Gurramseetaramulu:
వెతికే దృష్టికోణం, ఓపిక ఉండాలే కానీ మన పూర్వీకుల పాదముద్రలు కూడా చెక్కుచెదర కుండా పదిలంగా ఉంటాయి. ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం అది. పదిలంగా ఉన్న ఆ పాదముద్రలను మనమే చెరిపేస్తాం. ఆలయాల పేరుతోనో ఆనకట్టల పెరుమీదనో ఆకాశ హార్మన్యాల విస్తరణ ద్వారానో. మనిషి గుహనుండి గూటికి మారాక వేట వదిలి ఆవాసం కట్టుకున్నాక భూమి ఆసాంతం సొంతం చేసుకోవాలి అని అడవులు కొట్టాము ఆహార్యం మార్చుకున్నాం. ఇప్పుడు వెతికితే దొరికేవి తెగినతలలు,తుప్పుపట్టిన కత్తులు అంతే. నాగరిక ఆవాస ఆనవాళ్లను తుదమట్టంగా చెరిపేసుకున్నాక గతం గురించి వలపోత ఎందుకు?
చరిత్ర అంటే ఘటనల సమాహారం. ఆ చరిత్రకు విజేతల విహారం తప్ప పరాజితుల గోస అసలే పట్టదు . ఎక్కడో ఒకడు ఉంటాడు బాధ్యతగా వ్యవస్థీకృతంగా అణచివేసిన అనామకుల గురించి తలచేవాడు. పా రంజిత్ లాగా .
తంగలాన్ లాగా. చుట్టూ నైరాశ్యం నిండి ఉన్నప్పుడు వెలుగు దివ్వెల గురించి ఆలోచిస్తూ తలపోతలతో అనామకంగా చరిత్ర కాలగర్భం లో కలిసిపోయిన హవాయి ద్వీపాల మూలవాసుల, అమెరికా రెడ్ ఇండియన్, ఆస్ట్రేలియా అబొరిజినల్, కోయ, గోండు, కోలామ్ సమ్మక్క సారలమ్మలు, బిర్సాముండ గురించో ఆలోచిస్తూ అచ్చం లక్షల కోట్ల ప్రజా వనరును అబూజ్ మడ్ కాపాడుతున్న ఆదివాసీల గెరిల్లా వీరుల్లాగా.
ఒకప్పుడు ఇక్కడ మనిషి మహోన్నతంగా బ్రతికాడు అనడానికి మిగిలిన మట్టి పెంకులు, శిలాజాలు, ఈటె, బల్లెం, వాడేసిన స్నానఘట్టం, ఆ నగర నిర్మాణానికి కూలిన బ్రతుకులు, అధికారం కోసం తెగిన పీకలు. ఆ ధ్వంసం అయిన శిథిలాల లో గతాన్ని వెతుక్కుని ఏం లాభం. ద్వాపర లో చనిపోయిన శ్రీ కృష్ణ పుట్టిన మూలాల గురించి కార్బన్ డేటింగ్ చేస్తాము గానీ ఈ దేశ విముక్తి కోసం రక్త తర్పణ చేసిన రాంజీ గోండ్, బిర్సా ముండా పేరే తలవం.
గడిచిన కాలాన ఒక జాతి మీద మరొక జాతి, ఒక వ్యవస్థ మీద మరొక వ్యవస్థ తమ ఆదిపత్యం కోసమో, తమ జాతి ఉత్కృష్టతను కాపాడు కోవడానికో జరిపిన అమానవీయమైన మారణ హోమాలకు ఏదో ఒకదశలో నేలకు తలవంచి క్షమాపణ చెప్పాయి. తమ పాపాలను క్షమించమని వినమ్రంగా ప్రాధేయపడ్డాయి. కానీ ఏకలవ్యుడు, శంభూకుని మొదలు కంచక చర్ల కోటేశు, మంథని మధుకర్ దాకా నడిచి వచ్చిన నెత్తుటి గాయాలకు క్షమాపణ ఇంకా బాకీనే ఉంది. ఆ బాకీ తీర్చమని అడగాల్సిన అవసరం ఉంది.
ఆ బాకీ తీర్చడంలో భాగమే పా రంజిత్ తంగలాన్ సినిమా తీసాడు. అది మూడు గంటల సినిమా కాదు మూడు వందల తరాల నెత్తుటి చరిత్ర. మద్రాస్, కాలా, కబాలి, సర్పట్టా, పరి ఏరుం పెరుమాళ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే తంగ లాన్ ఒకెత్తు. KGF లాంటి సినిమా చూసాక తంగ లాన్ అవసరమా అనుకోవచ్చు. నిజానికి రంజిత్ కూడా తన ఆలోచనను మార్చుకున్నాడు. కానీ KGF పూర్వరంగంలోకి గని లోతుల్లోకి చరిత్రలో అనామకంగా మిగిలిపోయిన పేజీల లోకి వెళ్ళాడు.
కోలార్ ఒక నాటి వలస పాలకు మాఫియాకు అడ్డా వలస పాలన అంతరం ఆవిర్భవించిన కనిపించని మాఫియా అయిన జాతీయ బూర్జువా కి మరొక అడ్డా.
కోలార్ బొగ్గు గనులు ప్రపంచంలో భారత దేశానికి ఒక అస్తిత్వాన్ని ఇచ్చిన ప్రాంతాలు. ఆసియా ఖండం లోనే మొదట కరెంటు వెలుగు చూసిన ప్రాంతం. వేలాది మంది గని కార్మికులకోసం ఆధునిక విద్య, వైద్యం లభించిన చోటది. కోలార్ గోల్డ్ వెతుకులాట ఇప్పటిది కాదు, రాజరిక కాలం నుండి టిప్పు సుల్తాన్ దాగా సామ్రాజ్య వాదుల నుండి తంగలాన్ దాకా రక్తసిక్తమైన చరిత్ర. ఈ కాలపు దార్శనిక దర్శకుడు ఆగని కార్మిక పూర్వీకుల పాదముద్రల వెతుకులాటలో కోలార్ గనులలోకి వెళ్ళాడు.
రెండు వందల యాభై ఏళ్ళ చరిత్ర రెండున్నర గంటల దృశ్యమానం సాహసమే. ఇది కాలంలోకి ప్రయాణం లాంటిది. అలా వెళ్ళే క్రమంలో పూర్వం గొప్పగా విలసిల్లిన నాగ జాతులు, తథాగతుని అడుగు జాడలు కనుగొన్నాడు. హైందవ సమాజం తెగనరికిన బౌద్ద, జైన ఆనవాళ్ళు కనుగొన్నాడు. మత వ్యాప్తికోసం శైవ, వైష్ణవ తెగలు నరికిన తలల చరిత్ర చూసాడు. బౌద్ద ఆరామాలను లంజల దిబ్బలుగా చిత్రించిన వంచకుల చరిత్ర తడిమాడు. నిజానికి ఇది తెగిన బుద్దుడి తల కోసం తలపోత కాదు. తన బౌద్ధిక ప్రాభవాల ప్రదర్శనా కాదు. మతం రాజేసిన మానవ హననం ఎంత బీబత్సంగా ఉంటాదో వెతికాడు రంజిత్.
బ్రిటిష్ పాలకుల దృష్టి ఈ దేశ అపారమైన సహజ వనరుల మీద పడ్డది, ఆ క్రమంలో భాగమే తమిళ కూలీల భాగస్వామ్యంతో గని వెలికితీత కోసం తంగలాన్ తన వూరి భూమి లేని నిరుపేదలను వెట్టికూలీలను భూస్వామ్యం నుంచి వలస పాలకుల వేతన కూలీలుగా మారడం.
తమిళ, తెలుగు, కన్నడ దళిత కూలీలు మైదాన ప్రాంతాల నుండి భూగర్భంలోకి వెళ్ళారు. అప్పటి వరకు సహజంగా బురద నుండి బంగారాన్ని వెతుక్కునే వాళ్ళు ప్రాంతకమైన లోయలలోకి వెళ్ళేలా చేసింది. తంగలాన్ ఆశతో వలస పాలక ఉచ్చులో పడడాన్ని మార్మిక పద్ధతి లో గ్రామ దేవత హెచ్చరికలు కల్పనగా తీసినప్పటికీ మట్టిని కాపాడుకునే గ్రామ దేవతల నమ్మకాన్ని మాజికల్ రియలిజంలో చెప్పడం రంజిత్ ఎన్నుకున్న టెక్నిక్.
కోలార్ మట్టి పొరల్లో నడిచిన పాదముద్రల చరిత్రలు మళ్ళీ జీవం పోసుకునే లా ఉన్నాయి కొన్ని సన్నివేశాలు.
ఈ సినిమాలో ఇవాళ ప్రపంచ సంపదతో సగం బంగారాన్ని ప్రపంచానికి ఇచ్చిన కోలార్ గని కార్మికుల త్యాగం మొదటి భాగంగా. అక్కడ జమ కూడిన మాఫియా తో తంగలాన్ చేసిన తండ్లాట రెండో భాగంగా రాబోతుంది.
రంజిత్ సినిమా తీసాడా చరిత్ర తిరగ రాసాడా అనేది చూసే వాని దృష్టి కోణం మీద ఆధారపడి ఉంటది. దళిత బహుజన బ్రతుకుల్లోకి వలసవాదం కీడుకన్నా మేలే చేసింది అంటాడు జ్యోతిభా ఫూలే. వాళ్ళు తెచ్చిన ఆధునిక ఫలాలు వాళ్ళ తలరాతను మార్చక పోయినా వాళ్ళు నెలకొల్పిన బడి మూలంగా నాలుగు అక్షరాలు నేర్చుకుని కొద్దో గొప్పో తలెత్తుకుని తిరిగేలా చేసాయి.
కోలార్ ప్రపంచంలోనే అతి పెద్ద గని.ప్రపంచ బంగారు ఎగుమతిలో రెండో స్థానం వేలాది టన్నుల బంగారాన్ని బ్రిటన్ బాండాగారాన్ని నింపింది కోలార్. తంగలాన్ లాగే తమిళనాడు నుంచి వేలాది మంది గని కార్మికులను కోలార్ గనుల్లోకి తీసుకుని వచ్చిన అక్షరం ముక్క రాని చల్లప్ప ఒక పెద్ద స్కూల్ పెట్టేలా చేసింది.
బెంగుళూరు నగర వాసులు ఒకందుకు గని కార్మికులకు రుణ పడి మైసూరు మహారాజ కావేరి వాలీ లో జలవిద్యుత్తు కేంద్రం నెలకొల్పి దేశంలో మొదట ఎలక్ట్రిసిటీ ని వినియోగించింది ఈ గనినే. తర్వాత రెండేళ్ల తర్వాత నూటా యాభై కిలోమీటర్లు పోల్స్ వేసి మైసూర్ నగరానికి కరెంటు అనేది ఒకటి ఉంటది అని తెలిసింది.
వెలుగు జిలుగు జలతారు మెరుపులకు అవవాటు పడ్డ తెలుగు తెరకు మట్టి వాసన అద్దిన వాడు రంజిత్. తాతలు నేతులు తాగారు అని చెప్పే కాకకమ్మ కథల స్థానే తెగిపడి శంబూకుని శిరస్సు చెప్పిన రహస్యాలను తవ్వి తీస్తున్నాడు. పెట్టుడు మీసాలు పిట్టగూడు లాంటి విగ్గుకు అలవాటు పడ్డ బాబుల దాబుల దర్పాలు కాదు వంటి చేత్తో వందల మందిని హతం చేయడం కాదు. చేతి కర్రను ఆయుధంగా మర్మకళను, రస విద్యనూ, సిద్ద వైద్యాన్ని, సిద్దుల జ్ఞానాన్ని వొడిసిపట్టాడు. మొత్తంగా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిన కక్కడి వారసుల ప్రతిరూపమే ఇవ్వాల్టి తంగలాన్.రేపటి బిర్సాముండా, అద్దాల బాలమ్మ లు చరిత్ర ను తిరగ రాయబోతున్నారు.
ప్రకృతి మనకు ఒనకూర్చిన వనరుల మీద ఆధిపత్యం కోసం ఒక నాటి రాజరిక, తర్వాత మధ్యయుగ కొనసాగింపుగా వచ్చిన ఆధునిక సమాజాలు రాజేసిన యుద్దాల వెనక అన్యాక్రాంతం అయిన మూలవాసుల ఆర్తనాదం తంగలాన్. ఆధునిక మానవుడు అనుభవిస్తున్న సకల సౌకర్యాల వెనక అనామకంగా మిగిలిపోయిన ఆదిమ సమాజాల ఆనవాల్ల వెతుకులాట తంగలాన్.
తంగలాన్ కేవలం ఒక గని కార్మికుడి చరిత్ర మాత్రమే కాదు. ఆయన పనిచేసిన కోలార్ గనులు ప్రపంచ సంపదను పెంచిన కేంద్రం మాత్రమే కాదు. కోలార్ ఇంత సంపదను ప్రపంచానికి ఇచ్చింది. కోట్ల టన్నుల మట్టిని ఎత్తిపోసిన లక్షలాది కార్మికుల అనామకుల చరిత్ర. వాళ్ళు ఏనాడూ ఏ ఆధిపత్య చరిత్రలో అయినా ఒక పేజీకి నోచుకోలేదు.
వాళ్ళకు వాళ్ళే మేము ఏమీ కాదు కేవలం దుమ్ము మాత్రమె” “మా చరిత్రను సుడిగాలి కబళించింది ధూళిలో కలిసి పోయింది అని తంగలాన్ పూర్వీకులూ ఆయన వారసులూ అనుకున్నారు. ఆ విస్మృత చరిత్రను వెండితెర మీద దేదీప్య వెలుగులో దృశ్యమానం చేసాడు రంజిత్. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు అసంబద్దంగా అనిపిస్తాయి. ఇంకొంచం శ్రద్ద పెటాల్సిన అవసరం ఉంది. ఆరతి అనే పాత్ర ఫిక్షనల్ వనదేవత కాకుండా నిజంగా ఆ జనాలలో పనిచేసే ఒక మనిషిగా కథ రాసుకుంటే బాగుండేది. కథనం ఇంకొంచం గ్రిప్పింగ్ గా రాసుకోవాల్సింది.
కోలార్ బొగ్గుగనుల ప్రాంతాలు పందొమ్మిదో శతాబ్దపు చివర ఇవయ్యో శతాబ్దపు మొదటి దశలో బుద్ధిస్ట్ ఆలోచనలకు కేంద్రం అయ్యింది. అక్కడే దళితులు అంటరాని వారు కాదనీ వాళ్ళు కులం ఆనవాళ్ళు లేని ద్రావిడులు అనీ కులరహిత సమాజానికి ఆద్యులు అని దండోరా వేసుకున్నారు. కోలార్ కేంద్రంగా ఒక ప్రత్యామ్నాయ చరిత్రనే నడిపారు. బుద్ధిస్ట్ సొసైటీ ని బలంగా ముందుకు తీసుకుని వచ్చిన అయోతి దాస ఆలోచనలు ముందుకు తీసుకుని వెళ్ళడానికి కోలార్ గనులు ఆది ద్రావిడ ఉద్యమానికి కేంద్రం అయ్యాయి.
అయోతి దాసను తన గురువుగా భావించే అంబేద్కర్, అంబేద్కర్ ఆలోచన ఇరుసుగా సినిమాలు తీసే పా.రంజిత్ వెనక స్పూర్తి దాయక స్వాభిమాన ఉద్యమాలు ఉన్నాయి.
ఈ సినిమాలో మత వ్యాప్తి ఉంది, మత మార్పిడి ఉంది, భూమిని స్వాధీనం లో ఉంచుకుని తరాలుగా వెట్టి చాకిరీ చేయించుకున్న రాజరిక, మధ్యయుగాల దాష్టీకం మీద తిరుగుబాటు ఉంది. చావుని ఎదిరించిన వాల్లకు మాత్రమే ఇక్కడ జీవితం , చావుని ఎదిరించి బ్రతికినా పోరాడినా చనిపోయినా నీ ఉనికిని నిరాకరించే ఉదంతాలు ఎన్నో
హింసను ఉగ్గుపాలతో పోసే వాజ్మయమూ, హేతువుని ఏమాత్రం సహించని అసంబద్దత ను పెంచి పోషించిన సమాజాలు తంగలాన్ ధిక్కారాన్ని ఏమాత్రం సహించవు. వంద తలలు, కవచ కుండలాలు, మట్టి కుండల్లో జీవం పోసుకున్న మహిమాన్వితుల జీవిత కల్పనాజగత్తుకు అలవాటు పడ్డలోకానికి కల్చరల్ షాక్ ఈ సినిమా.
రంగు వెనక రాజకీయాలను రంజిత్ చెప్పినంత బలంగా ఏ దర్శకుడూ చెప్పలేదు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఇది గొప్ప ప్రయత్నం.
తంగలాన్ అంటే తెలుగు అంటే బంగారు బిడ్డ అని అర్ధం. ఇవ్వాళ ప్రపంచ సంపదను బంగారు నిల్వలలో చూసి మురిసి పోతున్న సమాజాలు. వేల టన్నుల బంగారం వంటి మీద సింగారించు కొంటున్న సకల లోకం ఆ అలంకరణ వెనక కోట్లాది మంది చెమట నెత్తురు ఉంది అని మరిచిపోతారు. బురద నుండి బువ్వ తేసే రైతుకు బూడిద నుండి బంగారం తీసే శ్రమ జీవిని ఏనాడు మనం పట్టించుకున్నాము కనుక ?
ఏది ఏమైనా తంగలాన్ జీవిత పోరాటం ఈ కాలపు దిక్కారం. జేమ్స్ కెమరాన్, అవతార్ సినిమాలో తరాలుగా మూలవాసులు కాపాడుకున్న సహజ సంపద కోసం వచ్చిన ఆధునిక విధ్వంస కారుల లాగా అనిపించారు.విక్రం నటన అమోఘం. మెల్ గిబ్సన్ తీసిన తీసిన ‘అపొక్లిప్టో’ రూడి యంగ్ బ్లడ్ నటన కన్నా తక్కువేమీ కాదు .చివరిగా ఒకటి చెప్పగలను మనకొక దేశీ మెల్ గిబ్సన్ దొరికాడు.
ఈ సినిమా చూస్తున్నంతసేపు కోటాను కోట్ల సంపదను కబలించాలి అని చూస్తున్న బహుళ జాతి సంస్థలను దిక్కరిస్తున్న బస్తర్ లో వేలాది మంది తంగలాన్ లే యాదికి వచ్చారు.ఇది కాపాడు కోవాల్సిన పరంపర. త్యాగాల పునాదిగా ఆవిర్భవించ బోతున్న మానవీయ సమాజానికి నాందీ.