Nancharaiah merugumala ( political analyst): “1 9 ఏళ్ల కిందటే తంగజం మనోరమపై భారత ఆర్మీ ‘హత్యాచారం’పై నగ్నంగా వీధుల్లోకి వచ్చిన 12 మంది మణిపురీ మహిళల నిరసన ప్రదర్శన”
Myanmar: కల్లోల మణిపుర్ లో ఇద్దరు కుకీ ఆదివాసీ స్త్రీలను బట్టలూడదీసిన హిందూ వైష్ణవ బహుసంఖ్యాకులైన మేతయీ పురుషులు వారిని ఊరేగించి అవమానించడంపై దేశవ్యాప్తంగా నేడు నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ప్రగతిశీల ప్రజాతంత్రవాదులు నిప్పులు కక్కుతున్నారు. అనేక జాతుల జనమున్న ఈ చిన్న రాష్ట్రంలో కమ్యూనిస్టు (మార్క్సిస్టు) సిద్ధాంతాల ప్రభావంతో కొన్ని తీవ్రవాద తిరుగుబాటు సంస్థలు దశాబ్దాల క్రితమే ప్రభుత్వ పోలీసులు, కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాలపై పోరాటాలు జరిపాయి. అస్సాం రైఫిల్స్ వంటి భారత సైనిక దళాలు మణిపురీ తీవ్రవాదులను అణిచివేసే క్రమంలో అనేక స్థానిక ఆదివాసీ వర్గాలు, మేతయీ గ్రూపుల మధ్య ఉన్న విద్వేషాలను బాగా వాడుకున్నాయి. వివిధ జాతుల జనం మధ్య నిలిచిన నిప్పులపై పెట్రోలు, డీజిల్ పోసి మంటలు ఎగిసిపడేలా చేశాయి అస్సాం రైఫిల్స్ వంటి భారత సాయుధ సైనిక దళాలు. ఈ క్రమంలో మణిపురి మిలిటెంట్లను సక్రమంగా ఎదుర్కొనే సామర్ధ్యం లేని సాయుధ బలగాలు మణిపురి మహిళలపై తమ ప్రతాపం చూపించేవి.
19 ఏళ్ల క్రితం 2004 జులై11న 32 సంవత్సరాల వయసున్న తంగజం మనోరమా (1971–2004) అనే మేతయీ యువతిని 17వ అస్సాం రైఫిల్స్ జవాన్లు రేప్ చేసి చంపేశారు. మనోరమ శవాన్ని ఆమెను అరెస్టు చేసిన ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో వారు విసిరేసి వెళ్లిపోయారు. కుళ్లబొడిసి ఉన్న మనోరమ శవం కనిపించిన తర్వాత జనాగ్రహం ఆకాశాన్ని అంటింది. ఆమె శరీరంలో ఆరు బులెట్లు దొరికినాగాని సైనికుడెవరినీ అరెస్టు చేయలేదు. ఆమెను బలత్కరించడానికే ఇంటి నుంచి జవాన్లు తీసుకుపోయారని ప్రజలకు అర్ధమైంది. దీంతో హత్యాచారం జరిగిన నాలుగు రోజులకు 2004 జులై 15న మణిపురీ మహిళలు 12 మంది తమ బట్టలు పూర్తిగా తీసేసి ఇంఫాల్ లోయలోని కాంగ్లా కోట ముందు ప్రదర్శన నిరసన జరిపారు. తమ ప్రధాన శరీర భాగాలకు–‘ భారత సైన్యమా, మమ్మల్ని రేప్ చేయి (ఇండియన్ ఆర్మీ, రేప్ అజ్)’ అని ఇంగ్లిష్ లో రాసి ఉన్న ఫ్లెక్సీని కొంత వరకు అడ్డుపెట్టుకుని నిరసన తెలపడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.