Newsminute24

childmarriage: 14 ఏళ్ల పిల్లకు పెళ్లి.. ఒక యువతి దుఃఖ పాఠం..!

విశీ:

తెలుగు నేల మీద ఒకానొక కాలం. మనవాళ్లకు పెళ్లికి పిల్ల దొరక్క కేరళ వెళ్లి డబ్బులిచ్చి అమ్మాయిల్ని కొనుక్కునేవారు. ఐదేళ్లు, ఆరేళ్ల పిల్లల్ని ముక్కుకు తాడుకట్టినట్టు మెడకు తాళి కట్టి మలబారు తీరం నుంచి తెలుగు నేలకి లాక్కొచ్చేవారు. అక్కడితో సొంతవాళ్లకూ, ఆ పిల్లకూ సంబంధాలు తెగినట్టే! ఎక్కడి కేరళ, ఎక్కడి ఆంధ్ర? ఆడవాళ్ల పేగుల నిండా ఎంత విషాదం? ఈ అంశంపై రచయిత పిశుపాటి నరసింహం గారు ‘తెగిన పేగు’ అనే కథ రాశారు.

18 ఏళ్లు దాటాక గాని ఆడపిల్లకు పెళ్లి చేయకూడదని Child Marriage Restraint Act (CMRA) 1978లో తీర్మానం చేసింది. 44 ఏళ్ల తర్వాత కూడా భారతదేశంలో 23.3 శాతం ఆడపిల్లలకు 18 ఏళ్ల లోపే పెళ్లి జరిగిపోతోందని National Family Health Survey (2019-21) చెప్పింది‌. సరే! 18 దాటాక పెళ్లి చేస్తారు. మరి ఆ అమ్మాయి సమ్మతి అవసరమా? లేదా? భర్త అంటే ఇష్టం ఉందా? లైంగిక జీవితానికి సిద్ధంగా ఉందా? ఇవేవీ లెక్కలోకి రావు. పెళ్లి అంటే సర్వరోగ నివారిణి అనే ఆలోచన ఉన్నంత కాలం ఆడవాళ్లకు ఈ భారం తప్పేలా లేదు.

2003లో మలయాళ దర్శకుడు టి.వి.చంద్రన్ ‘పాడం ఒణ్ణు: ఒరు విలాపం'(మొదటి పాఠం: ఒక దుఃఖం) అనే సినిమా తీశారు. స్కూల్‌కి వెళ్లే షాహినా అనే 14 ఏళ్ల పిల్లని లాక్కొచ్చి బలవంతాన నిఖా చేసి అత్తారింటికి పంపేశారు తల్లిదండ్రులు. అప్పటికే పెళ్లయి, ఒక బిడ్డ ఉన్న మనిషికి రెండో భార్యగా వెళ్లిన అమాయకురాలికి సంసారం గురించి ఏం తెలుస్తుంది? మొదటి రాత్రి అంటే ఏం అర్థమవుతుంది? భర్త బట్టలన్నీ విప్పి మీద చెయ్యి వేస్తే భయంతో బిగుసుకుపోక ఏం చేస్తుంది? Marriage is a Legalized Prostitution అన్నారెవరో! ఇలాంటి సమయంలో అది సత్యం అనిపిస్తుంది.

… ఆడుకోవడం, చదువుకోవడం తప్ప కుటుంబ బాధ్యతలు తెలియని చిన్నపిల్లకు భార్య అనే పట్టం కట్టి మాటిమాటికీ భర్త పడకగది వైపు లాగుతూ ఉండటం ఏం న్యాయం? ఎంతని ప్రతిఘటిస్తుంది? కోరిక తీరని భర్త చివరకు తనకు నిద్రమాత్రలు ఇచ్చి బలవంతంగా అనుభవిస్తే దాన్ని సంసారం అనాలా? అత్యాచారం అనాలా? సంసార లక్షణాలు లేని ఆడది అని ముద్ర వేసి, తలాఖ్ చెప్పి పుట్టింటికి తోలితే హమ్మయ్య గండం గడిచింది అనుకుందా పిల్ల. కానీ అసలు గండం ముందుందని తనకేం తెలుసు? కనీసం తన జీవిత పాఠం వినైనా పెద్దలు మారతారా? బాల్య వివాహాలు ఆపుతారా?

.21 ఏళ్ల మీరాజాస్మిన్ అనే నటి 14 ఏళ్ల షాహీనా అనే ముస్లిం పాత్ర చేయడం ఆమె కెరీర్లో ఒక మేలి మలుపు. అప్పటిదాకా ఒక రకమైన పాత్రల్లోనే చూసిన తనని ఒక ప్రతిభావంతమైన నటిగా దక్షిణ భారత సినీరంగమంతా గుర్తించేందుకు కారణమైన చిత్రం ఇది. మీకు సినిమా అంతా మీరాజాస్మిన్ కనిపించదు. షాహీనానే కనిపిస్తుంది. అత్తారింట్లో ఉన్న చిన్నపిల్లతో కలిసి ఆడుకుంటూ, భర్త కనిపించగానే పులిని చూసినట్టు బెదిరిపోయే షాహీనానే కనిపిస్తుంది. చక్కగా బడికి వెళ్ళే తనకు పెళ్లి అనే సంకెళ్లు ఎందుకు వేశారో అర్థం కాని అయోమయపు ఆడపిల్ల కనిపిస్తుంది.

ఐదుగురు పిల్లల్లో ఒకరిగా జన్మించి, సినీరంగానికి ఏమాత్రం సంబంధం లేని ఇంట్లో పుట్టి, డాక్టర్ అవ్వాలని అనుకున్న మీరాజాస్మిన్ 19 ఏళ్లకే హీరోయిన్ అయ్యి, 21 ఏళ్లకే ‘పాడం ఒణ్ణు: ఒరు విలాపం’ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్నారు. నటించగలిగే నటులకు పాత్రలు దొరకాలి. అవి తెరపై పండాలి. అలాంటప్పుడే వారికి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. షాహీనా పాత్రతో ఆ అవకాశం దక్కింది మీరాకు.

… కేరళ ముస్లిం వర్గం ఈ సినిమా మీద తీవ్రంగా స్పందించింది. సినిమా దర్శకుడు, నిర్మాతలకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని అంటారు. International Film Festival of Dhakaలో ఈ చిత్రం ప్రదర్శితమై బంగారు పతకం సాధించింది. ముస్లింలు అధికంగా ఉండే ఆ దేశంలో స్థానిక స్త్రీలు ఈ సినిమా చూసి ‘మా జీవితాన్నే తెరపై చూపారే!’ అనడం భౌగోళిక విషాదం. ఈ చిత్రాన్ని అక్కడ గ్రామస్థాయిలో ప్రదర్శించమని వాళ్లు కోరారట. ఒక ముస్లిం దేశంలో అలాంటి స్పందన రావడం ఈ సినిమాకు​ దక్కిన గౌరవం. దేశం ఏదైనా బాధితులు మహిళలే అనేందుకు ఇది తార్కాణం.

P.S: చిత్రం యూట్యూబ్‌లో ఉంది. కానీ Subtitles లేవు.

Exit mobile version