Hariharaviramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా “హరిహరవీర మల్లు” పై దర్శకుడు జ్యోతి కృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా ట్రైలర్ ఈవెంట్‌లో ఆయన, ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. ముఖ్యంగా, సినిమా మీద మొదటినుంచే నెగటివ్ ప్రచారం జరగడంతో, అందుకు ఆయన..“హరిహరవీర మల్లు గుడిసె కాదు.. పవన్ కళ్యాణ్ కంచుకోట!” అంటూ చేసిన ఇండైరెక్ట్ వార్నింగ్ వ్యాఖ్యలు పలు ఊహాగానాలకు తావిస్తోంది.
ఇక ట్రైలర్ ఈవెంట్ లో భాగంగా జ్యోతి కృష్ణ అనేక విషయాలను మీడియాతో పంచుకున్నారు.
ఈ చిత్రం రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోందని..“ఈసారి డేట్ మారదు… కానీ ఇండస్ట్రీ రికార్డులు మాత్రం మారతాయి” అంటూ సినిమా విడుదలపై కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు.“సీజ్ ద షిప్” వంటి యాక్షన్ బ్లాక్‌ను ఇప్పటికే మేము చేసి చూపించామని తెలిపారు.బడ్జెట్ ఎక్కువైందని కొందరు అనడం వాస్తవమేనని… కానీ పవన్ కళ్యాణ్ కోసం ఎంత చేసినా తక్కువేనని పేర్కొన్నారు.“2004లో ఖుషి హైయెస్ట్ గ్రాసర్, తొలి 100 కోట్లు దాటిన సినిమా గబ్బర్ సింగ్ – ఇది పవన్ కళ్యాణ్ రేంజ్!” అంటూ ఆయన స్టార్ పవర్‌ను మరోసారి రీకాల్ చేశారు.
బందర్ పోర్ట్ నేపథ్యంలో ఉండే ఓ భారీ సీక్వెన్స్‌ను CG సాయంతో రీ-క్రియేట్ చేయడానికి రెండు సంవత్సరాల పాటు శ్రమించామని, అది తెరపై చూసేవారిని ఆశ్చర్యపరుస్తుందన్నారు. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
హరిహరవీర మల్లు కూడా 100% స్ట్రైక్ రేట్‌తో హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నామని అన్నారు.“ఈ సినిమా నేను ఒక్కడినే చేశానని చెప్పడం తప్పు అవుతుంది…” అంటూ ప్రాజెక్ట్ విజయవంతానికి సహకరించినవారికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా, ఈ సినిమాకు బేస్ క్రియేట్ చేసిన క్రిష్ గారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే, స్క్రిప్ట్ ఎత్తుపల్లాలు సెట్ చేయడంలో తమకు తోడుగా నిలిచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికీ జ్యోతి కృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.