ఆర్.దిలీప్ రెడ్డి(సీనియర్ జర్నలిస్ట్):
నూరేళ్ల కింద పుట్టి, మావో అన్నట్టు ‘నూరు పూలు వికసించనీ వేయి ఆలోచనలు సంఘర్షించనీ’ అన్న చందంగా తెలంగాణ సమాజాన్ని చైతన్య పరచిన పాత్రికేయ వైతాళికుడు ఎం.ఎస్.ఆచార్య. చదువరి అయిన ఆయన నిరంకుశ నిజాం కు వ్యతిరేకంగా సాగిన ప్రజా ఉద్యమం నుంచి పుట్టిన నికార్సయిన జర్నలిస్టు. నిజాన్ని నిర్భయంగా పలికి, అక్షరాన్ని జనం అవసరంగా మలచిన సంపాదకుడు. భారత స్వతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ విముక్తి పోరాట వీరుడు. ఉద్యమ ఆచరణలో అబ్బిన జనహితం, సత్యసంధతను ఆజీవన పర్యంతం పాటిస్తూ ‘జనధర్మ’ ను ‘వరంల్ వాణి’గా వినిపించిన కలం కర్మయోధుడాయన. అందుకే, ఆయనలో అంత నిబద్దత, దానికి దన్నుగా ఎనలేని దైర్యం-తెగింపు. జీవితంలో ఎదురైన ప్రతి సవాల్ ను స్వీకరించి, వాటిని అవకాశాలుగా మలచి, జర్నలిజమే ఆయుధంగా జనంలో అవగాహన పెంచిన మేటి ఆచార్య. నిద్ర నుంచి అప్పుడప్పుడే మత్తు వదులుతున్న తెలంగాణ సమాజానికి పత్రికా వేదికలు కట్టి ప్రశ్నించడం నేర్పారాయన. జర్నలిజం దారితప్పి, అయోమయానికి గురై ఎటు నడవాలో తేల్చుకోలేని నాలుగురోడ్ల కూడలిలో నలుగుతున్న పాడు కాలమిది. నిజంగా ఇదే, ‘జర్నలిజం జనం కోసం- ఆ పోరులో మనం సైనికులం’ అని మనసా-వాచా-కర్మణా త్రికరణ శుద్ధిగా చాటి, ఆ వృత్తి ఔన్నత్యాన్ని శిఖరాయమానం చేసిన ఆచార్యను నిజంగా తలచుకోవాల్సిన సమయం. ఆయన నుంచి ఆధునిక తరం నేర్చుకోవాల్సింది, స్ఫూర్తి పొందాల్సింది ఎంతో ఉంది. నిజాం రాకాసి మూక రజాకార్ల ప్రత్యక్ష దాడులనెదుర్కొన్న దైర్యశాలి అతడు. పత్రికతో సంబంధముంటేనే రాజద్రోహం కింద పరిగణించే నిరంకుశ పాలనాకాలంలో, స్వాతంత్ర్య కాంక్షకు ప్రతీక అయిన ‘ఆంధ్రపత్రిక’కు ఆనాడు వరంగల్ లో ఎం.ఎస్.ఆచార్య ఒక పర్యాయపదం. పత్రిక చేతపట్టుకొని వీధి వీధి తిరిగిన స్వేచ్ఛా గీతమాయన.
ఒకదశలో…
తన ప్రాణాలను పణంగా పెట్టి, కుటుంబ అభద్రతకు వెరవకుండా వృత్తి ధర్మాన్ని నెత్తికెత్తుకున్న సాహసి! హితులు, సన్నిహితుల సూచన విని కుటుంబాన్ని గుంటూరుకు పంపించి, తాను వరంగల్ లోనే ఉండి నిర్భీతితో వృత్తి కొనసాగించిన తెంపరి. అలుపెరుగని అక్షర యుద్దంలో ఆత్మరక్షణ కోసం తానూ విజయవాడ-గుంటూరు ప్రాంతానికి, బలవంతపు వలస వెళ్లి, ‘ఆపరేషన్ పోలో’ సైనిక చర్య తర్వాతే స్వస్థలం చేరారు. ఒకవంక ‘జనం’, మరో వంక ‘ధర్మం’ రెండు కళ్లు చేసి, తెలంగాణ జీవగడ్డ వరంగల్ నేలమీద ‘జనధర్మ’ రాజకీయ వారపత్రిక ను 1958లో ప్రారంభించారు. పాలకులకు బాధ్యత, ప్రభుత్వాలకు జవాబుదారీతనం గుర్తొచ్చేలా ప్రశ్నిస్తూ, మరోపక్క ప్రజలను చైతన్యపరిచే దివిటీలు జనధర్మ సంపాదకీయాలు. మొహమాటాలు లేని స్పష్టమైన అభివ్యక్తి, పద ఢాంబికాలు లేని సూటి-సరళమైన భాష ఆయన అస్త్రాలు. అశేష ప్రజాదరణ పొందిన జనధర్మ వారపత్రిక 1980లో ‘వరంగల్ వాణి’గా దినపత్రిక రూపు దాల్చింది. ప్రజల నిత్య సేవలో ఎం.ఎస్.ఆచార్య బాధ్యత మరింత పెరిగింది. అలా మొక్కవోని దీక్షతో దశాబ్దాల తరబడి ప్రజాక్షేత్రంలో అక్షర సేద్యం చేసిన కృషీవలుడు ఆచార్య 1994 జూలై 12న శాశ్వతంగా కలం దించారు. సేవలు చాలించి, స్ఫూర్తిని మిగిల్చి పరమపదించారు.
విలువలతో కూడిన పాత్రికేయ, సంపాదకీయ వృత్తి బాటను తన సమకాలీన, తదనంతర తరానికి అందించి వెళ్లిన ఎం.ఎస్.ఆచార్య పనిలో పనిగా మరొక గొప్ప వారసత్వాన్ని మనకు అందించి వెళ్లారు. ఆ కానుకే, ఆయన తనయుడు డాక్టర్ మాడభూషి శ్రీధరాచార్యులు. జర్నలిజం, బోధన, న్యాయశాస్త్ర రంగాల్లో విశేష కృషి చేసిన/చేస్తున్న ధీశాలి. ఆచార్య శ్రీధర్ దేశం గర్వించదగ్గ జనహితైషి, నాకు అత్యంత ఆప్తమిత్రుడు. నాకు సోదరుని వంటి మిత్రునికి జన్మనిచ్చిన, ఆయన గర్వించదగిన తండ్రి శతజయంతి వార్షికోత్సవ సందర్భంగా, ఆ పెద్దాయనని గుర్తు చేసుకోవడం, నాకు తెలిసిన నాలుగు ముక్కలు మననం చేసుకోవడం నాకెంతో తృప్తి, ఆనందాన్నిచ్చే విశేషాంశం.