Newsminute24

ఉత్తరాంధ్ర సమస్యలపై సీఎం జగన్‌ కి మాజీ ఎంపీ కొణతాల లేఖ ..

ఉత్తరాంధ్ర అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ.. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి లేఖ రాశారు.‘‘నీళ్లు`నిధులు`నియామకాలు’ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అన్యాయాలు..వివక్షత అవశేష ఆంధ్రప్రదేశ్‌లో జరగడం అత్యంత బాధాకరమన్నారు. ఉత్తరాంధ్ర నుండి ప్రతీ సంవత్సరం లక్షలాది మంది వలసలు పోతున్నారని.. ఒక్క హైదరాబాదులోనే 15 లక్షల మంది ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు వాచ్‌మెన్‌లుగా, చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ బ్రతుకుతున్నట్లు మీడియాలో అనేక కథనాలు వచ్చిన విషయన్ని లేఖలో ప్రస్తావించారు. వలసలకు ప్రధానకారణం స్థానికేతరుల ప్రాబల్యం పెరిగిపోయిందని.. ఉద్యోగాలన్నీ స్థానికేతరులే పొందుతున్నారని వాపోయారు. స్థానికులకు ఉద్యోగాలు రావడం కోసం నిబద్ధతతో 371`డి ద్వారా ప్రభుత్వ ప్రయివేటు ఉద్యోగాల్లో 85 శాతం స్థానికులకే దక్కే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని కొణతాల విజ్ఞప్తి చేశారు.

 

ఇక ఉత్తరాంధ్రలో వలసలు అరికట్టడానికి యుద్ధప్రాతిపదికన రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొణతాల లేఖలో పేర్కొన్నారు.
స్థానికులకు న్యాయం చేయాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా..రాష్ట్రప్రభుత్వం వివిధ ప్రజాసంఘాలు .. అన్ని రాజకీయ పక్షాలతో బడ్జెట్‌ కి ముందే సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఈ ప్రాంతం అభివృద్ధిపై ఎంత ఖర్చు చేశారు..ఎంత కేటాయించారు తదితర అంశాలపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2023-24 సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్‌లో 15శాతం (విస్తీర్ణాన్ని బట్టి) నిధులు ఉత్తరాంధ్రకు కేటాయించాలని ఉత్తరాంధ్ర చర్చావేదిక తరుపున విజ్ఞప్తి చేస్తున్నామని కొణతాల స్పష్టం చేశారు.

Exit mobile version