ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. “సారా స్కాంలో అరోపణలు ఎదుర్కొంటున్న కవితకు మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. తెలంగాణలో మానవ హక్కులను హరించి పోవడానికి కేసిఆర్ కారణమన్న సంగతి కవిత మరచిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రశ్నించే వాళ్లే ఉండకూడదని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ను ఎత్తేసి.. ప్రశ్నించే వాళ్లపై కేసులు పెట్టి జైల్లో వేస్తున్నరని మండిపడ్డారు. నిజాలు రాసే మీడియాను సైతం తొక్కేస్తున్నారని అన్నారు. పేదల భూములను టీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తూ.. ఇదేంటని అడిగితే బెదిరింపులకు గురి చేస్తున్నారని.. సీఎం కేసిఆర్… బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే తిరగరాస్తానన్నడని… మానవ హక్కులంటే ఇవేనా?’’అని సంజయ్ ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న అరాచకాలకు, అవినీతికి జేజేలు కొడితేనే మానవ హక్కులున్నట్లా? అంటూ సంజయ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ఇక మీడియాను బీజేపీ అణిచివేస్తోందంటూ కవిత చేసిన వ్యాఖ్యలపైనా సంజయ్ ఫైర్ అయ్యారు. ‘‘సీఎం కాగానే కొన్ని టీవీ ఛానళ్లను బ్యాన్ చేసిందెవరని? మీడియాను పాతాళానికి తొక్కేస్తానని బెదిరిస్తున్నదెవరని? సీఎం హోదాలో ప్రెస్ మీట్ పెడితే ఒక్క విలేకరిని కూడా ప్రశ్నించకుండా దబాయిస్తున్నదెవరని? యాడ్స్ , డబ్బులతో పబ్లిసిటీ చేసుకుంటూ మీడియాను మేనేజ్ చేస్తోందెవరూ?’’అంటూ సంజయ్ మండిపడ్డారు.
ఇదిలా ఉంటే .. సీఎం కేసిఆర్ పైన సంజయ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ మానవత్వం లేని మానవ మృగమని ధ్వజమెత్తారు. కొండగట్టు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేరలేదన్నారు. ‘‘ఈ పేదలంతా చేసిన పాపమేందని? బస్సులో ప్రయాణించడమే వీళ్లు చేసిన పాపమా?అని ప్రశ్నించారు. నేటివరకు కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించని సీఎం.. బాధితులు సాయం కోసం వెళితే అరెస్ట్ చేసి జైలుకు పంపుతారా?’’అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే కొండగట్టు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సంజయ్ హామీ ఇచ్చారు. ఈనెల 15న కరీంనగర్ లో జరిగే ప్రజా సంగ్రామ యాత్ర-5 ముగింపు సభకు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి దిగ్విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.