Newsminute24

కాపులకు సంపూర్ణ ‘రాజ్యాధికారం’ రాకున్నా..‘రాజకీయాధికారం’ వచ్చేసిందా?

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజకీయ పార్టీల అధ్యక్షులూ కాపులే!
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవి తమ నాలుగు కులాల్లో దేనికీ రాలేదనే బాధ కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులను ఇప్పుడు దహించివేస్తోంది. నిజమే. సంపూర్ణ ‘రాజ్యాధికారం’ ఇంకా ఈ నాలుగు కులాల సముదాయానికి గగన కుసుమం మాదిరిగానే కనిపిస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ పేరిట జరిగిన తొలి ‘రాజ్యాధికార’ ప్రయత్నం విఫలమైంది. 2014 ఎన్నికల్లో తాను స్వయంగా పోటీచేయని జనసేన మాత్రం తెలుగుదేశం పార్టీని అమరావతిలో అందలమెక్కించింది. కాపులు కింగ్స్‌ కాలేకపోయినా ‘కింగ్‌ మేకర్స్‌’గా తమ సత్తా రుజువు చేసుకున్నారని టెంపరవరీగా పేరు సంపాదించారు.

2019లో జనసేన ఒక అసెంబ్లీ సీటు, దాదాపు ఆరు శాతం ఓట్లు మాత్రమే సంపాదించి కాపుల ఆశలు తీర్చలేకపోయింది. సరే, రాజ్యాధికారం అనేది అడిగితే లేదా ఆశిస్తే వచ్చేది కాదు. పోలీస్‌ కానిస్టేబుల్స్‌ రిక్రూట్‌మెంటులో పరుగుపందెం వంటి పిక్కబలం చూపించే పరీక్షలో పాసైతే వచ్చేది కూడా కాదు. ముఖ్యమంత్రి పదవి అవశేష ఆంధ్రప్రదేశ్‌ లో కూడా కాపు సమూహాలకు అందని ద్రాక్ష అయింది. కాని, ఏపీలోని ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడితో పాటు, మరో మూడు రాజకీయ పక్షాల రాష్ట్ర శాఖ అధ్యక్షులు కూడా కాపులే కావడం విశేషం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్‌ కల్యాణ్, ఎన్నికల విజయాలు దక్కని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కిలారి ఆనంద్‌ (కేఏ) పాల్, ఇప్పుడు కొత్తగా ఏపీలో ప్రారంభమౌతున్న భారత రాష్ట్ర సమితి (భరాసా) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌–వీరంతా కోటా సౌకర్యాలు లేని జనరల్‌ కేటగిరీ కాపు కుటుంబాల్లో పుట్టినవారే.

1956 నవంబర్‌ ఒకటి నుంచి ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి పదవి (రాజ్యాధికారం) కాపు–బలిజ–తెలగ–ఒంటరి (కేబీటీఓ) సముదాయానికి చెందిన నేతలకు దక్కకపోయిన మాట వాస్తవమే. కాని, నాలుగు పార్టీల రాష్ట్ర అధ్యక్షులు కాపులు కావడం ద్వారా కాపులు తెలుగునాట ‘రాజకీయాధికారం’ తమ గుప్పిట్లోకి తెచ్చుకోగలిగారని తరచు తెలుగు టెలివిజన్‌ న్యూజ్‌ చానళ్లలో కనిపించే రాజకీయ విశ్లేషకులు గట్టిగా నమ్ముతున్నారు. నిజానికి, తెలుగు ప్రాంతాల్లో అగ్రకుల కాపులను మొదట ‘మేల్కొలిపింది’ దివంగతలు కేంద్ర మాజీ మంత్రి, మాన్యవర్‌ పుంజాల శివశంకర్‌ గారు, బెజవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగారావు గారు అయితే, ఈ రోజుల్లో కాపు సముదాయాల్లో రాజకీయ స్పృహ నిత్యం రగుల్చుతున్నది మాత్రం తెలుగు టీవీ చానళ్ల డిబేట్లే.

టీవీ 9 మేనేజింగ్‌ ఎడిటర్‌ వెల్లలచెరువు రజనీకాంత్, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ పర్వతనేని వెంకటకృష్ణ ఏపీలో కాపు సముదాయాలకు రాజ్యాధికారం దక్కాలనే విషయంలో కాస్త ఎక్కువ సానుభూతి చూపిస్తున్నారు. టీవీ చర్చలను ఈ దిశగా చక్కగా నడిపిస్తున్నారు. ఈ ఇద్దరు టీవీ జర్నలిస్టులూ వరుసగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కమ్మ కుటుంబాల్లో ప్రమాదవశాత్తూ పుట్టినాగాని టీవీ చానళ్లలో కాపుల రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు కాపాడే విషయంలో ముందు నిలబడుతున్నారు. ఇకపోతే, ఏపీలో నాలుగు రాజకీయపక్షాల రాష్ట్ర శాఖల అధ్యక్షులుగా కాపు దిగ్గజాలే కావడం కాపుల రాజ్యాధికార లక్ష్యం సాధించడానికి పెద్దగా ఉపకరించకపోవచ్చు. కాని, కేబీటీఓ సముదాయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయాధికారం సంపూర్ణంగా సంపాదించడానికి ఈ పరిణామాలు తోడ్పడవచ్చు. చట్టసభలకు పోటీచేసే అన్ని కులాల, పార్టీల అభ్యర్థులకు కాపు నేతలే ‘బీ–ఫారాలు’ జారీచేసే రోజు ఎంతో దూరంలో లేదు. ప్రస్తుతానికైతే ఆంధ్రాలో కాపుల రాజకీయ ఉనికిని కమ్మల నాయకత్వంలోని బడా రాజకీయపక్షాలే కాపాడాల్సిన పరిస్థితులు దాపురించాయని తెలుగు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

==================

Nancharaiah Merugumala(senior Editor)

political analyst

Exit mobile version