Newsminute24

Telangana:పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది

Telangana:

అంతరించి పోతున్న దేశీయ, సాంప్రదాయ విత్తనాలను కాపాడుకుంటూ,వాటి నిర్వహణను కంపెనీలు, కార్పొరేట్ల గుప్పిట్ల నుంచి రైతు అజమాయిషీ లోకి తీసుకు రావాలని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పిలుపు నిచ్చారు. తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అది రైతు హక్కు అని తెలిపారు.ఈరోజు బహుళ జాతి కంపెనీలు హైబ్రిడ్ విత్తన వ్యాపారంతో రాష్ట్ర ప్రభుత్వాలను శాసిస్తున్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సాంప్రదాయ విత్తనాలతో నే వాటికి చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు.శుక్రవారం రంగారెడ్డి జిల్లా. కడ్తాల్ మండలం అన్మాసుపల్లి లోని ఎర్త్ సెంటర్ లో సెంటర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్-సీజీఆర్, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ మూడు రోజుల పాటు నిర్వహిస్తోన్న తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తన పండుగకు ముఖ్య అతిథి గా ఆయన హాజరయ్యారు.


ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ… బహుళ జాతి కంపెనీలు దేశంలో వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ కూడా ఐటీ, మార్కెట్ ఫీజు మినహాయింపు పొందుతున్నాయన్నారు.
ప్రభుత్వం నిషేధించిన విత్తనాలను కూడా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయని విమర్శించారు.
కలుపు మందులు చాలా విష పూరితమని, అయినా ఎరువుల దుకాణాలలో దొరకడం శోచనీయం అన్నారు.మనకు వనరులు, అవకాశం ఉన్నప్పటికీ సాంప్రదాయ విత్తనాలను పండించడం లేదని, ఇప్పటికయినా మేల్కొనకపోతే ఒకవంక వాతావరణ మార్పుల దుష్ప్రభావం, మరో వంక బహుళ జాతి కంపెనీల చేతిలో ఇబ్బందుల పాలవుతామని కోదండరెడ్డి హెచ్చరించారు.


సాంప్రదాయ విత్తనాల వినియోగానికి, రైతుల హక్కులు కాపాడడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందన్నారు కోదండ రెడ్డి.
అనంతరం విత్తన స్టాళ్లను ఆయన ప్రారంభించి, సందర్శించారు.


ఈ కార్యక్రమంలో CGR ప్రెసిడెంట్ లీలా లక్ష్మారెడ్డి ప్రసంగిస్తూ.. ఆహారం లోనే ఆరోగ్యం ఉందని, దురదృష్టవశాత్తు ఆ ఆహారం కల్తీ అయ్యిందన్నారు. రాబోయే తరాల కోసం సాంప్రదాయ విత్తనాలను రక్షిద్దామని పిలుపు నిచ్చారు.


CGR వైస్ ప్రెసిడెంట్, ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ… మానవ సమాజానికి రైతు చేస్తున్న సేవలో విత్తన పండుగ కూడా ఒకటని అన్నారు. గత ఏడాది CGR నిర్వహించిన విత్తన పండుగ లో 50 స్టాళ్లు ఏర్పాటు చేయగా, ఈసారి 75 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఆహార వ్యవస్థ లో తీవ్ర మైన మార్పులు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా జన్యు సంపద ప్రమాదంలో పడిందని, వాటిని కాపాడటమే విత్తన పండుగ ప్రధాన ఉద్దేశ మని పర్యావరణ వేత్త, కార్యక్రమ కన్వీనర్ దొంతి నర్సింహారెడ్డి తెలిపారు.


రైతు కమిషన్ సభ్యుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ …కల్తీ మందులు, విత్తనాలతో పక్షి జాతులు అంతరించి పోతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ… సమస్య చాలా తీవ్రంగా ఉందని, జీవ వైవిధ్యం నశించి పోతుందన్నారు. కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు తలవంచుతున్నాయని విమర్శించారు.‘నాబార్ఢ్’ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ భాస్కర్ మాట్లాడుతూ… రాష్ట్రం లోని 13 జిల్లాలలోని 180 స్కూళ్ళలో ట్రెడిషనల్ గార్డెన్స్ ఏర్పాటు చేసి విద్యార్ధులకు సాంప్రదాయ వ్యవసాయం పై అవగాహన కల్పిస్తున్న సీజీఆర్ కార్యక్రమం ‘వైఇఎల్పీ’ కి నాబార్డు మద్దతిస్తున్నట్టు చెప్పారు. సాంప్రదాయ విత్తనాల వాడకం కోసం CGR చేస్తున్న కృషిని కొనియాడారు. CGR కు తమ సహకారం ఉంటుందన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ కన్వీనర్ జాకోబ్, జిల్లా అటవీ శాఖాధికారి రోహిత్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Exit mobile version