Site icon Newsminute24

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మార్గదర్శకులు పట్టభద్రులు : పవన్ కళ్యాణ్

APpolitics:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తేటతెల్లం చేశాయన్నారు జన సేన అధినేత పవన్ కల్యాణ్. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ  పట్టభద్రుల నియోజక వర్గాల ఎం.ఎల్.సి. స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలలో ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదని తేల్చి చెప్పారు. అధికారం తలకెక్కిన వైసీపీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని భావిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. సందిగ్ధంలో ఉన్నవారికి ఈ ఎన్నిక ద్వారా పట్టభద్రులు దారి చూపారన్నారు. నాలుగేళ్ల వైసిపి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అధోగతిపాలు చేస్తున్న తీరును పట్టభద్రులు తమ ఓటు ద్వారా నిరసించారని జన సేనాని స్పష్టం చేశారు. ఈ ఫలితాలు ప్రజల ఆలోచన ధోరణిని తెలియచేస్తున్నాయన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో కూడా ఇటువంటి వ్యతిరేక ఫలితమే ఉంటుందన్న సంగతి..ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ముందుగానే స్పష్టమైందన్నారు. ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ, విజేతలకు పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.

 

 

Exit mobile version