Newsminute24

దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందా..?

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వారం రోజులుగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందలు, వేల నుంచి లక్షలకు కేసులు చేరుకుంటున్నాయి. ఏడు నెలల తర్వాత మరోసారి లక్షకు పైగా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మరోవైపు మహారాష్ట్ర, బెంగాల్‌, ఢిల్లీ, కేరళ, కర్ణాటకల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వీకేండ్‌లో పూర్తి ఆంక్షల అమలుకు పలు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి.

కాగా శనివారం ఒక్కరోజే లక్షా 17 వేల 100 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఏడు నెలల కాలంలో లక్ష కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇటు ఒమిక్రాన్‌ కేసులూ పెరుగుతున్నాయి. తాజాగా నిర్ధారణ అయిన 495 కేసులతో కలుపుకుని దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 3007కు చేరాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 876, ఢిల్లీలో 465, కర్ణాటకలో 333, రాజస్థాన్‌లో 291, కేరళలో 284, గుజరాత్‌ లో 204 ఒమిక్రాన్‌ కేసులు ఉన్నాయి.
అటు అస్సాంలో 1167 కొత్త కేసులు నమోదయ్యాయి. భారీగా కేసులు వస్తుండడంతో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆంక్షలను కట్టుదిట్టం చేసింది అసోం ప్రభుత్వం. ప్రస్తుతం రాత్రి 11.30 నుంచి ఉదయం 6 గంటల వరకు అమలు అవుతున్న రాత్రి కర్ఫ్యూ వేళలను పెంచింది. పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నవారికే వాణిజ్య-వినోద కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోకి అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు. శనివారం నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్లు పేర్కొన్నారు. కరోనా తీవ్రం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు ఆంక్షలను అమలు చేస్తున్న ఒడిశా ప్రభుత్వం… పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. పూరీలోని జగన్నాథ్ ఆలయాన్ని ఈనెల 10 నుంచి 31వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పెరుగుతున్న కొవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే పూజలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఇక ఇటలీ నుంచి పంజాబ్ వచ్చిన మరో ఛార్టెర్డ్ విమానంలోని ప్రయాణికులకు కరోనా బాధితులు ఉన్నట్లు తేలింది. ఇటలీ నుంచి వచ్చిన విమానంలో గురువారం 125 మందికి వైరస్‌ సోకినట్లు తేలగా.. తాజాగా వచ్చిన మరో విమానంలోని 173 మందికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. రోమ్‌ నుంచి అమృత్‌సర్‌కు వచ్చిన 290 మంది ప్రయాణికుల్లో 173 మందికి పాజిటివ్‌ వచ్చింది. అధికారులు వారిని అమృత్‌సర్‌లోని వివిధ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించారు. ఒమిక్రాన్‌ ముప్పున్న దేశాల్లో ఇటలీ కూడా ఉండటం వల్ల కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనల మేరకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ఇటలీ నుంచి పంజాబ్‌ వచ్చిన ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన 13 మంది పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. పరారైన వారి పాస్‌పోర్టులు రద్దు చేయనున్నట్లు అమృత్‌సర్‌ డిప్యూటీ కమిషనర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు.

మరోవైపు కరోనా విజృంభణ ఇలా ఉంటే.. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ జోరుగా కొనసాగుతోంది. 150 కోట్ల మార్కును దాటింది. కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ 150 కోట్ల మార్కును దాటినందుకు ప్రధాని మోదీ.. దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. వ్యాక్సిన్ ప్రక్రియలో ఇదొక మైలురాయిగా అభివర్ణించారు. వ్యాక్సిన్ల కారణంగా అనేకమంది ప్రాణాలు నిలిచాయన్న ప్రధాని… కోవిడ్-19 ప్రోటోకాల్ ను పాటిస్తూ అందరం కలిసి మహామ్మారిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

Exit mobile version