నల్గొండ : బాలలకు స్వేచ్ఛ, వికాసం కల్పించాలన్నారు జిల్లా ఎస్పీ అపూర్వ రావు. నిరాదరణకు గురైన పిల్లలకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ స్మైల్,ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు.జనవరి 1వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్ స్మైల్-IX కార్యక్రమం ద్వారా 82 మంది బాలలను గుర్తించి చేరదీశామన్నారు. ఇందుకు సంబంధించి 72 క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎవరైనా బాలల స్వేచ్ఛ, వికాసానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. పరిశ్రమలు, బ్రిక్స్ తయారీ, హోటల్స్, లాడ్జ్, మినరల్ వాటర్ సప్లై, దుకాణాలు, ధాబాలు ఇలా ఎక్కడైనా పిల్లలు వెట్టి చాకిరికి గురైతే సంబంధిత యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.
ఇక ఆపరేషన్ స్మైల్-IX కోసం సబ్ డివిజన్ వారీగా మూడు పోలీస్ టీమ్స్ పని చేయడం జరిగిందన్నారు ఎస్పీ అపూర్వ రావు. లేబర్, చైల్డ్ కేర్, రెవెన్యూ, హెల్త్, ICDS, శిశు సంక్షేమం అధికారులు సమన్వయంతో కలిసి పని చేశారని కొనియాడారు. ఎవరైనా వెట్టిచాకిరీ పేరుతో పిల్లలను వేధిస్తుంటే, పోలీసులు లేదా చైల్డ్ కేర్ వారికి సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.