Site icon Newsminute24

Vetrimaaran:‘తను సినిమా దర్శకుడైనంత మాత్రాన నా ఐడెంటినీ వదులుకోలేను’: ఆర్తి వెట్రిమారన్

AarthiVetrimaaran:

(తమిళ సినీ దర్శకుడు వెట్రిమారన్ భార్య ఆర్తి. వారిద్దరిదీ ప్రేమ వివాహం. ఆర్తి ఉద్యోగిని. వారికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి పూన్‌త్రెండల్, అబ్బాయి కదిరవన్. ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌లో ఆర్తి చెప్పిన విషయాలు ఇవి..)

* నాది నాగర్‌కోయిల్, తనది కడలూర్. చెన్నై లయోలా కాలేజీలో చదివేటప్పుడు మా పరిచయం ప్రేమగా మారింది. ‘మనిద్దరం పెళ్లి చేసుకుందామా?’ అని నేను తనను(వెట్రిమారన్) అడిగాను. ‘మన పెళ్లికి పదేళ్లు పడుతుంది. ఫర్లేదా?’ అని అడిగారు. తను సినిమాలు చేయాలని అనుకుంటున్నానని, సినిమాలు చేశాకే పెళ్లి చేసుకుంటానని అన్నారు. నేను కాసేపు ఆలోచించి సరే అన్నాను. నిజంగానే ఎనిమిదేళ్ల తర్వాత మా పెళ్లి జరిగింది. పెళ్లి జరిగే నాటికి నాకు 30 ఏళ్లు.

* మా పెళ్లి విషయంలో ఒకే ఒక్క విషయంలో భయం ఉండేది. మా ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారో, లేదా అని. మా అమ్మానాన్నలు కొంచెం పాతకాలపు సంప్రదాయాలు పాటించే మనుషులు. వాళ్లు నాగర్‌కోయిల్‌లో ఉంటే, నేను చెన్నైలో ఓ ఇల్లు తీసుకుని ఉండి ఉద్యోగం చేసేదాన్ని. నేను కెరీర్‌లో ముందుకు వెళ్తున్న టైంలో ప్రేమ పెళ్లి అంటే ఒప్పుకుంటారా అనేది కొంచెం సందేహంగా ఉండేది.

* కవితాలయ ప్రొడక్షన్స్(దర్శకుడు కె.బాలచందర్ సొంత సంస్థ) నుంచి తనకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. వాళ్లు రూ.10 వేల చెక్ ఇచ్చారు. ఆ రోజు నాకు ఫోన్ చేసి, ‘ఇప్పుడు మనం పెళ్లి చేసుకుందాం. మీ అమ్మానాన్నల్ని రమ్మని చెప్పు. నేను వచ్చి మాట్లాడతాను’ అని అన్నారు. నేను మా అమ్మానాన్నల్ని చెన్నైకి పిలిపించి విషయం చెప్పాను. మా నాన్న ఏమనుకున్నారో నాకు తెలియదు. ఆ రోజు ఉదయం ఇంట్లో సోఫాలో కూర్చుని ఆయన విపరీతంగా ఏడ్చారు. ఆయన్ను పట్టుకొని నేను, అమ్మ కూడా చాలా ఎమోషనల్ అయ్యాం. ‘మిమ్మల్ని కాదని నేను పెళ్లి చేసుకోను. ఒక్కసారి అతణ్ని కలిసి మాట్లాడండి. ఆ తర్వాత మీరు చెప్పినట్లే వింటాను’ అన్నాను.

* వాళ్ల(వెట్రిమారన్) అమ్మ చెన్నైలోనే ఉండేవారు. అమ్మతో కలిసి ఆ సాయంత్రం మా ఇంటికి వచ్చారు. రాగానే మా నాన్నతో మాట్లాడుతూ తన గురించి మొత్తం వివరాలు చెప్పేశారు. తను బాగా సిగరెట్లు తాగుతానని, సినిమా డైరెక్షన్ చేస్తానని, సినిమాల్లోనే ఉంటానని.. ఇలా అన్నీ ఉన్నదున్నట్లు చెప్పేశారు. అదంతా విని మా నాన్నకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇలా ఓ అబ్బాయి తన గురించి తాను పూర్తిగా నిజాలు చెప్పి అమ్మాయిని అడగటం ఆయనకు కొత్త. మా అత్తయ్య(వెట్రిమారన్ అమ్మ) కూడా మా నాన్నతో చాలా బాగా మాట్లాడారు. ‘మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేస్తే చాలు. మాకింకేమీ వద్దు’ అని చెప్పారు.

* వాళ్లు వచ్చి అలా మాట్లాడగానే మా నాన్న చాలా మారిపోయారు. తనను పూర్తిగా ఆమోదించారు. ‘పద.. పద.. మనకు ఎక్కువ టైం లేదు. పెళ్లి పనులు చూసుకోవాలి’ అని మమ్మల్ని హడావిడి పెట్టారు. ఆయనకూ, తనకూ(వెట్రిమారన్) మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. ఇప్పటికీ అది కొనసాగుతోంది.

* Its very tough to be a Creator’s wife. నేను మొదటిసారి గర్భవతిని అయ్యినప్పుడు ‘పొల్లాదవన్’ సినిమా షూటింగ్ జరుగుతోంది. అది తన మొదటి సినిమా. ఆ రోజు ఉదయం ఆఫీసుకు వెళ్లి, సాయంత్రం ఒంటరిగానే హాస్పిటల్‌కు వెళ్లాను. డాక్టర్లు స్కాన్ చేసి అబార్షన్ అయ్యిందని చెప్పారు. అక్కడే బయట ఓ కుర్చీలో కూర్చుని, రెండు గంటలపాటు ఏడ్చాను. ఆ తర్వాత తనకు ఫోన్ చేసి విషయం చెప్పాను. ఏవీఎంలో తన షూటింగ్ జరుగుతోంది. అక్కడికి వెళ్లాను. తనను నాతోపాటు రమ్మనలేను. ఇంటికి వెళ్తానని చెప్పి వచ్చేశాను.

* ఆరోజే నేను నిశ్చయించుకున్నాను, నా సమస్యలు, ఇంటి బాధ్యతల కారణంగా అతను ఎక్కడా డిస్టర్బ్ కాకూడదని. అందుకే ఏం జరిగినా నేనొక్కదాన్నే సొంతంగా సంభాళించుకోవడం నేర్చుకున్నాను. కనీసం వారంలో ఒక్క పూటైనా మాతో గడపమని తనను అడుగుతూ ఉంటాను. సరే..సరే అంటారు తప్ప, అది ఇప్పటివరకూ చెయ్యలేదు.

* నా భర్త సినిమా దర్శకుడైనంత మాత్రాన నా ఐడెంటినీ వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ఇన్నేళ్ల కెరీర్ కారణంగా ఆయన(వెట్రిమారన్) ఎంతో డబ్బు సంపాదించారు. అది పూర్తిగా అతని సంపాదన అనే స్పష్టత నాకుంది. నేను తన భార్యని కాబట్టి తను ఆ డబ్బును నాతో పంచుకుంటున్నారు. కానీ అది ఆయన కష్టం ద్వారా వచ్చిన డబ్బు అనే విషయం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఇదే విషయం నేను నా పిల్లలకు కూడా చెప్తాను.

* నేను కొన్నాళ్లు హైదరాబాదులో పనిచేశాను. అక్కడ నేనొక ఇల్లు అద్దెకు తీసుకొని సొంతంగా ఫ్రిజ్, ఇతర వస్తువులు ఏర్పరచుకున్నాను. ఇవాళ ఆ వస్తువులు నా దగ్గర లేవు. కానీ ఆ రోజుల్లోనే నేను సొంతంగా వాటిని సంపాదించానని తల్చుకుంటే ఇప్పటికీ ఎంతో సంతోషంగా ఉంటుంది. నేను ఉద్యోగస్తురాలిగా ఉన్నాను కాబట్టే అది సాధ్యమైంది. లేకపోతే ప్రతి విషయానికీ తనపై ఆధారపడాల్సి వచ్చేది.

* తను ఎంత సంపాదించినా సరే, పిల్లలకు ఆ డబ్బంతా ఇవ్వొద్దని నేను అంటూ ఉంటాను. పిల్లల అవసరానికి మించి డబ్బు ఇస్తే ఏమవుతుంది? దాన్ని ఎలా ఖర్చు పెట్టాలా అని వాళ్లు ఆలోచించి, ఆ తర్వాత తప్పుదారులు వెతుకుతారు. వారికి అవసరమైనంత డబ్బు ఇచ్చి, మిగిలిన విషయాల కోసం వారినే సొంతంగా సంపాదించమని చెప్తే, వారికి కూడా డబ్బు పట్ల గౌరవం ఏర్పడుతుంది.

* ఫేమ్(Fame) అనేది ఓ మత్తు పదార్థం. అది తలకు ఎక్కించుకుంటే చాలా కష్టం. ఎంత పేరొచ్చినా సరే, తనను తాను తగ్గించుకోవడానికి వెట్రిమారన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తారో నాకు తెలుసు. ఆయనతో ఉన్న నేను కూడా అదే పాటిస్తాను. ఫేమ్(Fame)ని ఏరోజూ తలకు తీసుకోకూడదనే స్పష్టత నాకుంది. నన్ను నన్నుగా గుర్తిస్తే అది నాకు సంతోషం.

* ప్రస్తుతం నాకు 50 ఏళ్లు. నేను IQ BACKOFFICE INDIA PVT.LTDలో బిజినెస్ డెవలప్‌మెంట్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నాను. రిటైర్‌మెంట్ దాకా పని చేయాలని నా కోరిక. చాలా ఇళ్లల్లో మహిళలు భర్త సంపాదన మీద ఆధారపడతారు. మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే తట్టుకోవడం వాళ్ల వల్ల కాదు. ఆ ఆర్థిక సమస్యల్ని హ్యాండిల్ చేయలేక దారుణమైన నిర్ణయాలు తీసుకున్నవాళ్లు కూడా ఉన్నారు. కాబట్టి ఆర్థిక స్వాతంత్ర్యం చాలా ముఖ్యం అని నేను నమ్ముతాను.

* నా కూతురు పూన్‌తెండ్రల్‌కి ఇప్పుడు 15 ఏళ్లు. తను చాలా చురుకైన అమ్మాయి. కొన్నాళ్ల క్రితం వరకూ తను నాతో కలిసి పడుకునేది. ఇప్పుడు వేరేగా రూమ్‌లో పడుకుంటోంది. ఎదుగుతున్న కొద్దీ తన ప్రయారిటీస్ కూడా మారుతూ ఉంటాయి. ప్రైవసీ కోరుకుంటోంది. తను చెవికమ్మలు, గొలుసులు లాంటివి కొన్ని తయారు చేసి అమ్మాలని అనుకుని నాకు చెప్పింది. ‘ఎవరైనా ఒక సెలబ్రెటీ వాటిని కొన్నట్లు ఫొటో పెడితే ఎక్కువ రీచ్ ఉంటుంది’ అని నేను సలహా ఇచ్చాను. కానీ తను ఒప్పుకోలేదు. ‘నాన్నతో సహా ఏ సెలబ్రెటీ ఇందులో ఇన్వాల్వ్ కాకూడదు. నేను సొంతంగా దీన్ని సాధించాలి’ అని చెప్పింది. ఆ మాట నాకు చాలా గర్వంగా అనిపించింది.

* తను(వెట్రిమారన్) నా మీద కోప్పడిన సందర్భాలు చాలా చాలా తక్కువ. బయట ఉన్న టెన్షన్స్ ఏ రోజూ ఆయన ఇంట్లో చూపించరు. మా అమ్మాయి ఏడిస్తే తనకు అస్సలు నచ్చదు. ఏదైనా ఓ విషయంలో నేను పాపను ఏదైనా అంటే తనకు నచ్చదు. ‘ఎందుకలా అన్నావ్.. ఏమైంది’ అని నా దగ్గరకొచ్చి అడుగుతారు. అంతకుమించి ఆయన మా మీద కోప్పడటం కానీ, చిరాకు పడటం కానీ ఏరోజూ జరగలేదు.

* సినిమాకు, సినిమాకు మధ్య తను బ్రేక్ తీసుకుంటారు. ఆ సినిమా పనుల తాలూకు స్ట్రెస్ నుంచి బయటపడేందుకు ఆ టైంలో ఒంటరిగా ఉంటారు. పావురాల్ని పెంచుతూ గడుపుతుంటారు. అంతకుమించి ఆయనకు వేరే అలవాట్లేమీ లేవు. ఆయనకు స్ట్రిక్ట్ డైట్‌లో ఉంటారు. నా ఇంట్లో నేనే వంట చేసుకుంటాను. నేను చేసే బిర్యానీ తనకు చాలా ఇష్టం. ఆరోజు డైట్‌కు డుమ్మా కొట్టి, హాయిగా తినేస్తారు.

* మా అమ్మాయి చాలా Broad-Minded. ఓసారి నేను, మా అమ్మాయి, నా ఆఫీస్ ఫ్రెండ్స్‌ కలిసి దుబాయ్ వెళ్లాం. అక్కడ ఓ చోట తినడానికి కూర్చున్నాం. ఓ అమ్మాయి అక్కడ బెల్లీ డ్యాన్స్ చేస్తోంది. బెల్లీ డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి కొంచెం లావుగా ఉంది. నేను చాలా మామూలుగా ‘ఈ ప్రొఫెషన్‌లో ఉండాలంటే సన్నగా ఉండాలి కదా, ఈ అమ్మాయి ఇలా ఎందుకు ఉంది?’ అని అర్థం వచ్చేలా ఓ కామెంట్ చేశాను. అది మా అమ్మాయి విని ఏడవడం మొదలుపెట్టింది. నాకేమీ అర్థం కాలేదు. ‘అమ్మా.. రేపు నేను లావయితే నన్ను కూడా ఇలా అంటావా?’ అని అడిగింది. నేను ఆ అమ్మాయిని అవమానించలేదని, ఆ ప్రొఫెషన్‌కి అవసరమైన బాడీ షేప్ తనకు అవసరం అని మాత్రమే చెప్పానని ఎంత చెప్పినా వినకుండా తను ఏడుస్తూనే ఉంది. అప్పట్నుంచి తనముందు ఏమైనా మాట్లాడాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను.

* కొన్నేళ్ల క్రితం వరకూ దేవుణ్ని పెద్దగా పూజించేదాన్ని కాదు. ఒక ఆరేళ్ల నుంచి దేవుణ్ని బాగా నమ్మడం మొదలుపెట్టాను. పూజలు బాగా చేస్తాను. నేను కర్మసిద్ధాంతాన్ని నమ్ముతాను. ‘ముర్ పగల్ సెయ్‌విన్.. పిర్ పగల్ విలైయుమ్’ అని తిరువళ్లువర్ అన్నారు. పొద్దున్న తప్పు చేస్తే, సాయంత్రానికి దాని ఫలితాన్ని అనుభవిస్తావని దాని అర్థం. అది నా విశ్వాసం. తను(వెట్రిమారన్) ఏ రోజూ నా నమ్మకాలకు అడ్డుచెప్పలేదు. ఆయనకూ కొన్ని నమ్మకాలున్నాయి. వాటినీ నేనూ అడ్డుకోలేదు. అందుకే ఇద్దరం సంతోషంగా ఉన్నాం.

***
సేకరణ, అనువాదం: విశీ
Taken from: Galatta Tamil Youtube Channel

Exit mobile version