Nancharaiah merugumala senior journalist: (ఇందిర, సంజయ్, రాజీవ్ లకు ‘గాంధీ’ ఇంటిపేరుగా మారడంతో అసలు గాంధీకే చెడ్డపేరొచ్చింది!ఇంటిపేరు మార్పించిన ‘పాపం’ పండిత నెహ్రూదే!)
==================
జర్నలిస్టు–మేధావి, ‘స్వతంత్ర’ కాంగ్రెస్ నేత నేత ఫిరోజ్ గాంధీతో కూతురు ఇందిరా ప్రియదర్శిని (అప్పటికి 24 ఏళ్లు) పెళ్లి సమయంలో (1942, మార్చి 26న) పండిత జవాహర్ లాల్ నెహ్రూ చేసిన ఒక ‘పాపం’ భారతదేశంలో ‘గాంధీ’ అనే గుజరాతీ వైశ్య ఇంటి పేరుకు చెడు లేదా దుష్ట స్వభావాన్ని ఆపాదించేసింది. గుజరాతీ జొరాష్ట్రియన్ (ఫార్సీ లేదా పార్శీ) కుటుంబంలో పుట్టిన ఫిరోజ్ జహంగీర్ (రెండో మాట ఆయన తండ్రి పేరు) ఘాండీ (Ghandy) ఇంటిపేరు ‘ఘాండీ’ నెహ్రూజీకి ఎందుకో ‘ఇబ్బందికరంగా’ కనిపించింది. అత్యంత ఆధునికుడిగా ముద్రపడిన నెహ్రూ జీకి ఫిరోజ్ ఏ కారణంగానో నచ్చ లేదు. అల్లుడు రాసే, మాట్లాడే ఇంగ్లిష్ అంటే కూడా ఆయనకు చిరాకేనట. కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినాగాని చిన్నప్పుడు అలహాబాద్ లో తండ్రి మోతీలాల్ జీ ప్రభావం, ఇంగ్లండ్ స్కూలు, కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థల్లో చదువుల వల్ల తనకు ఇష్టంలేని అల్లుడు ఇంటి పేరు వింతగా కనిపించింది నెహ్రూ గారికి. అందుకే, ‘కనీసం నీ ఇంటి పేరు ఘాండీ ఇంగ్లిష్ స్పెలింగ్ Ghandy ని శాశ్వతంగా Gandhi అని మార్చుకో,’ అని ఆయన పట్టుబట్టారు లేదా సూచించారు మన తొలి ప్రధాని. అంటే తాను తండ్రిగా ప్రేమించే, పూజించే మోహన్ దాస్ కే గాంధీ ఇంటి పేరులా అల్లుడి కుటుంబనామం మారితే ఎవరికీ వింతగా ఉండదని నెహ్రూ జీ అనుకున్నారు. కాదు, తన అల్లుడు ఫిరోజ్ మహాత్మా గాంధీ బంధువు అని జనం భ్రమపడతారనే ఆశ కూడా జవాహర్ లాల్ కు అప్పట్లో ఉండేదనేది కొందరు నెహ్రూ వ్యతిరేకుల అభిప్రాయం.