వైసీపీలో తిరుగుబాటు మొదలయ్యిందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. తిరుగుబాటు అనేది అహంకారానికి, ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. అహంకారానికి నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అయితే ..ఆత్మాభిమానానికి ప్రతీక తానన్నారు. జగన్ పాలన పై ఇన్నాళ్లు అసంతృప్తిగా ఉన్న వైసీపీ నేతలు ఓపిక నశించి.. ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటకు వస్తున్నారని రఘురామ స్పష్టం చేశారు. దమ్ముంటే సీఎం జగన్..ఆనం, కోటంరెడ్డి లపై అనర్హత వేటు వేయాలని సవాల్ విసిరారు.
మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన..
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదనతో చేసిన వ్యాఖ్యలను రఘురామ గుర్తు చేశారు. నాలుగేళ్లలో ప్రజలకు ఏమి చేశామని ఓట్లు అడగటానికి.. నియోజక వర్గంలో కనీసం రోడ్లపై గుంతలను కూడా పూడ్చలేని ప్రభుత్వాన్ని ఎలా సమర్ధిస్తారు అంటూ ఆనం వాపోయారని చెప్పుకొచ్చారు. బటను నొక్కాను పెన్షన్లు ఇచ్చానని సీఎం జగన్ చెప్పిన తీరును ప్రస్తావిస్తూ… టిడిపి హయాంలో చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఇవ్వలేదా? అని సూటిగా ప్రశ్నించారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పెన్షన్ మొత్తాన్ని పెంచిన చంద్రబాబునే పక్కన పెట్టిన ప్రజలు..ఇప్పుడు మనల్ని ఎందుకు నమ్ముతారన్న ఆనం రామనారాయణ రెడ్డి వాదనలో నిజ ముందన్నారు. పాలన తీరుతెన్నులపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలకించి..ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని రఘురామకృష్ణం స్పష్టం చేశారు.
ప్రశ్నించిన డి ఎల్..?
ప్రభుత్వ తప్పుడు విధానాలను..ముఖ్యమంత్రి జగన్ అహంకారపూరిత వైఖరిని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి,ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి సైతం ప్రశ్నించారని రఘురామ గుర్తు చేశారు. డిఎల్ వైసీపీ లో ఉన్నారో లేరో తనకు తెలియదన్నారు. 32 ఏళ్ల పిన్న వయసులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖ మంత్రిగా డిఎల్ రవీంద్రారెడ్డి పని చేశారని కొనియాడారు. అంతటి సీనియర్ నాయకుడిని ఎవరు బ్రతిమాలి పార్టీలోకి తీసుకువచ్చారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నారో, లేదో అని సజ్జల రామకృష్ణారెడ్డి అనడం అంటే బలుపా?అంటూ రఘురామ ఆగ్రహాం వ్యక్తం చేశారు.