సిఐడి మాజీ చీఫ్ బలవంతపు అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ జరిపించి… దోషులను శిక్షిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగంలో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించిన తులసి, డాక్టర్ ఆనంద్, నాగరాజులు ఎవరని ఆయన ప్రశ్నించారు. వ్యాపార సంస్థలపై సిఐడి అధికారులు కేసులు నమోదు చేయగానే.. ఆ సంస్థల యాజమాన్యాలను ఎందుకు కలిశారని నిలదీశారు. అగ్రిగోల్డ్, అభయ గోల్డ్, ఇతర ఆర్థిక నేరాల కేసులతో ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏమిటో తేల్చాలని రఘురామ పేర్కొన్నారు.
ఇది ప్రభుత్వమా?… వల్ల కాడా??
రాష్ట్ర ప్రభుత్వ అధిపతి గవర్నర్ ను కలిస్తే తప్పేముందన్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. గవర్నర్ ను కలిసి ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు ఇప్పించమని ఉద్యోగ సంఘాల నాయకులు అడిగితే తప్పేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు టి ఏ.. డీఏ ల రూపంలో 18 వేల కోట్ల రూపాయల బకాయిలు.. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసి ఉందని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘాల నాయకుడు సూర్యనారాయణ..తమ బృందంతో గవర్నర్ కలిసి విన్నవించుకున్నారని తెలిపారు. అదేదో పెద్ద పాపమైనట్లుగా పోటీ సంఘం నాయకుడు శ్రీనివాసరావుతో ఆయన్ని తిట్టించడమే కాకుండా.. సర్వీస్ రూల్స్ కు భిన్నంగా వ్యవహరించారని.. సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేయడం హాస్యాస్పదంగా ఉందని రఘురామ ఎద్దేవా చేశారు.
జీవో నెంబర్ 1 ని కోర్టు కొట్టి వేయడం ఖాయం
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవో 1 ని కోర్టు కొట్టి వేయడం ఖాయమని రఘురామకృష్ణం రాజు తేల్చిచెప్పారు. ఈ జీవోను కోర్టు కొట్టి వేస్తుందని తెలిసే..ప్రభుత్వం మాట మార్చిందన్నారు. పోలీస్ చట్టం 32 ప్రకారం సభలు సమావేశాల నిర్వహణకు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలని మాత్రమే జీవో నెంబర్ 1లో సూచించామని అడ్వకేట్ జనరల్ వాదించడం ప్రభుత్వ వైఖరిని తేట తెల్లం చేస్తోందన్నారు. పోలీస్ చట్టం 1861 ప్రకారం ఇచ్చినట్లుగా చెబుతున్న జీవో నెంబర్ 1 నూటికి నూరుపాళ్ళు చీకటి జీవోనని రఘురామ స్పష్టం చేశారు.
ఇక తనపై వ్యతిరేక వార్తలను ఫ్రంట్ పేజీలో ప్రచురించే సాక్షి దినపత్రిక..కడప లోక్ సభ సభ్యుడు అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయగా..ఆ వార్తను ఎక్కడ కూడా నాలుగు లైన్లు ప్రచూరించకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాదుకు బదిలీ చేసిన తర్వాత కదలిక వచ్చిందన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసును విచారించినప్పుడు, సిబిఐ అధికారులపైనే రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేశారని రఘురామ గుర్తు చేశారు.