Site icon Newsminute24

మత్స్యకారులకు ఎల్లవేళలా జనసేన అండగా ఉంటుంది: నాదెండ్ల మనోహర్

ఉత్తరాంధ్ర ప్రాంతంపై జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. విద్య, వైద్యం, వలసల నిరోధం, ఉద్యోగ, ఉపాధి కల్పన వంటి అంశాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో చిన్న చిన్న అవసరాల కోసం కూడా దేహీ అంటూ అడుక్కునే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి శంకుస్థాపనలకే పరిమితమైందన్న ఆయన..రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రజల్లో మార్పు రావాలని వ్యాఖ్యానించారు. 

ఇక మత్స్యకారులను ప్రతి ఒక్క పార్టీ ఓటు బ్యాంకుగా చూస్తుందే తప్ప.. వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేయడం లేదన్నారు మనోహర్. మత్స్యకార గ్రామాల్లో కనీస మౌలిక వసతులు లేవని.. ఈ ప్రాంతం నుంచి ప్రతి ఏడాది లక్షలాది మంది ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కోసం చెన్నై, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు చేస్తున్న పని మనం చేయలేమాని?ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి నిజంగా మత్స్యకారులపై ప్రేమ ఉంటే 192 కిలోమీటర్ల తీరప్రాంతమున్న ఈ ప్రాంతంలో కనీసం 40 కిలోమీటర్లకు ఒక జెట్టీ నిర్మించొచ్చని తెలిపారు. మత్స్యకార సమస్యలపై జనసేన పార్టీకి పూర్తిగా అవగాహన ఉంది కనుకే పార్టీ తరఫున మత్స్యకార వికాస విభాగం ఏర్పాటు చేసి ఒక మత్స్యకారుడిని ఛైర్మన్ గా నియమించిందన్నారు. మత్స్యకార గ్రామాల్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల మ్యానిఫెస్టోలోనే ప్రకటించామని నాదెండ్ల స్పష్టం చేశారు.

 

Exit mobile version