హైదరాబాద్: రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు సివిల్ వివాదాలను పరిష్కరించే సెటిల్మెంట్ కేంద్రాలుగా మారడాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. “సివిల్ కేసుల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పినా పోలీసులకు అర్థం కావడంలేదా?” అంటూ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
నాగోల్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడకు చెందిన ఓ వ్యక్తి, ఒక భూ వివాదాన్ని రూ.55 లక్షల డీల్ ద్వారా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌తో సెటిల్ చేసుకోవాలని పోలీసుల ఒత్తిడికి గురి చేశారు. బాధితుడిని జూన్ 19న పోలీస్ స్టేషన్లో నిర్భంధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్‌కు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ, పోలీసులు దౌర్జన్యానికి పాల్పడటం పట్ల కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాచకొండ పోలీస్ కమిషనర్, నాగోల్ పోలీస్ అధికారులపై హైకోర్టు సూటిగా ప్రశ్నలు సంధించింది. “సివిల్ కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు పోలీసులు జోక్యం చేసుకోవడం ఎందుకని? కేసులను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారని” హైకోర్టు వ్యాఖ్యానించింది. సివిల్ సెటిల్మెంట్లు ‘తారా స్థాయికి’ చేరాయని, ఈ వ్యవహారంపై కఠిన చర్యలు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలంటే వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల నియంత్రణకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) రూపొందించాలని సూచించింది.