శ్రీకాకుళం పాతపట్నంలో జనసేన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాజకీయవ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్..సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. సొంత నియోజకవర్గంలో బస్సు షెల్టర్ ఏర్పాటు చేయలేని ముఖ్యమంత్రి.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మూడున్నర ఏళ్లలో ఒక్క పులివెందులలోనే 46 మంది రైతులు కౌలు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ బలమైన నాయకుడు అయితే.. సొంత నియోజకవర్గ రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కనీసం మరమ్మత్తుల గురైన రోడ్ల గుంతలను పూడ్చలేని పరిస్థితి దాపరించిందని దయ్యబట్టారు.
ఇక వంశధార రిజర్వాయర్ ముప్పు బాధితులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం ఇస్తామని మనోహర్ స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో కనీస వసతుల సౌకర్యం లేవని..ఇప్పటికీ అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు డోలీల సహాయంతో వెళ్తున్నారని మనోహర్ ఆవేదన వ్యక్తంచేశారు.
కాగా తాను ఉమ్మడి రాష్ట్ర సభాపతిగా ఉన్నప్పుడు గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చాడు. దురదృష్టవశాత్తు కొత్త జిల్లాల ఏర్పాటుతో శ్రీకాకుళం జిల్లాలోని ఐటీడీఏ మన్యం జిల్లాకు వెళ్లిపోయిందన్నారు. ప్రస్తుతం జిల్లాకు ఐటీడీఏ లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. గిరిజనులు క్షేమం కోసం యువకులను ఐటీడీఏపీవోలుగా నియమించాలని మనోహర్ డిమాండ్ చేశారు.