రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తప్పుపట్టారు. ఆదివాసీ మహిళా రాష్ట్రపతి తొలిసారి పార్లమెంట్ లో ప్రసంగిస్తుంటే జీర్ణీంచుకోలేకే బీఆర్ఎస్ బహిష్కరించిందన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల మహిళలంటే బీఆర్ఎస్ కు అసహ్యమని, ముర్ము రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు యత్నించారన్నారు. కేసీఆర్ తొలి కేబినెట్ లో మహిళలకు చోటు కల్పించలేదని సంజయ్ గుర్తు చేశారు. తక్షణమే మహిళలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసుల, బీఆర్ఎస్ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తాము తలుచుకుంటే బీఆర్ఎస్ నేతలెవరూ బయట తిరగలేరని సంజయ్ హెచ్చరించారు.
కాగా మారుమూల ప్రాంతానికి చెందిన ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికైన తరవాత పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి మొట్టమొదటిసారి ప్రసంగిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రపతి ప్రసంగం దేశానికి దిశా, దశ చూపేదిగా ఉందన్న సంజయ్.. గత 9 ఏళ్లలో దేశం ఏ విధంగా అభివృద్ధి చేశారో… రాబోయే 25 ఏళ్లలో దేశం ఎట్లా కీలకం కానుందో చెప్పారన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఏమైనా అభ్యంతరాలుంటే… ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొని అభిప్రాయాలు చెప్పొచ్చని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పైకి చెబుతున్నది ఒకటి… లోపలున్నది వేరని.. దళిత, గిరిజన, ఆదివాసీ, బలహీనవర్గాల మహిళలంటే కేసీఆర్ కు ద్వేషమని సంజయ్ పేర్కొన్నారు.