’. ఏమాత్రం అటుఇటుగా తీసినా మెలోడ్రామాగా మారి, బోర్ కొట్టే కథ ఇది. దాన్ని తీసుకొని అద్భుతమైన చిత్రంగా మలిచారు దర్శకుడు. ప్రముఖ దర్శకుడు దివంగత కె.బాలచందర్ కోడలు గీతాకైలాసం ఈ చిత్రంలో అంగమ్మాల్ పాత్ర పోషించారు. సినిమాలో చాలా భాగం జాకెట్ లేకుండా, బీడీ తాగుతూ, మొరటుగా కనిపించే పాత్ర ఆమెది. నటనలో ఏమాత్రం పట్టు తప్పినా తేలిపోయే క్లిష్టమైన పాత్రను సమర్థవంతంగా పోషించి సినిమాను తన భుజాల మీద వేసుకున్నారామె. ఆమె నటన కోసమే సినిమా అంతా చూడాలనిపిస్తుంది. ఈమే శివకార్తికేయన్ నటించిన ‘అమరన్’లో ముకుంద్ తల్లి పాత్ర పోషించారంటే ఆశ్చర్యం వేస్తుంది.
ఈ సినిమా ‘Amazon Prime’లో అందుబాటులో ఉంది. ఓసారి చూడండి. దేశమంతా ఒకే భాష, ఒకే సంస్కృతి అనే నినాదాలు నడుస్తున్న వేళ మనకంటికి దూరతీరంలో మనం ఊహించని మనుషులున్నారని తెలుస్తుంది. రయిక ముడి ఎరుగని బతుకులు బతికే మనుషులు నేటికీ ఉన్నారని, నియ్యతితో జీవిస్తున్నారని అర్థమవుతుంది.
