Site icon Newsminute24

Wimbledon:మొక్కవోని నీ పట్టుదలకు శాల్యూట్!

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): తన కళ్లను తానే నమ్మలేని నిజం. తాను కొట్టిన షాట్ కు బదులిచ్చే యత్నంలో, ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిన ప్రత్యర్థి! జస్ట్, తన ముందున్న నెట్ కు అవతలి వైపున! అన్ని వేల మంది ఉత్కంఠతో వీక్షిస్తున్న వింబుల్డన్ సెంటర్ కోర్టులో, తీవ్ర నొప్పితో నేల కూలిన గ్రిగరి దిమిత్రోవ్ కి అత్యంత సమీపంగా ఉన్నది తానే! అందరి కన్నా ముందే షాక్ నుంచి తేరుకున్నది కూడా తనే! మెరుపులా పరుగెత్తుకొని వెళ్లి, వైద్య సహాయకులు-తను కలిసి అతన్ని పైకి లేపి, కుర్చీ దాకా నడిపించుకు వెళ్లాడు ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటకాడు జిన్నక్ సినర్. క్రిక్కిరిసిన స్టేడియంలోని క్రీడాభిమానులంతా నిశ్చేష్టులయ్యారు. ముందు వరుసలో ఉండి ఆట చూస్తున్న మాజీ ప్రపంచ మేటి ఆటకాడు రోజర్ ఫెదరర్ లేచి నిల్చొని ఆదుర్దా వ్యక్తం చేశాడు. నిజానికి మంచి ఊపుమీద, సీడ్ నంబర్ వన్ పైన 7-3, 7-5 రెండు సెట్ల ఆధిక్యతలో ఉండి, 2-2 మూడో సెట్ నడుస్తున్నపుడు జరిగిందీ ప్రమాదం. తీవ్రంగా వచ్చిన నొప్పి వల్ల ఆట కొనసాగించలేక అర్ధాంతరంగా మైదానం నుంచి వైదొలగాల్సి వచ్చింది. నొప్పి తీవ్రత ఎంతుందంటే, చైర్ అంపైర్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కుడిచేతికి, ఎడమ చేతి మద్దతు అవసరమైనంత! అందుకే, తన బ్యాగ్ తో పాటు దిమిత్రోవ్ బ్యాగ్ కూడా మరో భుజాన వేసుకొని క్రీడా స్ఫూర్తి చాటాడు మ్యాచ్ విజేత సినర్. క్వార్టర్ ఫైనల్స్ కు వెళ్లాల్సిన తరుణంలో, నాలుగో రౌండ్ లోనే కథ ఇలా ముగిసింది. ఈ యేటి వింబుల్డన్ కల చెదిరి, కన్నీటి పర్యంతమై భారంగా బయటకు నడిచాడు బల్గేరియన్ వీరుడు దిమిత్రోవ్! ఈ సంత్సరమే, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ఇతర రెండు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లోను దిమిత్రోవ్ (34) ఇంజురీస్ తోనే అర్థాంతరంగా ఆట నుంచి వైదొలిగాడు. నిరుటి వింబుల్డన్, యుఎస్ ఓపెన్ టోర్నీల్లోనూ ఇదే జరిగింది.
అన్నిమార్లు నీ గాయాలు,
ఆట మధ్యలో నిను మైదానం బయటకు నెడుతున్నా,
మొక్కవోని నీ పట్టుదలకు డియర్ దిమిత్రోవ్ ……. శాల్యూట్!

Exit mobile version